గణతంత్ర దినోత్సవాన చంద్రుడిపై త్రివర్ణ పతాకం

గణతంత్ర దినోత్సవాన చంద్రుడిపై త్రివర్ణ పతాకం


గూగుల్‌ లూనార్‌ ఎక్స్‌ప్రైజ్‌ కోసం టీం ఇండస్‌ పోటీ

రాకెట్‌ కోసం ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ




న్యూఢిల్లీ: చంద్రుడిపై 2018 భారత గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను నిలిపేందుకు ‘టీం ఇండస్‌’ అనే అంతరిక్ష ప్రయోగాల స్టార్టప్‌ కంపెనీ ప్రయత్నిస్తోంది. ‘గూగుల్‌ లూనార్‌ ఎక్స్‌ప్రైజ్‌’ పోటీలో గెలవడంలో భాగంగా టీం ఇండస్‌ ఈ ప్రయోగం చేపడుతోంది. ఏవైనా ప్రైవేటు సంస్థలు సొంతంగా డబ్బు సమకూర్చుకుని అంతరిక్ష వాహక నౌకను చంద్రుడిపైకి పంపి, 500 మీటర్లు దానిని చంద్రుడిపై ప్రయాణింపజేసి, అది తీసిన అధిక నాణ్యత కలిగిన వీడియో, ఫొటోలను భూమికి చేరవేయగలిగితే గూగుల్‌ పోటీని గెలవొచ్చు.



25 మిలియన్‌ డాలర్లు బహుమతిగా లభిస్తాయి. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకోకూడదు. ప్రపంచవ్యాప్తంగా 30 కంపెనీలు గూగుల్‌ లూనార్‌ ఎక్స్‌ప్రైజ్‌ కోసం పోటీ పడుతుండగా భారత్‌ నుంచి టీం ఇండస్‌ మాత్రమే పోటీలో ఉంది. తమ అంతరిక్ష వాహక నౌకను 2017 చివర్లో పీఎస్‌ఎల్వీ రాకెట్‌ ద్వారా చంద్రుడిపైకి పంపేందుకు టీం ఇండస్‌ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)తో ఇటీవలే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పోటీలో ఉన్న 30 కంపెనీల్లో ప్రయోగానికి రాకెట్‌ను సమకూర్చకున్న తొలి సంస్థగా టీం ఇండస్‌ నిలిచింది.



ఈ ప్రాజెక్టుకు 60 మిలియన్‌ డాలర్లు ఖర్చు అవుతాయనీ, ఇప్పటికి 15 మిలియన్‌ డాలర్లు సమకూరగా, వచ్చే ఏడాది అక్టోబరుకల్లా మరో 45 మిలియన్‌ డాలర్లను సేకరించాల్సి ఉందని టీం ఇండస్‌ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్‌ జూలియస్‌ అమృత్‌ చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top