పెల్లెట్ గన్స్కు ప్రత్యామ్నాయం!

పెల్లెట్ గన్స్కు ప్రత్యామ్నాయం!


కశ్మీర్‌పై ఎవరితో చర్చించేందుకైనా సిద్ధం

కశ్మీర్‌పై ఆధారపడ్డ దేశ భవిష్యత్తు

రెండ్రోజుల పర్యటన ముగింపులో రాజ్‌నాథ్


శ్రీనగర్: కశ్మీర్‌లో పెల్లెట్ గన్స్ వాడకంపై నిరసనల నేపథ్యంలో వాటి స్థానంలో త్వరలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని హోం  మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు. కశ్మీర్‌లో రెండ్రోజుల పర్యటనలో భాగంగా గురువారం శ్రీనగర్‌లో మాట్లాడుతూ... ఇన్సానియత్, జమ్హూరియత్, కశ్మీరీయత్(కశ్మీరీల ఉమ్మడి సంస్కృతి) పరిధిలో ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై ఎవరితోనైనా చర్చించేందుకు సిద్ధమన్నారు. రాష్ట్ర సీఎం మెహబూబాతో కలిసి మీడియాతో మాట్లాడారు. కశ్మీర్ భవిష్యత్తు భద్రంగా లేకపోతే, భారత దేశ భవిష్యత్తు కూడా భద్రత ఉండదని తేల్చి చెప్పారు.‘పెల్లెట్ గన్స్ వాడకంపై నిపుణుల కమిటీ నివేదిక నాలుగు రోజుల్లోనే వస్తుందని భావిస్తున్నాం. పెల్లెట్స్ గన్స్‌కు ప్రత్యామ్నాయం ఉండాలని భావిస్తున్నాం.’ అని రాజ్‌నాథ్ అన్నారు. ‘కశ్మీర్ భవిష్యత్తుతో ఆడుకోవద్దని  విజ్ఞప్తి చేస్తున్నా. స్థానిక యువత, భద్రతా సిబ్బందిలో ఎవరు మరణించినా దేశ ప్రజలకు బాధే’ అన్నారు.


రాళ్లకు బదులు పుస్తకాలు, పెన్నులుండాలి

విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ‘యువత చేతుల్లో రాళ్లకు బదులు పుస్తకాలు, పెన్నులు ఉండాలి. రాళ్లు పట్టుకునేలా వారిని ఎవరు రెచ్చగొడుతున్నారు? యువత భవిష్యత్తుకు వారు హామీనివ్వగలరా?. దేశంలోని ఇతర ప్రాంతాల యువతలాగే కశ్మీరీల యువత భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. హింస వైపు మొగ్గకుండా తప్పుదారి పడుతున్న యువతకు కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరముంది. సరైన దృ క్పథంలోనే పరిస్థితిని మేం అర్థం చేసుకున్నాం... పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం. శ్రీనగర్‌లో సీఆర్‌పీఎఫ్ బదులు బీఎస్‌ఎఫ్‌ను మోహరించడంపై అనవసర వివాదాన్ని సృష్టించాల్సిన అవసరం లేదు’ అని చెప్పారు.


ఆర్మీ శిబిరాలకు చాక్లెట్లు కొనడానికి వెళ్లారా: మెహబూబా

కశ్మీర్‌లో రాళ్లదాడి, ఇతర హింసాత్మక ఘటనల్ని సీఎం మెహబూబా ముఫ్తీ ఖండించారు. భద్రతా దళాలు, పోలీసు పికెట్లు, పోలీసు స్టేషన్లపై అల్లరి మూకలు దాడి వల్లే మరణాలు సంభవించాయన్నారు. ‘95 శాతం ప్రజలు సమస్య శాంతియుతంగా పరిష్కారం కావాలని ఆశిస్తున్నారు. హింసను ప్రోత్సహిచి ఐదు శాతం మంది సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు. రాళ్లదాడి, శిబిరాలపై దాడులతో ఏ సమస్య పరిష్కారం కాదు. ప్రజలు రోడ్డపైకి రావడంతో కర్ఫ్యూ విధించాం. ఆర్మీ శిబిరాలకు పిల్లలు చాక్లెట్లు కొనడానికి వెళ్లారా?’ అంటూ ఆమె ప్రశ్నించారు. డామ్హల్ హంజిపూరాలో పోలీసు స్టేషన్‌పై దాడిని ప్రస్తావిస్తూ‘15 ఏళ్ల అబ్బాయి పాలు కోసం అక్కడి వెళ్లాడా?’ అంటూ ఆవేశంగా మాట్లాడారు. 2010లో ఒమర్ అబ్దుల్లా సీఎంగా ఉన్నప్పుడు భద్రతా దళాల చర్యల్ని, వేర్పాటు వాదుల అరెస్టును వ్యతిరేకించారు కదా? అన్న విలేకరి ప్రశ్నకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి లేచి వెళ్లిపోయారు.


 పెల్లెట్స్ బదులు ‘పావా షెల్స్’

పెల్లెట్ గన్స్ స్థానంలో ‘పావా షెల్స్’(పెలార్గనిక్ యాసిడ్ వనిల్లైల్ అమైడ్) తీవ్రమైన కారం ఘాటుతో కూడిన వీటిని వాడేందుకు నిపుణుల కమిటీ మొగ్గుచూపింది. కొత్తగా అభివృద్ధి చేసిన ఈ షెల్స్ పనితీరును ఇటీవలే ఢిల్లీలోని పరీక్షా కేంద్రంలో కమిటీ పరిశీలించింది.


 ఏమిటీ పావా షెల్స్: పావా మరోపేరు నోనివమైడ్. మిరపకాయలో ఈ రసాయనిక పదార్థం లభ్యమవుతుంది. స్కొవిల్లే స్కేల్(మిరపఘాటును లెక్కించే కొలమానం)పై పావాది గరిష్ట స్థాయి. ఇది మనుషులను తీవ్రంగా చికాకు పెట్టడంతో పాటు గుంపుల్ని చెదరగొడుతుంది. ఘాటైన వాసన, కారంగా ఉండేందుకు ఆహార పదార్థాల్లో కూడా వాడతారు. ప్రయోగించగానే షెల్స్ పేలి శత్రువును తాత్కాలికంగా నిరోధిస్తుంది, అల్లరిమూకల్ని చెల్లాచెదురు చేస్తుంది. టియర్ గ్యాస్ షెల్, పెప్పర్ స్ప్రే కంటే ప్రభావంతంగా పనిచేస్తుంది.


 గ్వాలియర్‌లో తక్షణం తయారీ: ఈ షెల్స్‌పై ఏడాదిగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ (లక్నో)లో పరిశోధనలు నిర్వహించారు. కశ్మీర్ హింసాకాండ సమయంలోనే పూర్తి ఫలితం అందుబాటులోకి వచ్చింది. ‘పెల్లెట్ గన్స్‌కు ప్రత్యామ్నాయంగా పావా షెల్స్ వైపు మొగ్గుచూపాం. గ్వాలియర్‌లో బీఎస్‌ఎఫ్‌కు చెందిన టియర్ స్మోక్ విభాగానికి వీటి తయారీ బాధ్యత అప్పగించాలని సూచించాం’ అని కమిటీ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top