పద్మభూషణులతో కాసేపు..

పద్మభూషణులతో కాసేపు..


ఈసారి ‘పద్మ’ అవార్డుల్లో తెలుగువారి కీర్తి శిఖరం రెపరెపలాడింది. దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో చాటిన హైదరాబాదీ క్రీడాకారిణులు సానియామీర్జా, సైనా నెహ్వాల్‌తోపాటు ఆరోగ్య రంగంలో ఎంతో కృషి చేసిన శాస్త్రవేత్త ఆళ్ల వెంకట రామారావు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి, తెలుగు భాషను సుసంపన్నం చేసేందుకు కృషి చేస్తున్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌లను పద్మభూషణ్ పురస్కారం వరించింది. రామోజీరావు, యామినీ కృష్ణమూర్తిలకు పద్మ విభూషణ్ అవార్డు.. రాజమౌళి, కె.లక్ష్మాగౌడ్, ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే, మన్నం గోపీచంద్, డాక్టర్ నాయుడమ్మ, సునీతా కృష్ణన్, టి.వి.నారాయణ తదితరులకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించడం తెలిసిందే. ఈ సందర్భంగా పద్మభూషణులను ‘సాక్షి’ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఆ విశేషాలు ఈ వారం ‘ఫోకస్’లో...



దేశ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేస్తా..


రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధిస్తా: సైనా నెహ్వాల్

 

 హైదరాబాద్ నుంచి ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న క్రీడాకారుల్లో సైనా నెహ్వాల్ ఒకరు. దేశంలో బ్యాడ్మింటన్ క్రీడకు గుర్తింపు, ప్రచారం తీసుకువచ్చింది ఆమేనంటే అతిశయోక్తికాదు. ఈ సేవలను గుర్తించే ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్‌కి ఎంపిక చేసింది. ఈ పురస్కారం ప్రపంచ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించేందుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని.. దేశ ప్రతిష్టను పెంచేందుకు తాను శాయశక్తులా కృషి చేస్తానని సైనా నెహ్వాల్ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ విశేషాలు..



ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకోబోతున్నారు. దీనిపై మీ స్పందన?

 సంతోషంగా ఉంది. 2010లోనే పద్మశ్రీ పొందాను. ఇప్పుడు పద్మభూషణ్.. ఓరకంగా చిన్న వయసులోనే గొప్ప గౌరవాన్ని పొందనుండడం గర్వంగా అనిపిస్తోంది. ఆటతో పాటు చాలా మందికి ఆదర్శంగా నిలవడం వల్లే ఈ ఖ్యాతి దక్కిందని భావిస్తున్నాను. వాస్తవానికి ఈ అవార్డును నేనేమాత్రం ఊహించలేదు.



క్రీడాకారిణి అయిన మీకు పౌర పురస్కారం రావడాన్ని ఎలా భావిస్తారు?

 ఆటపరంగా గత ఏడాది అత్యున్నత స్థాయిలో రాణించాను. సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రితో పాటు ఇండియా ఓపెన్ సూపర్‌సిరీస్ టైటిల్ సాధించా. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్, ప్రపంచ చాంపియన్‌షిప్, చైనా ఓపెన్‌ల్లో ఫైనల్స్‌కు వెళ్లాను. దీనికి తోడు తొలిసారిగా భారత్ నుంచి ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్‌గా పేరు తెచ్చుకున్నాను. ఓవరాల్‌గా దేశంలో ఈ ఆట పాపులర్ అయ్యేందుకు నా వంతు సహకారం ఉందని చెప్పగలను. సామాజిక పరంగా నా పరిధి మేర వీలైనంత కృషి చేస్తూనే ఉన్నాను. అస్సాం వరదలతోపాటు నేపాల్ భూకంప బాధితులకు విరాళాలందించాను. ఇటీవలి చెన్నై వరదల నేపథ్యంలో క్రీడాకారుల నుంచి తొలిసారిగా నేను స్పందించి ఆర్థిక సహాయం చేశాను.



ఇతర పద్మభూషణ్ విజేతల గురించి మీ అభిప్రాయం?

 నాతో పాటు ఈ అవార్డును అందుకోనున్న మిగతా వారి గురించి నేనేమీ చెప్పలేను. కానీ సానియా మీర్జాకు పద్మభూషణ్ రావడం ఆనందాన్నిచ్చింది. ఇద్దరం ఒకేసారి ఆటల్లో ప్రస్థానం ప్రారంభించాం. ఒకేసారి నగరం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి పేరు తెచ్చుకున్నాం. అలాగే ఒకే సమయంలో ప్రపంచ నంబర్‌వన్ కాగలిగాం. ఇప్పుడు ఈ అవార్డు కూడా.. ఇది నిజంగా హైదరాబాదీ స్పెషల్‌గా భావిస్తున్నాను.



