మామ్‌ @ 1000 రోజులు

మామ్‌ @ 1000 రోజులు


బెంగళూరు: అతి తక్కువ ఖర్చుతో తయారు చేసిన మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ (మామ్‌)అరుణగ్రహం కక్ష్యలో తిరుగుతూ విజయవంతంగా వెయ్యి రోజులు పూర్తి చేసుకుంది. ‘6 నెలల వ్యవధి కోసం రూపొందించిన ఈ అంతరిక్ష నౌక లక్ష్యాన్ని అధిగమించి తన కక్ష్యలో 1000 రోజులు (భూమిపై 1000 రోజులు కాగా, అరుణ గ్రహంపై 973.24 రోజులు) విజయవంతంగా పూర్తి చేసుకుంది. 388 సార్లు తన కక్ష్యలో తిరిగింది’అని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది. ఈ ఉపగ్రహం పనితీరు మెరుగ్గా ఉందని, అనుకున్నట్లుగానే పని చేస్తోందని, అక్కడి సమాచారాన్ని అందిస్తూనే ఉందని ఇస్రో వివరించింది.



2014 సెప్టెంబర్‌ 24న మామ్‌ను అరుణగ్రహం కక్ష్యలోకి ఇస్రో మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా ప్రవేశపెట్టింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన పీఎస్‌ఎల్వీ రాకెట్‌ సాయంతో శ్రీహరికోట నుంచి 2013 నవంబర్‌ 5న ఈ నౌకను ప్రయోగించారు. అనేక సంవత్సరాలకు సరిపడా ఇంధనం ఉండటంతో నౌక విజయవంతంగా పనిచేస్తూనే ఉందని ఇస్రో చైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ పేర్కొన్నారు. అరుణగ్రహం ఉపరితలంపై ఖనిజాల జాడ వెతికేందుకు, అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేసి జీవం ఉందని సూచించే మీథేన్‌ను కనిపెట్టేందుకు రూ.450 కోట్లతో తయారుచేసిన ఈ మామ్‌ను అక్కడికి పంపించారు



. లీమన్‌ ఆల్ఫా ఫొటోమీటర్‌ (లాప్‌), మీథేన్‌ సెన్సార్‌ ఫర్‌ మార్స్‌ (ఎంఎస్‌ఎం), మార్స్‌ ఎక్సోస్ఫెరిక్‌ న్యూట్రల్‌ కంపోజిషన్‌ అనలైజర్‌ (ఎంఈఎన్‌సీఏ), మార్స్‌ కలర్‌ కెమెరా (ఎంసీసీ), థర్మల్‌ ఇన్‌ఫ్రారెడ్‌ ఇమేజింగ్‌ స్పెక్ట్రోమీటర్‌ (టీఐఎస్‌) అనే పరికరాలు మామ్‌లో ఉన్నాయి. కలర్‌ కెమెరాతో ఇప్పటివరకు మామ్‌ 715కు పైగా ఫొటోలను పంపిందని ఇస్రో తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top