ప్లీజ్.. మా భార్యల నుంచి రక్షించండి..

ప్లీజ్.. మా భార్యల నుంచి రక్షించండి..


వడోదర: ఇప్పటివరకు భర్త బాధితులను చూశాం.. తమ షాడిస్టు భర్తల నుంచి తమను కాపాడంటూ మొరపెట్టుకునే భార్యలనూ చూశాం.. కానీ తొలిసారి అందుకు విరుద్ధంగా ఈసారి భర్తల వంతైంది. భరించలేకపోతున్నాం.. దయచేసి మా భార్యల నుంచి మమ్మల్ని కాపాడండోయ్ అంటూ గుజరాత్లో మహిళల రక్షణ కోసం ఏర్పాటుచేసిన హెల్ప్ లైన్ను భర్తలు ఆశ్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు.



గృహహింస, ఈవ్ టీజింగ్ తదితర వేధింపుల నుంచి మహిళలను రక్షించేందుకు పోలీసులు అభయం అనే హెల్ప్ లైన్ గుజరాత్ ప్రభుత్వం ప్రారంభించింది. అందుకోసం ప్రత్యేకంగా 181 అనే టోల్ ఫ్రీ నంబర్ కేటాయించారు. అయితే, ఇప్పుడు మాత్రం ఆ నెంబర్కు మహిళల కన్నా పురుషులే ఎక్కువగా ఫోన్లు చేస్తున్నారని వారు చెప్తున్నారు. తమ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, గృహహింసకు పాల్పడుతున్నారని సదరు భర్తలు హెల్ప్ లైన్కు ఫోన్ చేసి వాపోతున్నారట. భార్యలు తమ తల్లిదండ్రులతో సరిగా మెదలడంలేదని, దానికి తోడు అత్తల పోరు కూడా ఎక్కువై పోయిందని వారు భయపడుతూ చెప్తున్నారట.



గత ఆరు నెలలుగా ఈ హెల్ప్లైన్కు 25శాతం మంది పురుషులే ఫోన్ చేశారని హెల్ప్ లైన్ అధికారులు తెలిపారు. ఎలాగైనా తమ భార్యలకు మంచి మార్గదర్శకాలు సూచించి వారిలో మార్పు తీసుకురావాలని వారు కోరుతున్నారని వివరించారు. అయితే, కేవలం మహిళల కోసం ఏర్పాటుచేసిన హెల్ప్ లైన్ ద్వారా వారి పురుషుల సమస్యలు పరిష్కరించాలని తాము అనుకోవడం లేదని, కానీ, విషయం మాత్రం తీవ్రంగానే ఉందని అధికారులు తెలిపారు. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 181 కు వచ్చిన ఫోన్ కాల్స్ మొత్తం 7,919 ఉండగా వాటిల్లో మహిళలు ఫిర్యాదు చేసినవి 5,718 కాగా, పురుషుల చేసినవి 1,201.. అంటే దాదాపు 28శాతం భార్యల బాధితులు చేసినవే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top