ఈ అత్యున్నత పురస్కారం భవిష్యత్‌లో మీకు ఎలాంటి ప్రోత్సాహాన్నిస్తుంది?

 ప్రపంచ బ్యాడ్మింటన్‌లో మరిన్ని విజయాలు సాధించేందుకు ఇది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. గతేడాదికన్నా మెరుగైన ప్రదర్శనతో ఈసారి ముందుకెళతాను. అలాగే రియోడిజనీరోలో జరిగే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి దేశ ప్రతిష్టను మరింత పెంచేందుకు నా శాయశక్తులా కృషిచేస్తాను.


డయాబెటిస్‌నూ నయం చేయవచ్చు

 పద్మభూషణ్ గ్రహీత, గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణుడు డాక్టర్ నాగేశ్వరరెడ్డి

 

 ఎంతో అభివృద్ధి చెందిన దేశాల నిపుణులు కూడా... గ్యాస్ట్రో ఎంటరాలజీలో శిక్షణ కోసం భారత్‌కు వస్తుంటారు. ఎందుకంటే ఆ రంగంలో మన దేశం సాధించిన పురోగతి ఎంతో అద్భుతం. ఈ పురోగతికి గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణుడు డాక్టర్ నాగేశ్వరరెడ్డి వంటి నిపుణులే కారణం. ఆరోగ్య సేవల రంగంలో ఆయన కృషిని గుర్తించిన ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. ఇప్పుడు ఎంతో మందికి సమస్యగా మారిన మధుమేహం (డయాబెటిస్)ను కూడా పూర్తిస్థాయిలో నయం చేయవచ్చని చెబుతున్న నాగేశ్వరరెడ్డి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు..



పద్మభూషణ్ పురస్కారం రావడంపై మీ స్పందన..

 సంతోషంగా ఉంది. ఈ విభాగంలో పద్మభూషణ్ దక్కిన వారు చాలా తక్కువ. ఇది నాకు వ్యక్తిగతంగా లభించినట్లుగా కాకుండా మా సంస్థకూ, మా గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి దక్కిన పురస్కారంలా భావిస్తున్నాను.



 గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో సరైన సేవలు అందుతున్నాయా? ఆ దిశగా మీ కృషిని గురించి చెప్పండి..

 మన జనాభాలో 30% మంది ఆసిడిటీ, అల్సర్స్, గ్యాస్ట్రిక్ కేన్సర్లు, పాంక్రియాస్, పెద్దపేగు టీబీ వంటి గ్యాస్ట్రో ఎం టరాలజీ సమస్యలతో బాధపడుతున్నారు. నిజానికి డయాబెటిస్, హైబీపీతో బాధపడుతున్నవారికంటే గ్యా స్ట్రో సమస్యతో బాధపడేవారు ఎక్కువ. ఇక్కడివారిలో జన్యుపరంగానే ఈ సమస్యతో బాధపడేందుకు అవకాశాలెక్కువ. ఏపీ, తెలంగాణల జనాభా 8 కోట్లు అనుకుంటే గరిష్టంగా కోటి మందికి మాత్రమే ఇప్పుడు గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణుల సేవలు అందుతున్నాయి. బాధితులందరికీ సేవలు అందాలంటే ఇప్పుడున్న సంఖ్యకు పదిరెట్లు ఎక్కువ మంది నిపుణులు అవసరం. ఇప్పుడున్న పరిస్థితిలో అందరికీ సేవలు అందాలంటే పదేళ్లు పడుతుంది. అందుకే కొన్ని మొబైల్ సెంటర్స్ పెడుతున్నాం.



ఇటీవల కొన్ని శస్త్రచికిత్స ప్రక్రియల ద్వారా డయాబెటిస్‌కు మంచి చికిత్స అందనున్నట్లు తెలిపారు. ఆ పరిశోధనల్లో పురోగతి గురించి చెప్పండి..

 డయాబెటిస్‌లో టైప్-3కి ఐలెట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రి య ద్వారా చికిత్స అందించడానికి ప్రభుత్వ అనుమతి లభించింది. అలాగే టైప్-2కు ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా చికిత్స అందించే ప్రక్రియ విజయవంతమైంది. త్వరలో అందుబాటులోకి వస్తుంది.



ఎన్నో దేశాల నుంచి గ్యాస్ట్రో ఎంటరాలజీ చికిత్స కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర మాత్రమే లభ్యమయ్యే కొత్త చికిత్సా విధానాలేమిటి?

