విద్యార్థుల తరపున నేను పోరాడతా: రాహుల్

విద్యార్థుల తరపున నేను పోరాడతా: రాహుల్


పూణె: ఎఫ్‌టీఐఐ విద్యార్థుల జీవితాలతో బీజేపీ ప్రభుత్వం ఆడుకుంటోందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మండిపడ్డారు.  పుణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా( ఎఫ్‌టీఐఐ) విద్యార్థులతో ఆయన శుక్రవారం  భేటీ అయ్యారు.  ఈ సందర్భంగా రాహుల్ ...వారి సమస్యలనుఅడిగి  తెలుసుకున్నారు.  అధికార పార్టీ యూనివర్శిటీలో రాజకీయాలు చేస్తోందంటూ ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు.  విద్యార్థుల పక్షాన పోరాటం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు.





ఎఫ్‌టీఐఐ ఛైర్మన్‌గా టెలివిజన్ యాక్టర్ గజేంద్ర సింగ్ చౌహాన్‌ నియామకాన్ని తీవ్రంగా నిరసిస్తూ గడిచిన రెండు నెలలుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.  దీనిపై మీరు జోక్యం చేసుకోవాలంటూ విద్యార్థులు రాహుల్‌గాంధీకి లేఖ రాశారు. దీనికి స్పందించిన రాహుల్ ఎఫ్‌టీఐఐను సందర్శించి, ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఓవైపు చౌహాన్ నియామాకాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తుంటే...మరోవైపు ఆయన్ని ఎందుకు పదవిలో కొనసాగిస్తున్నారని రాహుల్ ప్రశ్నించారు. గజేంద్ర సింగ్ చౌహాన్ ను ప్రధాని మోదీ నియమించారని, ఈ విషయంలో మోదీని ప్రశ్నించే ధైర్యం లేక మంత్రులు భయపడుతున్నారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా ఆర్ఎస్స్పై కూడా రాహుల్ విరుచుకుపడ్డారు. మరోవైపు రాహుల్ గాంధీ కొత్త లుక్తో కనిపించారు. జీన్స్, టీషర్టు వేసుకుని వచ్చిన రాహుల్ చాలాసేపు విద్యార్థులతో ముచ్చటించారు.





ఇక ఇటు బీజేపీ కూడా  రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించింది. . ఒకవైపు పార్లమెంటు సమావేశాలు సాగుతుంటే రాహుల్ ఎఫ్‌టీఐఐ విద్యార్థుల కోసం పుణే వెళ్లడాన్ని తప్పుబట్టింది.  కేవలం విద్యార్థులతో ఫోటో ఫోజుల కోసం రాహుల్ ఎఫ్‌టీఐఐకు వెళ్లారని వ్యాఖ్యానించింది. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన పుణే  అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నాడని బీజేపీ నేత సిద్ధార్ధ్ నాధ్ సింగ్ ఆరోపించారు.  రాహుల్ పర్యటన సందర్భంగా స్థానిక బీజేపీ కార్యకర్తలు  నిరసన  కార్యక్రమాలు చేపట్టారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top