దేశవ్యాప్తంగా ఇంటర్‌కు ఒకే తరహా పరీక్ష!

దేశవ్యాప్తంగా ఇంటర్‌కు ఒకే తరహా పరీక్ష! - Sakshi


కేంద్రానికి అధికారుల కమిటీ సిఫారసు

2 దీర్ఘ, 4 స్వల్పకాలిక, 8 లఘు సమాధాన విధానంలో ప్రశ్నపత్రం

అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సిందే!

వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేసే యోచన



సాక్షి, హైదరాబాద్‌:
దేశవ్యాప్తంగా ఇంటర్మీడియెట్‌ స్థాయిలో ఒకే తరహా సిలబస్, ఒకే నమూనా ప్రశ్నపత్రాన్ని అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ చర్యలు చేపట్టింది. ప్రతి సబ్జెక్టులో 2 దీర్ఘ (లాంగ్‌) ప్రశ్నలు, 4 స్వల్ప సమాధాన (షార్ట్‌) ప్రశ్నలు, 8 లఘు (వెరీ షార్ట్‌) సమాధాన ప్రశ్నలు ఉండేలా ప్రశ్నపత్రాన్ని రూపొందించనుంది. ప్రతి సబ్జెక్టులో 70 శాతం మార్కులు రాతపరీక్షలకు, 30 శాతం మార్కులు ప్రాక్టికల్స్‌కు కేటాయించనుంది. మొత్తంగా ఇంటర్‌ స్థాయిలో దేశవ్యాప్తంగా ఒకే తరహా విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చే దిశగా చర్యలు వేగవంతమయ్యాయి. వీలైతే వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ సంస్కరణలను అమల్లోకి తేవాలని కేంద్రం యోచిస్తోంది.

 


వేర్వేరు సిలబస్‌లు, విధానాలతో సమస్యలు

ప్రస్తుతం ఇంటర్మీడియెట్‌ స్థాయిలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సిలబస్, ఒక్కో తరహా పరీక్షల విధానం ఉన్నాయి. వేర్వేరు తరహా ప్రశ్నపత్రాలు, మార్కుల విధానం ఉన్నాయి. దీనివల్ల జాతీయ స్థాయి పోటీ పరీక్షలు, ప్రవేశాల విధానంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్‌లో దేశవ్యాప్తంగా ఒకే రకమైన విద్యా విధానాన్ని అమల్లోకి తేవాలని కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయించింది. ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు గతేడాది రెండు ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. సిలబస్‌లో మార్పులపై తెలంగాణ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ చైర్మన్‌గా ఒక కమిటీని, ప్రశ్నపత్రాల నమూనాపై మేఘాలయ విద్యా కమిషనర్‌ అండ్‌ సెక్రటరీ ఈపీ కర్భీహ్‌ చైర్మన్‌గా మరో కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సిలబస్‌ కమిటీ గతంలోనే తమ నివేదికను అందజేయగా.. ప్రశ్నపత్రం నమూనాపై ఏర్పాటు కమిటీ ఇటీవలే తమ నివేదికను సమర్పించింది.



ఆప్షన్‌ విధానం ఉండొద్దు!

ఇంటర్‌లో అన్ని సబ్జెక్టుల పరీక్షల నిర్వహణ, ప్రశ్నలు ఉండాల్సిన తీరును కర్భీహ్‌ ఆధ్వర్యంలోని కమిటీ తమ నివేదికలో సూచించింది. అన్ని సబ్జెక్టుల్లోనూ 2:4:8 నిష్పత్తి విధానంలో ప్రశ్నలు ఉండాలని పేర్కొంది. అంటే దీర్ఘమైన జవాబులు రాసే ప్రశ్నలు 2, స్వల్ప సమాధాన ప్రశ్నలు 4, లఘు సమాధాన ప్రశ్నలు 8 ఉండాలని స్పష్టం చేసింది. అయితే పరీక్షించే విధానం పూర్తిగా డిస్రి్కప్టివ్‌ (వివరణాత్మక) విధానంలో ఉండాలని.. విద్యార్థులు ప్రతి ప్రశ్నకు జవాబు రాసేలా ఉండాలని, ఆప్షన్‌ విధానం ఉండొద్దని ప్రతిపాదించింది. ప్రతి సబ్జెక్టులోనూ ప్రాక్టికల్‌ విధానం ఉండాలని.. రాతపరీక్షకు 70 శాతం మార్కులు, ప్రాక్టికల్స్‌కు 30 శాతం మార్కులు ఉండాలని సూచించింది. ప్రశ్నపత్రాన్ని క్షుణ్నంగా చదువుకునేందుకు 15 నిమిషాలు అదనంగా సమయం ఇవ్వాలని పేర్కొంది. సులభ ప్రశ్నలు 35 శాతం, సాధారణ ప్రశ్నలు 40 శాతం, కఠిన ప్రశ్నలు 25 శాతం ఉండేలా చూడాలని తెలిపింది. గణితం, సైన్స్‌ పరీక్షలకు 3 గంటల సమయం ఇవ్వాలని ప్రతిపాదించింది. ఓపెన్‌ బుక్‌ పరీక్షా విధానం అమల్లోకి తెస్తే ఎలా ఉంటుందన్న మానవ వనరుల శాఖ సూచనను కమిటీ తిరస్కరించింది. కాగా.. ఇప్పటికే నివేదిక సమర్పించిన సిలబస్‌ కమిటీ.. అన్ని రాష్ట్రాల్లోని ఇంటర్‌ విద్యలో, సీబీఎస్‌ఈ విద్యా సంస్థల్లోని 10+2 విధానంలోనూ కామన్‌ కోర్‌ సిలబస్‌ ఉండాలని సూచించిన విషయం తెలిసిందే. మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టుల్లో మాత్రం 100 శాతం కామన్‌ కోర్‌ సిలబస్‌ ఉండాలని.. ఇతర గ్రూపులు, సబ్జెక్టుల్లో 70 శాతం కామన్‌ సిలబస్‌ ఉండాలని ప్రతిపాదించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top