 నేను ‘ఎండోస్కోపీ ఫెడరేషన్’కు అధ్యక్షుడిని. ఇందులో 160 దేశాలు ఉన్నాయి. ఆధునిక సాంకేతికత ఉన్న అమెరికా, జపాన్, జర్మనీల కం టే మన దగ్గర ఉన్న పరిజ్ఞానాన్ని పంచుకునేందుకు అనేక దేశాల నిపుణులు వస్తున్నారు. అంతేకాదు మెడికల్ టూరిజంలో భాగంగా ఎంతో మంది రోగులు  చికిత్స కోసం హైదరాబాద్‌కే వస్తున్నారు.



గ్యాస్ట్రో ఎంటరాలజీలో అడ్వాన్స్‌డ్ విధానాల ద్వారా డయాబెటిస్‌ను రాకుండా అరికట్టే విధానంగానీ, వచ్చినా నయం చేసే చికిత్సగానీ ఏదైనా ఉందా? సమీప భవిష్యత్తులో డయాబెటిస్ రోగులకు అందే శుభవార్త ఏదైనా ఉందా?

 గ్యాస్ట్రో ఎంటరాలజీ, గ్యాస్ట్రిక్ కేన్సర్‌కు సంబంధించి రెండు అంశాలున్నాయి. మొదటిది కరెక్టబుల్ ఫ్యాక్టర్స్. అంటే మనం తీసుకునే జాగ్రత్తల ద్వారా నివారించగలిగేవి. రెండోది నాన్‌కరెక్టబుల్ ఫ్యాక్టర్స్. మనం జాగ్రత్తలు తీసుకున్నా పెద్దగా నివారించలేనివి. అంటే జన్యుపరంగా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం, ఇన్సులిన్ ఉత్పత్తయినా దానికి శరీరం నుంచి రెసిస్టెన్స్ రావడం వంటివి. కేన్సర్‌లో లాగే గ్యాస్ట్రో ఎంటరాలజీలోనూ స్టేజ్‌లు ఉంటాయి.



ఐదేళ్లలోపే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తగ్గించుకోగలిగేవి స్టేజ్-1. పదేళ్లలోపు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నివారించగలిగేవి స్టేజ్-2. పదేళ్లకు మించి కూడా జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్యగా పరిణమించేవి స్టేజ్-3 అనుకోవచ్చు. స్టేజ్-3 వచ్చే వరకూ జాగ్రత్తలు తీసుకోకపోతే అది మనకు శాశ్వత నష్టం చేకూర్చవచ్చు. అందుకే ముందుగానే జీవనశైలిలో ఆరోగ్యవంతమైన మార్పులతో ఐదేళ్లలోపే జాగ్రత్తపడితే గ్యాస్ట్రో ఎంటరాలజీ సంబంధిత సమస్యలతో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. ఇక కరెక్టబుల్ ఫ్యాక్టర్స్‌ను అనుసరిస్తూ, నాన్ కరెక్టబుల్ ఫ్యాక్టర్స్‌నూ బాగు చేసుకోగలిగితే డయాబెటిస్‌ను కూడా పూర్తిగా నయం చేయవచ్చు.



ఇటీవల అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి ప్రభావం గ్యాస్ట్రో ఎంటరాలజీ వ్యవస్థపై పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?

 ఒత్తిడి వల్ల పొట్ట, దానికి సంబంధించిన పేగులు వంటి గ్యాస్ట్రో ఎంటరాలజీ వ్యవస్థకు సంబంధించిన అవయవాలే గాక... అన్ని శరీర భాగాలపై దుష్ర్పభావం పడుతుంది. దాంతో ఒకపక్క యాసిడ్ స్రావాలు పెరుగుతుండగా... మరోవైపు కాలేయం, పాంక్రియాస్ నుంచి జీర్ణవ్యవస్థకు అవసరమైన స్రావాలు తగ్గుతుంటాయి. దీనివల్ల పేగుల కదలికలు తగ్గి మలబద్ధకం రావచ్చు. కొందరిలో నీళ్లవిరేచనాలు వంటి సమస్యకూ దారితీయవచ్చు. ఇలాంటి మానసిక ఒత్తిడి వల్ల కొందరిలో ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) వంటి సమస్య కూడా రావచ్చు. ఒత్తిడి తగ్గించుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడటంతో పాటు అన్ని రకాల ఆరోగ్య సమస్యలూ దూరమవుతాయి.



గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో మన దేశం అందిస్తున్న సేవల గురించి చెప్పండి?

 కొన్ని అంశాల్లో అత్యాధునిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న దేశాల కంటే... మన దేశంలో శిక్షణ పొందడానికి ఆయా విభాగాల నిపుణులు వస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు కాలేయ మార్పిడి చికిత్స కోసం మన దేశ నిపుణులపైనే ప్రపంచ దేశాలు ఆధారపడుతున్నాయి.



