ఎంఐఎంకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ


నాందేడ్, న్యూస్‌లైన్: ఎంఐఎం పార్టీని నిషేధించాలంటూ వివిధ పార్టీలు గురువారం భారీ ర్యాలీ నిర్వహించాయి. దీంతో పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, శివసేన, హిందూరక్ష, ఎమ్మెన్నెస్ తదితర పార్టీల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. పట్టణంలోని మహవీర్ చౌక్‌లోని పంచముఖి హనుమాన్ మందిరంలో తొలుత హారతి కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం ఈ ర్యాలీ ప్రారంభించారు.



ముందుగా నిర్దేశించిన ప్రకారం గాడిపురలోని మాతా రేణుకాదేవి మందిరం నుంచి ర్యాలీ ప్రారంభం కావాల్సి ఉంది.అయితే పోలీసు శాఖ అందుకు నిరాకరించడంతో మహావీర్ చౌక్ నుంచి చేపట్టారు. ముందుజాగ్రత్తగా అనేక మంది వ్యాపారులు తమ దుకాణాలను మూసివేశారు. డీఎస్పీ, ముగ్గురు పోలీసు ఇన్‌స్పెక్టర్లు, ఎనిమిది మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, 350 మంది పోలీసులతోపాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ట్రాఫిక్ సిబ్బంది కూడా బందోబస్తు బాధ్యతల్లో పాలుపంచుకున్నారు. ర్యాలీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్న అనంతరం ధర్నా చేశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌తోపాటు ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా నినదించారు.



కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిందూ దేవతలను అవమానపరిచే విధంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు చేశారని, అందువల్ల ఆ పార్టీని నిషేధించాలని ఆందోళనకారులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గతంలో ఎంఐఎం పార్టీ కార్యకర్తలు చేసిన అనేక దాడుల్లో హిందువులు గాయపడ్డారని, వివిధ హత్యలు, నేరాల్లో అరెస్టయిన వారిలో కూడా వారే ఉన్నారని ఆరోపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ధీరజ్‌కుమార్‌కు ఓ వినతి పత్రం అందజేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top