హార్బర్‌లైన్.. చోరుల ఇష్టారాజ్యం..


సాక్షి, ముంబై : హార్బర్‌లైన్ మార్గంలోని బాంద్రా-మాహిమ్ రైల్వే స్టేషన్ల మధ్య రోజురోజుకు చోరీలు పెరిగిపోతున్నాయి. దీంతో ఈ ట్రాక్‌ల వెంబడి ఉన్న పొదలను రైల్వే పోలీసులు తొలగిస్తున్నారు. మద్యానికి బానిసైన కొందరు దుండగులు సులభంగా డబ్బులు సంపాదించేందుకు దోపిడీమార్గాన్ని ఎంచుకుంటున్నారని, ఈ మేరకు వారు దాదాపు 10 అడుగుల ఎత్తులో ఉన్న పొదల్లో ఉంటూ చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు.



 రైలు ఫుట్‌బార్‌పై ప్రయాణిస్తున్న ప్రయాణికులపై సైతం దాడికి దిగుతున్నారు. ప్రయాణికుల సెల్ ఫోన్లను అదేవిధంగా బ్యాగులను చోరీ చేయడం వారికి అలవాటుగా మారింది. తాము పెట్రోలింగ్ నిర్వహించే సమయంలో పొదలను తొలగిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ప్రయాణికులపై దాడికి సంబంధించి దాదాపు 70 కేసులు  బాంద్రా గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ) నమోదయ్యాయి.  ట్రాక్‌ల వెంబడి పూర్తిగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడంవల్ల  చోరీలకు సులభమవుతోందని పోలీసులు చెబుతున్నారు.



ఇక్కడ దొంగతనాలు ఎక్కువ రాత్రి సమయంలోనే చోటుచేసుకుంటున్నాయని, అందువల్ల ఈ ప్రాంతాల్లో లైట్లు ఏర్పాటుచేయాలని రైల్వే అధికారులకు ఎన్నో రోజులుగా విజ్ఞప్తి చేస్తున్నామని జీఆర్పీ అధికారులు చెబుతున్నారు. చీకటి సమయంలో ఎటువంటి ఆయుధాలు లేకుండా తాము నిఘా పెట్టాలంటే ఇబ్బందిగా ఉంటోందని, చీకటిని ఆసరాగా చేసుకుని దుండగులు తమపై సైతం దాడులు చేయడానికి వెనుకాడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సిబ్బంది బాంద్రా బ్రిడ్జి కింద విధులు నిర్వహిస్తున్న సమయంలో దుండగులు వారిపై రాళ్లు రువ్విన ఘటనలు చాలా ఉన్నాయని వారు తెలిపారు. అందువల్ల ఇక్కడ ఫెన్సింగ్ ఏర్పాటుచేయాలని, లైటింగ్ వ్యవస్థను సైతం ఏర్పాటుచేయాలని రైల్వే అధికారులకు ఎన్నిసార్లు సూచించినా పట్టించుకోవడంలేదన్నారు.



 ఇదిలా ఉండగా, ఫెన్సింగ్ ఉన్న ప్రాంతాల్లో సైతం దుండగులు గుంతలు ఏర్పాటుచేసుకుని, వాటి నుంచి తప్పించుకుపోతున్నారని చెబుతున్నారు. అలాగే పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు పలువురు చాలా మార్గాలను ఎంచుకుంటున్నారని వివరించారు. ఈ చోరులు చిన్ని చిన్న డబ్బాలను వెంట తెచ్చుకుంటారని, పోలీసులకు పట్టుబడిన తర్వాత తాము ఇక్కడే నివాసముంటామని చెబుతూ తప్పించుకుంటారని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ప్రయాణికులను తిరిగి లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతుంటారని చెప్పారు. కాగా, వీలైనంతమేరకు జీపీఆర్‌కు సహాయం చేస్తూనే ఉన్నామని రైల్వే పేర్కొంది. రైల్వే ట్రాక్‌ల వెంబడి చిత్తడి చిత్తడిగా ఉండడంతో పూర్తిగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top