2017 వరకూ యమునా ప్రక్షాళన


న్యూఢిల్లీ:  యుమునా నది నీటిని తాగే రోజులు వస్తున్నాయి. అంతేకాదు నదిలో ఎంచక్కా ఈతకొట్టడానికి వీలుగా ప్రక్షాళన కార్యక్రమాలు జరుగుతున్నాయి.  2017 వరకు ఈ కలను సాకారం చేసే దిశగా చర్యలు ముమ్మరం చేస్తున్నారు. యుమునా నీటిని వినియోగించే విధంగా మురుగునీటి శుద్ధి ప్లాంట్లను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా జపాన్ అంతర్జాతీయ సంస్థ (జేఐసీఏ)తో కలిసి భారత ప్రభుత్వం ఈ మేరకు ఒప్పందం చేసుకొంది. 2017 వరకు యుమునా ప్రక్షాళన పూర్తి చేయాలని నిర్ణయించాయి. ఇప్పటికే మురుగు నీటి శుద్ధి ప్రాజెక్టుల అమలుతోపాటు వివిధ కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయి. ‘2017 సంవత్సరం నాటికి యమునా నీటిలో ఈతకొడుతా, యమునా నీటిని తాగుతానని’ జేఐసీఏ-ఇండియా ప్రధాన ప్రతినిధి సినియా ఎజమా చెప్పారు. ఢిల్లీ పరిధిలో శుద్ధి చేయని మురుగు నీటిని యథేచ్ఛగా యమునా నదీలోకి వదిలివేయడంతో కాలుష్య కాసారంగా మారిందని అన్నారు.

 

 ఇండో-జపాన్ జాయింట్ వర్కింగ్ గ్రూపు ఆధ్వర్యంలో జేఐసీఏ పట్టణ ప్రాంతాల్లో  అమలు చేస్తున్న కార్యక్రమాల్లో తీరుపై నిర్వహించిన సమావేశంలో సినియా ప్రసంగించారు. పట్టణ ప్రాంతాల్లో వివిధ ప్రాజెక్టులు, నీరు-యాజమాన్యం(రవాణా) కోసం రూ. 2,40,000 కోట్ల వ్యయంతో చేపట్టడానికి తమ ఏజెన్సీ ఒప్పందం చేసుకొన్నదని చెప్పారు. రూ. 28,660 కోట్ల వ్యయంతో మురుగునీరు, నీటి సరఫరా కోసం 16 ప్రముఖ ప్రాజెక్టులు చేపట్టడానిక జపాన్ నాయకులు అంగీకరించారని చెప్పారు. ఈ ప్రాజెక్టులను ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఒడిశ్సా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, గోవాలో చేపట్టనున్నట్లు పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి పేర్కొన్నారు.

 

 నీటి విభాగంలో అనేక సవాళ్లు

 ఇండియాలో నీటి విభాగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని జేఐసీఏ అభిప్రాయపడింది. నీటి  నిర్వహణ-పంపిణీ(ఓ అండ్ ఎం)ల కోసం స్థానిక సంస్థలు ఆర్థిక ఇబ్బందులను అధిగమిం చాల్సి ఉంది. పీపీపీ మోడల్ ద్వారా (ఓ అండ్ ఎం) ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆధునాతన పద్ధతుల్లో రీసైక్లింగ్ సాంకేతిక  నైపుణ్యం పై ప్రచారం చేసి నీటి కొరతను అధిగమించాల్సి ఉంది. దేశంలో పట్టణ రవాణా వ్యవస్థ కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రధానంగా పట్టణ మేధో రవాణా పద్ధతులను(ఐటీఎస్) ప్రవేశపెట్టడంలో వెనుకబడిపోయింది. మెట్రో రైలు ప్రవేశం-నిర్వహణ, ప్రాంతీయ రవాణా విభాగం, మోనోరైళ్లు, లైట్ రైలుపై సరైన అవగాహన లేదు. రవాణా-సాంకేతిక రంగాల్లో సమగ్ర చైతన్యం కొరవడిందని జేఐసీఏ తెలిపింది. ఈ సందర్భంగా  పట్టణ అభివృద్ధి సెక్రటరీ శంకర్ అగర్వాల్, జపాన్ డెరైక ్టర్ జనరల్  యోచి నాక్‌గమీ మాట్లాడుతూ.. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ సందర్శించినప్పుడు ప్రధానంగా పట్టణ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించారని చెప్పారు. ఏడేళ్ల తరువాత రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వర్కింగ్ గ్రూపుతో సమావేశమైందని అన్నారు.

 

 ముందంజలో..

  గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశ్సా, కేరళలో పట్టణ అభివృద్ధి కోసం సాంకేతిక, ఆర్థిక పరమైన ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాయి.  మహారాష్ట్ర ప్రభుత్వం 450 కిలోమీటర్ల నెట్‌వర్క్‌తో మెట్రో రైలును ప్రవేశపెట్టింది, 241 కిమీ శివారు రైలు మార్గం, 1,660 కిమీ పట్టణ హైవేలు, 77 కిమీ హైవే కారిడార్‌ల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. దీంతోపాటు ప్రయాణికులకు నీటి రవాణా తదితర పట్టణాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. 2031 వరకు పట్టణ ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసింది.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top