ఇండియాకు మాణిక్యం దొరికాడు

ఇండియాకు మాణిక్యం దొరికాడు


విజేతల గురించి తెలుసుకున్న ప్రతిసారీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. వారి కష్టాలు తెలుస్తాయి. కష్టాలను ఎదురొడ్డి నిలిచిన గుండె ధైర్యం, మొండితనం తెలుస్తాయి. వారి కన్నీళ్లు తెలుస్తాయి. కన్నీళ్లతో మిగిలిపోకుండా ఆనందబాష్పాలు రాల్చగలిగే తెగువ, పట్టుదల తెలుస్తాయి. విజేత గురించి తెలుసుకున్నప్పుడు విజయం తెలుస్తుంది. ఆ విజయమెంత కష్టమో కూడా తెలుస్తుంది.

 

ఆ చిన్నారికి ఐదేళ్లు.. అస్సాంలోని బార్‌పేట రోడ్ మున్సిపాలిటీలో నిరుపేదలు జీవించే వాడల్లో ఆడుకుంటున్నాడు. తల్లి పరుగుపరుగున వీధుల్లోకి పరుగుతీస్తోంది. ఆ దృశ్యాన్ని చూశాడీ చిన్నారి. ఏడ్చుకుంటూ అమ్మనే వెంబడించాడు. అమ్మ కూడా వెక్కివెక్కి ఏడుస్తోంది. ఏడ్చుకుంటూ రక్తపుమడుగులో పడి ఉన్న భర్త మృతదేహాన్ని పొదివిపట్టుకుంది. చిన్నారి పరుగు ఆగింది. అమ్మ దొరికింది కదా అన్న ఆనందం మాత్రమే వాడిది. నాన్న ఇంకెప్పుడూ తనకు దొరకడనే విషయం ఆ పసివాడు గుర్తించడం లేదు. అమ్మ కొంగు పట్టుకుని చుట్టూ చేరిన జనాన్ని వింతగా చూస్తున్నాడు. అప్పటి నుంచి జనం పరిచయం వాడికి.. ఆ జనం కోట్లలో ఉన్నా సరే వాడు లెక్కచేయడు. అందరినీ వెనక్కి నెడతాడు. అందుకే విజేతయ్యాడు. ఆ చిన్నారే 22 ఏళ్ల మాణిక్ పాల్. ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ షో విజేత!

 

టాలెంట్ల కొద్దీ టాలెంట్..

కలర్స్ టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియాస్ గాట్ టాలెంట్ ఆరో సీజన్‌లో విజేతగా నిలిచిన మానిక్ పాల్.. ట్రోఫీతో పాటు రూ.50 లక్షల నగదు, మారుతీ సుజుకీ సెలీనియం కారు గెల్చుకున్నాడు. ఇదేమంత సులువుగా దక్కిన విజయం కాదు. దేశవ్యాప్తంగా కొన్ని వందల మంది ఆడిషన్‌లో పాల్గొంటే.. ఎన్నో వడపోత ప్రక్రియల తర్వాత 34 మందిని ఎంపిక చేశారు కలర్స్ టీవీ వాళ్లు. గానం, నృత్యం, జిమ్నాస్టిక్స్, షాడో ఆర్ట్స్.. ఇలా విభిన్న రంగాల నేపథ్యం కలిగిన వీరి మధ్య భారీ పోరాటాలే జరిగాయి. అన్ని అడ్డంకులూ అధిగమించి తుదిపోరుకు ఎంపికైన వారు ఆరుగురు. వీరంతా ఆయా రంగాల్లో ఉద్దండపిండాలే అని దేశం మొత్తం ఒప్పుకొంది. ఈ ఉద్దండుల్లోకి ఒకేఒక్కడుగా నిలిచిన వాడే మన మానిక్ పాల్.



బాల్యంపై ఉగ్రపంజా..

అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన మాణిక్ పాల్ తల్లిదండ్రులు అస్సాంలోని బార్‌పేట రోడ్‌లో నివాసముండేవారు. మొదట్నుంచీ పేదరికంలోనే మగ్గిన ఈ కుటుంబానికి ఉగ్రవాద పంజా కోలుకోలేనంత బలంగా తాకింది. 1999లో బార్‌పేట రోడ్‌లో మాణిక్ పాల్ తండ్రిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. అప్పటినుంచి వారి పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఏమీ తెలుసుకోలేని వయసులో ఉన్న మాణిక్‌ను అమ్మ కష్టపడి పోషించేది. టీ కొట్టు నడుపుతూ నెట్టుకొచ్చేది. ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ చిన్నారిని పెద్ద చేసింది.



కోల్‌కతాకు..