ఒత్తిడి నివారణకు మీరు అనుసరించే మార్గమేమిటి?

 నేను అందించే సేవలను నా బాధ్యతగా పని అనుకోవడం కంటే.. దాన్నే నేను ఎంజాయ్ చేసే ప్రక్రియగా భావిస్తుంటాను. దాన్ని ఆస్వాదిస్తూ చేస్తుంటాను. దాంతో ఏ మాత్రం ఒత్తిడి ఉండదు.



 మీరు ఉన్నత స్థానానికి రావడానికి మీ కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహం, మీరు ఎదుర్కొన్న సమస్యలు..?

 తప్పకుండా నా కుటుంబ ప్రోత్సాహం ఎంతో ఉంది. నేను నా పనిలో నిమగ్నమైనా.. కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. ఇది మనకు దొరికే ప్రోత్సాహమే కదా. ఇక వ్యక్తిగతంగా నేను కష్టకాలం, సంక్లిష్టమైన సమయం అని భావించిన ఉదంతాలు లేవు. చావుబతుకుల మధ్య ఉన్న ఎవరైనా చిన్నారిగానీ, యువకులనుగానీ కొన్నేళ్లు బతికించగలిగే అవకాశం లేనప్పుడు బాధ కలుగుతుంది. ఎందుకంటే వారిని కొన్నేళ్లు బతికించగలిగితే... భవిష్యత్తులో మరింత మెరుగైన చికిత్స అంది దీర్ఘకాలం జీవించగలరుకదా అనిపిస్తుంది.

 

 సామాజిక సేవ చేస్తున్నా..

 టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా

 

 దేశ క్రీడారంగంలో ఇటీవల సంచలనం సృష్టించిన క్రీడాకారిణి సానియా మీర్జా. స్విట్జర్లాండ్‌కు చెందిన మార్టినా హింగిస్‌తో కలసి టెన్నిస్ డబుల్స్‌లో వరుసగా 36 విజయాలు సాధించి రికార్డు సృష్టించిన ఆమెను ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. తాను ఇప్పటికే సామాజిక సేవ చేస్తున్నానని చెప్పిన సానియా మీర్జా... ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని ‘సాక్షి’ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు..



పద్మభూషణ్ అవార్డుపై మీ స్పందన

 ఒక క్రీడాకారిణిగా అర్జున, రాజీవ్ ఖేల్త్న్రలాంటి అవార్డులు సహజంగానే ఆశిస్తాం. అయితే పౌర పురస్కారం లభించడం ఏ రకంగా చూసినా చాలా గర్వకారణం. పద్మభూషణ్‌కు నన్ను ఎంపిక చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఎంతో మంది గొప్పవారితో కలసి అవార్డుకు ఎంపిక కావడం ఎప్పటికీ మరచిపోలేను.



గతంలోనే మీకు పద్మశ్రీ పురస్కారం వచ్చింది కదా..

 పదేళ్ల క్రితం పద్మశ్రీ అవార్డును స్వీకరించాను. ఇప్పు డు పద్మభూషణ్‌తో మరో మెట్టు ఎక్కినట్లు అనిపిస్తోంది. అప్పుడైనా, ఇప్పుడైనా నేను వాటిని ఆశించలేదు. నా పని టెన్నిస్ ఆడటాన్నే చేసుకుంటూ పోయాను తప్ప ఇతరత్రా ఆలోచించలేదు. పద్మభూషణ్ ఇవ్వడమంటే నా విజయాలకే కాదు ఆటను, దేశం తరఫున ప్రదర్శనను ప్రభుత్వం గుర్తిస్తున్నట్లే. టెన్నిస్‌కు దక్కిన గుర్తింపుగా కూడా దీనిని చెప్పగలను.



పురస్కార గ్రహీతలు సమాజ సేవలో భాగం కావడంపై మీ స్పందన

 నిజమే, ఈ అవార్డు గౌరవంతో పాటు బాధ్యతను కూడా పెంచింది. నేను కూడా చాలా కాలంగా నా పరిధిలో సామాజిక సేవ చేస్తున్నా. ఈ విషయం చాలా మందికి తెలీదు. దీనిని వ్యక్తిగతంగా నా వరకే పరిమితం చేసుకున్నాను తప్ప మీడియాతో ఎప్పుడూ పంచుకోవాలని భావించలేదు. ఇకపైనా సామాజిక సేవను కొనసాగిస్తాను. అవసరమైతే మున్ముందు వివరంగా వెల్లడిస్తా. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు రావాలని కోరుకుంటున్నా..



