పార్లమెంటులో మన మహిళలెక్కడ?

పార్లమెంటులో మన మహిళలెక్కడ?


ప్రపంచ దేశాల పార్లమెంటుల్లో మహిళల ప్రాతినిధ్యం గత రెండు దళాబ్దాల కాలంలో దాదాపు రెండింతలు పెరగ్గా భారత్‌లో మాత్రం అధ్వాన్నంగా ఉంది. సిరియా, రువాండా, సియెర్రా లియోన్, నిగర్, సోమాలియా లాంటి దేశాల్లో కూడా భారత్‌ కన్నా ఎక్కువ మంది మహిళా ఎంపీలు ఉన్నారంటే ఆశ్చర్యం కలగక తప్పదు. ప్రస్తుతం భారత పార్లమెంట్‌లో మహిళల సంఖ్య 96 (లోక్‌సభలో 65, రాజ్యసభలో 31). అంటే మొత్తం పార్లమెంట్ సభ్యుల్లో వీరి వాటా 12 శాతానికి మించలేదన్నమాట. అంతర్జాతీయ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ)కు 166 దేశాలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, మహిళా ఎంపీల విషయంలో మన దేశం 103వ స్థానంలో ఉంది.



అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐపీయూ అధ్యక్షులు మార్టిన్ చుంగాంగ్ ఈ గణాంకాలను విడుదల చేశారు. పార్లమెంట్‌లో ఒక్క మహిళ కూడా లేని దేశం వనౌతు ఈ జాబితాలో 137వ స్థానం ఆక్రమించిందంటే మన 103వ స్థానానికున్న స్థానం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇస్లామిక్ దేశమైన పాకిస్థాన్ 84 మంది మహిళా ఎంపీలతో 64వ స్థానంలో కొనసాగుతోంది. మొత్తం పార్లమెంట్ స్థానాల సంఖ్యను బట్టి వివిధ దేశాల స్థానాలను లెక్కించారు. పాక్ ఎగువసభలో 21 శాతం, దిగువ సభలో 17 శాతం మంది మహిళలు ఉన్నారు. 699 మంది సభ్యులున్న చైనా దిగువసభలో 24 శాతం మంది మహిళలలో 53వ స్థానంలో కొనసాగుతోంది.  పార్లమెంట్‌లో 30 శాతం మంది మహిళలతో మన పొరుగునే ఉన్న నేపాల్ 35వ స్థానంలో కొనసాగుతోంది. ఆ దేశంలో 176 మంది మహిళలు ఉన్నారు. ఒకే సంస్కృతి, భాష కలిగిన డెన్మార్క్, ఫిన్‌లాండ్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్ లాంటి నోర్డిక్ దేశాలు పార్లమెంట్‌లో మహిళలకు ప్రాతినిథ్యం కల్పించడంలో ఎంతో ముందున్నాయి. మొదటి పది స్థానాల్లో ఈ దేశాలే ఉన్నాయి.



ప్రపంచవ్యాప్తంగా మహిళా ఎంపీల సంఖ్య గణనీయంగానే పెరుగుతోంది. 1995లో 11.3 శాతం ఉండగా,  ప్రస్తుతం 22.1 శాతం ఉందని ఐపీయూ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఐపీయులో సభ్యత్వం కలిగిన 166 దేశాల్లో 120 దేశాలు పార్లమెంట్లలో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి. భారత్‌లో పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తొలి యూపీయే ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చినా అది రాజకీయాల కారణంగా నేటికీ ఆమోదానికి నోచుకోలేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top