చదువుకోసం మాణిక్‌ను కోల్‌కతా పంపించింది అతని తల్లి. మొదట్నుంచీ మాణిక్‌కు ఏది ఇష్టమో అదే చేయమని ప్రోత్సహించేది. తండ్రి మరణం ప్రతీకారాన్ని రగిల్చిందో ఏమో.. మాణిక్ సైనికుడు కావాలనుకున్నాడు. అందులో భాగంగానే రోజూ రన్నింగ్ చేసేవాడు. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాడు. క్రీడల్లో కూడా చురుకుగా పాల్గొనేవాడు. ఇలా క్రమంగా ఎదుగుతూ వచ్చాడు. ఎలా వచ్చి కుట్టిందో తెలీదు.. మాణిక్‌ను డ్యాన్స్ దోమ కుట్టింది. కోల్‌కతాలోనే ఓ డ్యాన్స్ గ్రూపులో చేరాడు.



కలల నగరం వైపు..

ఈ గ్రూపులో ఉన్నప్పుడే మాణిక్‌కు సినిమాల పిచ్చి పట్టింది. బాలీవుడ్‌లో డ్యాన్సర్‌గా మెరవాలనుకున్నాడు. తన అభిమాన డ్యాన్స్ మాస్టర్ రెమో డిసౌజా ఉండే ముంబై వైపు అడుగులేశాడు. ఇక్కడే పూర్తి స్థాయి జిమ్నాస్ట్‌గా మారాడు మాణిక్ పాల్. గాల్లో విన్యాసాలు చేస్తూ ఈ కుర్రాడు వేసే స్టెప్పులకు అందరూ అదిరిపోయారు. అత్యంత కష్టమైన విన్యాసాలు సైతం ఇంత సులభమా అనిపించేలా చేసేవాడు. ఇదే కలర్స్ టీవీ వాళ్ల ‘ఇండియాస్ గాట్ టాలెంట్’లో పాల్గొనేలా చేసింది. అంతే.. తర్వాతి కథంతా మనం టీవీల సాక్షిగా చూస్తున్నదే!



బాలీవుడ్ ఆశలు..

ట్రోఫీ, కారుతో పాటు రూ.50 లక్షలను అందుకున్న మాణిక్ పాల్.. తదుపరి లక్ష్యం బాలీవుడ్డే అంటున్నాడు. సెమీఫైనల్‌కు ప్రత్యేక అతిథులుగా హాజరైన ‘ఏబీసీడీ-2’ హీరో వరుణ్ ధావన్, దర్శకుడు, నృత్య దర్శకుడు రెమో డిసౌజాలు ఇచ్చిన కాంప్లిమెంట్స్ తనకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయని చెబుతున్నాడు. మరీ ముఖ్యంగా రెమో డిసౌజా తనకు ఆరాధ్యమనీ.. అతన్ని గతంలో ఎన్నోసార్లు కలవాలని విఫలయత్నం చేశానని అంటున్నాడు. ప్రస్తుతం.. అతని కాల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నానని ఆశగా చెప్పాడు.


అమ్మకో ఇల్లు..

చిన్ననాటి నుంచి అమ్మ ఎన్నో కష్టాలు పడిందనీ.. ఇకపై అలా జరగనివ్వనని చెబుతున్నాడు. అమ్మకు ముంబైలో ఓ ఫ్లాట్ కొనివ్వడమే తన ముందున్న పెద్దపని అన్నాడు. రెండేళ్లు అమ్మకు దూరంగా ఉన్నానని.. ఇకపై అమ్మతోనే గడుపుతానని చెప్పాడు. తన కలల గృహాన్ని త్వరలోనే దక్కించుకుంటానని ధీమాగా చెబుతున్నాడు. ఒకప్పుడు రాత్రీపగలూ తాను సాధన చేస్తుంటే చూసి హేళన చేసిన వారే ఇప్పుడు పొగుడుతూ ఉంటే ఎంతో సంతోషంగా ఉందంటూ ఆనందబాష్పాలు రాల్చాడు.



కొసమెరుపు..

మాణిక్ పాల్ ఏరియల్ డ్యాన్స్ విన్యాసాలు చూసిన ఎవరికైనా.. ఇతడి గైడ్ ఎవరో తెలుసుకోవాలనీ.. వీలైతే అతని దగ్గర శిక్షణ తీసుకోవాలనీ అనిపించక మానదు. అయితే, మాణిక్ ఓ ఏకలవ్య శిష్యుడు. తనకు తానే ఓ గురువు. ఈ గురువు నిజంగానే ఓ ఏరియల్ జిమ్నాస్టిక్ ఇన్‌స్టిట్యూట్‌ని తెరవాలనుకుంటున్నాడట. ఇదీ ఫలించాలని కోరుకుందాం..!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top