షీనాను హత్య చేసింది నేనే!

షీనాను హత్య చేసింది నేనే! - Sakshi


 అంగీకరించిన ఇంద్రాణి


♦  పీటర్‌తో ఇంద్రాణి, ఖన్నా, రాయ్‌ల ముఖాముఖి..

♦  చివరి నిమిషంలో మొదటి భర్త


♦  సిద్ధార్థ్‌దాస్‌ను ప్రవేశపెట్టిన పోలీసులు




 ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యకేసు మిస్టరీ వీడింది. ఇన్నాళ్లూ అమెరికాలో షీనా బతికే ఉందంటూ బుకాయిస్తూ వచ్చిన షీనాబోరా కన్నతల్లి ఇంద్రాణి ముఖర్జియా తానే కూతుర్ని హత్య చేసినట్లు అంగీకరించిందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు గురువారం వెల్లడించారు. ఇంతకుమించి వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఈ కేసులో నిందితులైన వారందరితో పాటు, ఇంద్రాణి భర్త, స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖర్జియాను గురువారమూ విచారించారు. బుధవారం దాదాపు 12గంటలపాటు విచారించిన పీటర్‌ను గురువారం ఉదయం11.30 గంటలకు ఖర్ పోలీస్ స్టేషన్‌కు రప్పించారు. పీటర్‌తో పాటు.. కేసులో నిందితులందరినీ ఒకరి వెంట ఒకరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి ప్రశ్నించారు.


పీటర్‌తో ఆయన భార్య ఇంద్రాణిని ముఖాముఖిగా కూర్చోబెట్టి ఇంటరాగేట్ చేశారు. వీరి మధ్య అనైతిక సంబంధాలతో పాటు పీటర్ ఇంద్రాణిల మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి లోతుగా ఆరా తీశారు. వివిధ కంపెనీల్లో పీటర్‌కు ఉన్న షేర్ల వివరాలు, తన కొడుకు రాహుల్‌కు, భార్య ఇంద్రాణికి, ఆమె కూతుళ్లు షీనా, విధిలకు పీటర్ ఎంతెంత డబ్బులు ఇచ్చిందీ తెలుసుకున్నారు. ఆ తరువాత ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యాం రాయ్‌లను కూడా పీటర్‌తో ముఖాముఖిగా ఉంచి దర్యాప్తు చేశారు. చివరి నిమిషంలో ఇంద్రాణి మొదటి భర్త, షీనాబోరా తండ్రి సిద్ధార్థదాస్‌ను అనూహ్యంగా ఇంద్రాణి ముందు ప్రవేశపెట్టి ముఖాముఖి విచారించారు. ఈ విచారణ అంతా డీసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో కొనసాగింది. మరోవైపు రాయ్‌గఢ్ అడవుల్లో దొరికిన అస్థికలు షీనావా కాదా అని నిర్ధారించేందుకు కలీనాలోని ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలు ప్రారంభించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top