 హింగిస్‌తో వరుస విజయాలపై..

 ఏడాదిన్నర క్రితం దుబాయ్‌లో అనూహ్యంగా మా జోడీ కలిసింది. తను బ్యాక్‌హ్యాండ్ బాగా ఆడుతుంది. నేను ఫోర్‌హ్యాండ్ బాగా ఆడతాను. ఆ సమయానికి గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో మా ప్రదర్శన గొప్పగా లేదు. ముందుగా బిజినెస్ పార్ట్‌నర్‌షిప్‌లాగా మైదానం వరకే పరిచయం కొనసాగింది. రానురానూ ఇద్దరి అభిరుచులు కలవడంతో కలసి ప్రయాణిద్దామని నిర్ణయించుకున్నాం. అది అద్భుత ఫలితాలు ఇచ్చింది. మా విజయపరంపర వరుసగా 36 మ్యాచ్‌ల వరకు కొనసాగడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది అరుదుగా మాత్రమే జరుగుతుంది. 1990 తర్వాత ఇలా ఎవరూ ఆడలేదంటే మేం చాలా బాగా ఆడుతున్నట్లే లెక్క. ఈ అంకెలు మీడియాలో రాసినప్పుడు తెలుస్తుంది. కానీ మేం బరిలోకి దిగేటప్పుడు ఆ ఒక్క మ్యాచ్ గురించే ఆలోచిస్తాం. గత ఆరు నెలలుగా మేం ఓడిపోలేదనేది వాస్తవం. అయితే మేం మెజీషియన్లం కాదు. ఎప్పుడో ఒకచోట, ఏదో రోజు ఓటమితో దీనికి ముగింపు వస్తుందేమో.



‘సాన్‌టినా’గా మారడానికి కారణం?

 గతంలో కొన్ని విజయవంతమైన డబుల్స్ జోడీలు ఇద్దరూ కలసి ఒకే పేరుతో టీమ్‌గా బరిలోకి దిగిన సందర్భాలున్నాయి. అదే స్ఫూర్తితో మాకూ ఓ పేరు పెట్టుకుంటే బాగుంటుందనిపించింది. దాంతో ట్వీటర్‌లో అభిమానుల అభిప్రాయం కోరాం. ఇండో-స్విస్ ఎక్స్‌ప్రెస్ మొదలు మార్టినా-మీర్జా వరకు ఎన్నో పేర్లు వచ్చాయి. చివరకు ఇద్దరి పేర్లు వచ్చే సాన్‌టినా నచ్చడంతో దానినే ఎంపిక చేసుకున్నాం. ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నాను కాబట్టి మంచి ప్రణాళికతో జాగ్రత్తలు తీసుకుంటూ వరుస టోర్నీలు ఆడుతున్నాను.

 

 సామాజిక ప్రాజెక్టులు చేపట్టాలి

 ఆర్గానిక్ రసాయన శాస్త్రవేత్త వెంకట రామారావు

 

 ఎనభై ఏళ్ల వయసులో ఎవరైనా హడావుడేమీ లేకుండా మనవలు, మనవరాళ్లతో గడపాలనుకోవడం సహజం. కానీ రసాయన శాస్త్రవేత్త ఆళ్ల వెంకట రామారావు దీనికి భిన్నం. రిటైర్మెంట్ తరువాత ఓ కొత్త కంపెనీని నెలకొల్పడమే కాకుండా... ఇతరులకు కష్టసాధ్యమైన పనులను మాత్రమే చేపట్టాలని నిర్ణయించుకుని, అదే తీరును కొనసాగిస్తున్నారు. 1935 ఏప్రిల్ 2న గుంటూరులో జన్మించిన వెంకటరామారావు... అంచెలంచెలుగా ఎదిగి దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తగా ఎదిగారు. 1991లో పద్మశ్రీ అవార్డు అందుకున్న ఈయన తాజాగా పద్మ భూషణ్‌కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆయన పంచుకున్న విషయాలివీ..



ఫార్మా రంగంలో భారత్‌ను ఇప్పటికీ జెనరిక్ మందుల తయారీ కేంద్రంగా, కాపీ మాస్టర్‌గానే పరిగణిస్తారు. సొంతంగా ఆవిష్కరణలు చేసేదెప్పుడు?

