దేశంలో హిందూ పాలన

దేశంలో హిందూ పాలన - Sakshi

  • 800 ఏళ్ల తర్వాత హిందువులమని గర్వించే వారు గద్దెనెక్కారు: సింఘాల్

  • న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయంతో బీజేపీ కేంద్రంలో గద్దెనెక్కడంతో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆనందడోలికల్లో మునిగి తేలుతోంది. దేశ రాజధాని ఢిల్లీని 800 ఏళ్ల తర్వాత హిందువులమని గర్వించే వారుపాలించేందుకు వచ్చారని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ వ్యాఖ్యానించారు. ఢిల్లీని చివరిసారిగా హిందూ రాజు పృథ్వీరాజ్ చవాన్ ఎనిమిది శతాబ్దాల కిందట పాలించారని గుర్తుచేశారు.



    శుక్రవారం ఢిల్లీలో మూడు రోజుల ప్రపంచ హిందూ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సింఘాల్ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీలు) జర్మన్ తొలగింపు వివాదాన్ని ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో సంస్కృతాన్ని తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. ‘సంస్కృతాన్ని తొలగించాలనుకోవడం దేశాన్ని తొలగించడం వంటిది’’ అని సింఘాల్ పేర్కొన్నారు.



    అనంతరం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్‌భాగవత్ మాట్లాడుతూ హిందువులంతా ఏకతాటిపైకి వచ్చి విలువలతో కూడిన నాయకత్వం గురించి ప్రపంచానికి చాటిచెప్పాలన్నారు.  బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా ప్రసంగిస్తూ బౌద్ధం, హిందూ మతాలను ఆధ్యాత్మిక సోదరులుగా అభివర్ణించారు. ప్రపంచానికి శాంతి సందేశాన్ని చాటడంలో ప్రాచీన హిందూవిలువలుకీలకపాత్ర పోషిస్తాయన్నారు.

     

    రాజ్యాంగ విరుద్ధం.. కాంగ్రెస్: సింఘాల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుబట్టింది. మతరాజకీయాలు రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొంది. దేశ ప్రధానులుగా సేవలు అందించిన పి.వి., వాజ్‌పేయి, దేవెగౌడలు హిందువులు కాదా? అని కాంగ్రెస్ ప్రతినిధి శక్తిసిన్హ్ ప్రశ్నించారు.

     

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top