సత్వరమే పరిష్కరించుకుందాం


సరిహద్దు వివాదంపై భారత్, చైనా నిర్ణయం

 

న్యూఢిల్లీ: సరిహద్దు సమస్యకు సత్వర పరిష్కారం కనుక్కోవాలని భారత్, చైనాలు నిర్ణయించుకున్నాయి. సరిహద్దు వివాదానికి వీలైనంత త్వరగా ముగింపు పలకడం ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమవుతాయని అభిప్రాయపడ్డాయి. భారత పర్యటనలో భాగంగా చెనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం జరిపిన శిఖరాగ్ర చర్చల్లోనూ సరిహద్దు అంశమే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చర్చ ల సారాంశంపై ఇరు దేశాలు శుక్రవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. సరిహద్దు వివాదంపై ఇరువురు నేతలూ తమ అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకున్నారని, ఈ విషయంలో ద్వైపాక్షిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇరు దేశాలకూ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నాయి.



సరిహద్దుల్లో శాంతి యుత వాతావరణం నెలకొనడం అత్యంత ముఖ్యమని, ఇందుకోసం సంయుక్తంగా కృషి చేయాలని తీర్మానించినట్లు తెలిపాయి. సరిహద్దు సమస్యకు సత్వర పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని, ఇరుదేశాల ప్రయోజనాల దృష్ట్యా దీన్ని వ్యూహాత్మక అంశంగా పరిగణనలోకి తీసుకుని వ్యవహరించాలని నిర్ణయించి నట్లు భారత్, చైనాలు పేర్కొన్నాయి. ఇక ఇప్పటివరకు ఇరుదేశాల ప్రత్యేక ప్రతినిధులు సరిహద్దు సమస్య పరిష్కారానికి చేసిన కృషిని  మోదీ, జిన్‌పింగ్ ప్రశంసించారు. అలాగే నాలుగోసారి సంయుక్త సైనిక విన్యాసాలను చేపట్టాలని, ఏడో ఆర్థిక సదస్సును కూడా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపాయి.  ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో కీలక పాత్ర పోషించాలన్న భారత ఆకాంక్షకు మద్దతిస్తామని కూడా చైనా స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా ఇరు దేశాల ప్రయోజనాలు కాపాడుకునేందుకు పరస్పరం సహకరించుకోవాలని ఇరుదేశాలు అవగాహనకు వచ్చినట్లు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.

 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top