 టెన్త్, ఇంటర్‌లు చదవకుండా గ్రాడ్యుయేషన్ చేయగలరా? జెనరిక్ మందుల తయారీ కూడా అంతే. దాదాపు అన్ని మందులపై పేటెంట్లు ఉన్న 1970 ప్రాంతంలో దేశ అవసరాలను తీర్చేందుకు మనం జెనరిక్ మందుల తయారీకి సిద్ధమయ్యాం. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పేటెంట్ల చట్టాన్ని సవరించినప్పుడు ఏ బహుళజాతి కంపెనీ కూడా దాన్ని వ్యతిరేకించలేదు. అయితే వారి అంచనాలను తారుమారు చేస్తూ మనం అద్భుతాలు సృష్టించగలిగాం. అతితక్కువ ఖర్చుతో నాణ్యమైన మందులను అందించగలిగాం. ఈ క్రమంలో మనం డ్రగ్ డిస్కవరీకి సంబంధించి ఎంతో నేర్చుకున్నాం కూడా. ఫలితంగా ఇప్పుడు భారత్ డ్రగ్ డిస్కవరీకి సంబంధించిన అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేయగలిగింది. భవిష్యత్తులో మనం కూడా అగ్రరాజ్యాలకు దీటుగా కొత్త మందులను ఆవిష్కరించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి.



 మన విద్యావ్యవస్థ బాగుపడేదెలా?

 దేశంలోని అనేక విద్యాసంస్థలు పీహెచ్‌డీలు అందించేందుకే పనిచేస్తున్నాయి. సమస్యలను గుర్తించి తదనుగుణంగా పరిశోధనలు చేపట్టడం తగ్గిపోయింది. సీఎస్‌ఐఆర్ పరిశోధనశాలల్లో కూడా పరిస్థితులు అంతబాగా లేవు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన డెరైక్టర్లు... తమకంటే ముందు పనిచేసిన వారి ప్రాజెక్టులను అర్ధంతరంగా ఆపేస్తున్నారు. ఐఐసీటీ డెరైక్టర్‌గా ఉండగా ఎరువులు, క్రిమిసంహారక మందుల తయారీకి సంబంధించిన ప్రాజెక్టులు చేపట్టడం వల్ల ఆయా రంగాల్లో స్వావలంబన సాధించడానికి వీలైంది. విద్యావ్యవస్థ మెరుగుపడాలంటే సామాజిక అవసరాలను తీర్చగల ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరముంది.



ఆవ్రా ల్యాబ్స్, రీసెర్చ్ ఫౌండేషన్ గురించి..?

 1985-1995 వరకూ ఐఐసీటీ డెరైక్టర్‌గా పనిచేసిన తరువాత రిటైర్మెంట్ వయసు వచ్చేసింది. సీఎస్‌ఐఆర్‌లో ఉన్నతస్థాయి పదవి ఇస్తామని కొందరు హామీ ఇచ్చారు. అయితే నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి. అందరూ చేసే పనిని మనమూ చేయడం కంటే.. ఇతరులకు సాధ్యం కాని పనులను చేసి చూపాలని నిర్ణయించుకున్నా. అయితే రిటైర్మెంట్, పెన్షన్ సొమ్ములను ముట్టుకోనని మా ఆవిడకు మాటిచ్చా కాబట్టి చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి. ఆ సమయంలో అమెరికాలోని గార్డన్ రీసెర్చ్ కాన్ఫరెన్స్‌కు వెళ్లడం నాకు కలసివచ్చింది. అక్కడ నా ప్రసంగాన్ని విన్న సైటోమెడ్ కంపెనీ సీఈవో తమకు అసాధ్యమైన ఓ ప్రాజెక్టు చేపట్టగలరా అని కోరారు. అలాగే మరో అమెరికన్ ఫార్మా కంపెనీ ఇంకో సవాలును నా ముందుంచింది. ఆ రెండు ప్రాజెక్టులూ చేపట్టా. అదే సమయంలో డైచీ కర్కారియా లిమిటెడ్ యజమాని డీఎం నటర్‌వాలా ఓ షెడ్‌ను పరిశోధనశాలగా మార్చి ఇచ్చారు. అంతే అమెరికన్ కంపెనీలు ఇచ్చిన అడ్వాన్స్ మొత్తంతో ఆవ్రా ల్యాబ్స్ ప్రారంభమైంది.

 

 భాషా చైతన్యం రావాలి

 ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

 

 తెలుగు భాషను సుసంపన్నం చేసేందుకు కృషి చేస్తున్న ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ‘పద్మభూషణ్’ వచ్చిన తర్వాత తొలిసారి విజయవాడ వచ్చిన సందర్భంలో సాక్షితో స్పెషల్ ఇంటర్వ్యూ.



ముందుగా మీకు శుభాభినందనలు. చైతన్య యాత్రలు, అవగాహన సదస్సులు, మేలుకొలుపు దీక్షలు అంటూ వినూత్న రీతిలో మీరు పోరాటం చేస్తున్నారు. ఇందులోని అంతరార్థం ఏమిటి?

