చరిత్రకారుడు బిపన్ కన్నుమూత

చరిత్రకారుడు బిపన్ కన్నుమూత - Sakshi


గుర్గావ్(హర్యానా): ఆధునిక భారతదేశ చరిత్రను సాధారణ ప్రజలకు చేరువ చేసిన ప్రముఖ చరిత్ర కారుడు బిపన్ చంద్ర(86) ఇకలేరు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం గుర్గావ్‌లోని స్వగృహంలో నిద్రలోనే తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగేళ్ల కిందట భార్య మరణించినప్పటినుంచి చంద్ర ఆరోగ్యం సరిగ్గా లేదని, అయితే కడపటి వరకు రచనలు సాగిస్తూనే వచ్చారని ఆయన మాజీ శిష్యుడు, జవహర్‌లాల్ వర్సిటీ కాలేజీలో సహోద్యోగి అదిత్య ముఖర్జీ చెప్పారు.

 

ఆరోగ్యం బాగాలేకున్నా ఆత్మకథతోపాటు భగత్‌సింగ్ జీవిత చరిత్రను పూర్తి చేశారని, అవి ముద్రణకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. దేశ ఆర్థిక, రాజకీయ చరిత్రలను వామపక్ష కోణంలో పరిశోధించిన చంద్ర చేసిన రచనలు మేధావులతోపాటు సాధారణ పాఠకుల ఆదరణ కూడా చూరగొన్నాయి. వలసవాదం, జాతీయోద్యమం, సమకాలీన చరిత్ర, మతతత్వ వ్యతిరేక ఉద్యమాలపై ఆయన విస్తృతంగా రచనలు చేశారు.



‘ఇన్ ద నేమ్ ఆఫ్ డెమోక్రసీ: జేపీ మూవ్‌మెంట్ అండ్ ది ఎమర్జెన్సీ’, ‘ద రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ ఎకనమిక్ నేషనలిజం’, ‘నేషనలిజం అండ్ కలోనియలిజం ఇన్ మోడరన్ ఇండియా’, ‘ద మేకింగ్ ఆఫ్ మోడరన్ ఇండియా: ఫ్రమ్ మార్క్స్ టు గాంధీ’, ‘ద ఇండియన్ లెఫ్ట్: క్రిటికల్ అప్రైజల్’ తదితరాలు ఆయన రచనల్లో కొన్ని. మహాత్మాగాంధీ జీవితంపై సాధికార రచనలు చేసిన చంద్ర చరిత్ర పుస్తకాలు పాఠశాలలు, కాలేజీల సిలబస్‌లో చోటుసంపాదించుకున్నాయి.

 

1928లో హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాలో జన్మించిన ఆయనలాహోర్‌లోని ఫార్మన్ క్రిస్టియన్ కాలేజీ, స్టాన్‌ఫర్డ్ వర్సిటీ(అమెరికా), ఢిల్లీ వర్సిటీల్లో చదువుకున్నారు. జేఎన్‌యూలోని చరిత్ర అధ్యయనాల కేంద్రం అధ్యక్షుడిగా, యూజీపీ సభ్యుడిగా, నేషనల్ బుక్ ట్రస్ట్ చైర్మన్‌గా పనిచేశారు. ‘ఎంక్వైరీ’ పత్రికను స్థాపించి చాలాఏళ్లు సంపాదకమండలి సభ్యుడిగా వ్యవహరించారు. పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. ఆయన మృతితో నిబద్ధులైన మేధావుల శకం ఒకటి వెళ్లిపోయిందని అభిమానులు పేర్కొన్నారు. చంద్ర మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితర నేతలు కూడా నివాళి అర్పించారు.  బ్రిటిష్ వలసవాదంపై పోరులో లౌకిక, వామపక్ష శక్తుల పాత్రను చంద్ర వెలుగులోకి తెచ్చారని సీపీఐ కేంద్ర సెక్రటేరియట్ ఓ ప్రకటనలో కొనియాడింది.

 

భవిష్యత్ తరాలకు మార్గదర్శకం: జగన్

సాక్షి, హైదరాబాద్: బిపన్ చంద్ర మృతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామం, మహాత్మాగాంధీ ఆ ఉద్యమాన్ని నడిపిన తీరు వంటి అంశాలపై చంద్ర రచనలు దశాబ్దాలుగా చరిత్ర కారులకు, చరిత్ర విద్యార్థులకు చుక్కానిలా ఉపయోగపడ్డాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశచరిత్ర ఆర్థిక, రాజకీయ కోణాలను విశ్లేషిస్తూ ఆయన చేసిన రచనలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకమని అభిప్రాయపడ్డారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top