మా కుటుంబంలో బాధ వర్ణించలేను: అఖిలేశ్‌

మా కుటుంబంలో బాధ వర్ణించలేను: అఖిలేశ్‌ - Sakshi


న్యూఢిల్లీ: ప్రధాని మంత్రి నరేంద్రమోదీని ఎన్నికల ప్రచారంలో ముందు పెట్టకపోయుంటే బీజేపీ మొత్తానికే తుడిచిపెట్టుకుపోయేదని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. నిన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన ఆయన తన సతీమణి డింపుల్‌ యాదవ్‌తో కలిసి కాలిదాస్‌ మార్గ్‌లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సేద తీరుతూ కనిపించారు. ఈ సందర్భంగా సరదాగా మీడియాతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో ప్రజలు అభివృద్ధిని చూసే ఓటు వేశారని, ఆర్భాటం చూసి కాదని అన్నారు. వారణాసి మొత్తం కూడా ఎస్పీ చేతుల్లోకి వచ్చేదని, ఆ విషయం ముందు గ్రహించే చివరకు మోదీని అక్కడ ప్రచారంలోకి బీజేపీ దింపిందని లేదంటే అక్కడ ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయి ఉండేదని చెప్పారు.



వారణాసి కోసం ప్రత్యేకంగా బీజేపీ కేంద్రమంత్రులంతా ప్రచారం నిర్వహించారని, తమ పార్టీకి అలాంటి పరిస్థితి లేదని అన్నారు. తాము చేసిన మంచి పని ముందు బీజేపీ వారణాసిలో గల్లంతయ్యేదని మోదీని ముందుపెట్టి ఆ పరిస్థితిని కొంత మార్చుకోగలిగారని చెప్పారు. ‘తొలుత వారం రోజులపాటు బాగా కష్టంగా అనిపించింది. కానీ, తర్వాత పరిస్థితి మెరుగవుతూ వచ్చింది’  అని డింపుల్‌ ప్రచారం గురించి చెప్పారు.



గత ఏడాది కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు ఎలా తట్టుకోగలిగారు ఆ పరిస్థితిని కాస్త చెబుతారా అని డింపుల్‌ను ప్రశ్నించగా అఖిలేశ్‌ మధ్యలో జోక్యం చేసుకొని ఒక కథ చెప్పారు. ‘ఒకసారి రామకృష్ణ పరమహంసను ఒకసారి వివేకానందుడు దేవుడిని చూపించమని అడిగారు. దాంతో ఆయన గట్టిగా గిల్లారు. ఏమైందని ప్రశ్నించగా నొప్పిగా ఉందని బదులిచ్చారు. నొప్పి చూపించాలని రామకృష్ణ పరమహంస కోరగా వివేకానందుడు ఆశ్చర్యపోయారు. అలాగే మా ఇంట్లో పరిస్థితి ఎంత బాధకరమైందో మాటల్లో చెప్పలేను’ అని చెప్పారు. ప్రచారంలో ప్రజలు తమకు బ్రహ్మరథం పట్టారని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top