 ముందుగా మీ ద్వారా ప్రేక్షకులకు, పాఠకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మూగ ప్రజలు, బధిర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పరిఢవిల్లచేయలేవు అని రాజాజీ అన్నారు. నేను చేస్తున్న తె లుగుభాషా చైతన్య యాత్రలు, అవగాహన సద స్సులు, మేలుకొలుపు దీక్షలు... ప్రజలను, ప్రభుత్వాన్ని చైతన్యవంతుల్ని చేయడం కోసమే.



 మీరు ప్రారంభించిన మేలుకొలుపు యాత్రలతో ప్రభుత్వంలో ఏపాటి మేలుకొలుపు కలిగిందనుకుంటున్నారు?

 ప్రభుత్వాలకు వారి ప్రాముఖ్యాలు, ప్రాధాన్యతలు వేరుగా ఉంటాయి. కాని ఈ రోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ... తెలుగు భాషాసంస్కృతుల పరిరక్షణ, తెలుగువారి ఆత్మగౌరవ నినాదం అనే పునాదుల మీద జన్మించింది. కాబట్టి మిగతా పార్టీల కంటే ఈ పార్టీకి ఎక్కువ బాధ్యత ఉంది.



తెలుగును పరిరక్షించుకునే పరిస్థితి ఎందుకొచ్చిందంటారు?

 తెలుగువారి ఆహార వ్యవహారాల్లో, ఆలోచనా ధోరణిలో, కార్యకుశలతలో విలక్షణత, విశిష్టత ఉంది. అవధాన ప్రక్రియ, పద్యనాటకాలు, పద్యాలు... ప్రపంచంలో మరే ఇతర సాహిత్యంలోనూ లేవు. అలాంటి తెలుగు అంతరించబోతోందని యునెస్కో వారు 15 సంవత్సరాల క్రితం మనల్ని హెచ్చరించారు. కాబట్టి మనం మేల్కోవాల్సి వచ్చింది.



 భాషా ప్రేమికులు చేస్తున్న ఆందోళనకు మీరు గొంతుగా మారాల్సిన అవసరం ఉందా?

 భాషా సాహిత్యాల ద్వారానే నేను సమాజంలో ఈ స్థాయికి చేరాను. సమాజానికి తిరిగి ఇవ్వాలనే సంకల్పంతోనే నేను ఈ పని చేస్తున్నాను. ఇంగ్లిషు మీడియం పాఠశాలలు తెరిచి, తెలుగు మీడియం పాఠశాలలను మూసివేయడం దురదృష్టం. కృష్ణానదీ తీరాన మన అమరావతి శంకుస్థాపన శిలాఫలకం ఇంగ్లిషులో ఉంటే, సిగ్గుతో తల వాలిపోయింది. రూ.2 వేలు ఖర్చు పెడితే  పక్కనే మళ్లీ తెలుగులో మరొక రాయి వేయవచ్చు. ప్రభుత్వ యంత్రాంగంలో తెలుగు భాష, సంస్కృతుల పట్ల మమకారం లేకపోవడం వల్ల జరిగింది. కాబట్టి మమకారాన్ని వారికి కలిగించే విధంగా తెలియచెప్పాలి. ప్రభుత్వ వ్యవహారాల్లో తెలుగును అధికార భాషగా వినియోగించాలి.



1వ తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు భాషను అమలు చేస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలైనప్పటికీ ఇందుకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మీకేమనిపిస్తోంది?

 ముఖ్యమంత్రి చెప్పినట్లుగా ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు తెలుగుని ఒక సబ్జెక్ట్‌గా పెడితే... పిల్లలు ప్రతి క్లాసులో తెలుగు చదువుకుంటారు. కానీ అ ఆ అనే రెండక్షరాలు నేర్చుకోకుండా ఉన్నతవిద్య పూర్తి చేసే సౌకర్యం మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. పొరుగునే ఉన్న తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలలో వారి మాతృభాష తప్పక అధ్యయనం చేయాలి. భూసేకరణ, దేశవిదేశాల్లో పర్యటించి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ... వంటి విషయాల్లో ఎంత శ్రద్ధ, ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారో, తెలుగు భాష సంస్కృతుల విషయంలో అలాగే వ్యవహరించమని సీఎంకి విజ్ఞప్తి చేస్తున్నా.



 ‘ఈ రాష్ట్రంలో లలిత కళలకి, ప్రాచీన నృత్యరీతులకి ఒక పీఠం పెట్టి, వాటిని ఆదరిస్తామ’ని తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి రోజున సీఎం స్వయంగా చెప్పారు. అయితే ఇప్పటివరకూ మొదలైన దాఖలాలు లేవు.

