'భారత్ సురక్షిత దేశం కాదని చెప్పలేదు'
పనాజీ: సురక్షిత పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి భారత్, గోవాలను రష్యా తొలగించినట్టు వచ్చిన వార్తలను గోవాలోని రష్యా సమాచారం కేంద్రం తోసిపుచ్చింది. ఈ జాబితా నుంచి భారత్, గోవాలను తొలగించలేదని స్పష్టం చేసింది.
'రష్యా పర్యాటకుల కోసం ఆ దేశం సూచించే సురక్షిత పర్యాటక ప్రాంతాల జాబితాలో భారత్, గోవాలను చేర్చే విషయంపై రష్యా అధికారులు చర్చించలేదని ఇదివరకటి మా ప్రకటనలో పేర్కొన్నాం. అయితే రష్యా పర్యాటకులు వెళ్లేందుకు సురక్షితమైన దేశాల గురించి మాత్రమే రష్యా ప్రభుత్వం చర్చించింది. ఈ జాబితా నుంచి భారత్‌ను తొలగించినట్టు కానీ లేదా సురక్షితంకాని దేశాల జాబితాలో భారత్‌ను చేర్చినట్టు కానీ మేం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు' అని రష్యా సమాచారం కేంద్రం చీఫ్ ఎకటరీనా బెల్యకోవా చెప్పారు. సురక్షిత పర్యాటక దేశాల జాబితా నుంచి భారత్ ను తొలగించినట్టు ఆదివారం వార్తలు రావడంతో రష్యా సమాచారం కేంద్రం చీఫ్ వివరణ ఇచ్చారు.