 ఏ పనీ ప్రణాళికాబద్ధంగా చేయట్లేదు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ, ఆచార్య ఎన్‌జీ రంగా వర్సిటీ, ప్రెస్ అకాడమీ 10వ షెడ్యూల్‌లో ఉన్నాయి. వాటికి ఇబ్బందులొస్తే వెంటనే ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ మూడింటికీ లేని 10వ షెడ్యూల్ అనే అడ్డంకి తెలుగు వర్సిటీకి ఎందుకు వచ్చింది? అధికారులు సీఎంను తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రపంచం మొత్తం మీద భాష పేరు మీద ఏర్పడిన రెండవ విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ మానస పుత్రిక. రాజమండ్రిలో తెలుగు వర్సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. దానిని వెంటనే ప్రారంభించి తెలుగు భాషాసంస్కృతులపై ఆయన చిత్తశుద్ధి అందరికీ అర్థమయ్యేలా చేయాలి.



తెలుగు భాషా పీఠం ఏర్పాటు గురించి...

 వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రాచీన హోదా సాధించుకున్నాం. ‘నాకివి పెద్దగా తెలియవు. మీరు పర్యవేక్షించి పని పూర్తిచేయండి’ అని ఆయన చెప్పారు. అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే స్పందించేవారు. ఎవరికైనా లేఖ రాయమంటే.. రాయడమే తప్ప, ఎందుకు అని అడగలేదు. అలా ప్రాచీన హోదా సాధించుకున్నాం. ఈ ప్రాచీన భాషల కేంద్రం మైసూరులో ఉంది. ప్రాచీన భాష హోదా ఇచ్చిన తర్వాత తమిళనాడు వారు మా సంస్థ మాకివ్వండి, మా మీద మీరు పరిశోధన చేసేదేంటని కరుణానిధిగారు మద్రాసు పట్టుకెళ్లిపోయారు. అదే ప్రక్రియలో మా పీఠం మాకిచ్చేయండని నేను, లగడపాటి, సబ్బం హరి, కావూరి, రాయపాటి వంటి ఎంపీలనందరితో కపిల్ సిబాల్‌గారిని కలిసి, మన ఆంధ్రపీఠం మనం తెచ్చుకున్నాం. ఇప్పటికి ఐదేళ్లు దాటినా ఆ పీఠాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయాం. దానికి కేటాయించిన నిధులు ప్రతి సంవత్సరం వస్తున్నాయి, తిరిగి వెళ్లిపోతున్నాయి.



ప్రస్తుత కార్యాచరణ ఏమిటి?

 జిల్లాలవారీ సమావేశాలు నిర్వహించి, అందరి అభిప్రాయాలు సేకరించి, తెలుగు భాషకు సంబంధించి కనీస ఉమ్మడి కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఏప్రిల్ మొదటి వారం నుంచి నేను మేలుకొలుపు యాత్రలు ప్రారంభిస్తాను. ఆ తర్వాత సీఎంని కలసి విజ్ఞప్తి చేస్తాం.



తమిళనాడులో తెలుగు విద్యార్థులు పరీక్షలు తెలుగులో రాయకూడదని చేసిన ఉత్తర్వు గురించి...

 దీనిపై సుప్రీం తలుపు తడదామనుకుంటున్నాను. ఏ రాష్ట్రంలో భాషా అల్ప సంఖ్యాకులు ఉంటారో వారి హక్కులు పరిరక్షించాలని ఆర్టికల్ 29, 30, 351 (ఎ)లో పేర్కొన్నారు. మన రాష్ట్రంలో తెలుగుభాషను మనం కాపాడుకుంటే, మనం ఏ రాష్ట్రం వారినైనా అడగగలుగుతాం.



సంగీత సాహిత్యాల ఆదరణ గురించి వివరించండి...

 ప్రాచీన కాలం నుంచి తెలుగు సాహిత్యాన్ని చూస్తే... రాజాశ్రయం కంటె, జనాశ్రయమే ఫలించింది, పుష్పించింది. అందువల్ల ప్రభుత్వాల కర్తవ్యం గుర్తు చేస్తున్నాను. ఏ ప్రభుత్వమైతే కళల్ని, సాహిత్యాన్ని ఆదరిస్తుందో ఆ ప్రభుత్వం శాశ్వతంగా చరిత్రలో మిగిలిపోతుంది. నేటికీ కృష్ణదేవరాయల పేరు మనం మాట్లాడుకుంటున్నామంటే, అందుకు కారణం ఆయన సాధించిన యుద్ధవిజయాలు కాదు. ఆయన చేసిన భాషా సేవ. అటువంటి పెద్దల్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడుస్తున్నాను.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top