సోరెన్‌కూ తప్పని అవమానం

సోరెన్‌కూ తప్పని అవమానం - Sakshi


మోడీ పర్యటన సభలో బీజేపీ కార్యకర్తల నిరసన

ప్రజాస్వామ్యంపై అత్యాచారమన్న సొరేన్

మా సీఎంలపై కుట్ర: కాంగ్రెస్




రాంచీ: మహారాష్ర్ట, హర్యానా ముఖ్యమంత్రులు పృథ్వీరాజ్ చవాన్, భూపిందర్‌సింగ్ హూడాల తరహాలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు కూడా మోడీ మద్దతుదారుల నుంచి అవమానం ఎదురైంది. రాంచీలో జరిగిన సభలో మోడీ సమక్షంలో సోరెన్ ప్రసంగించేందుకు మైకు వద్దకు రాగానే మోడీ మద్దతుదారులు అడ్డుతగిలారు.



మోడీ అనుకూల నినాదాలతో సభను హోరెత్తించారు. సంయమనం పాటించాలంటూ మోడీ సూచించినా సోరెన్ ప్రసంగం ముగిసే వరకూ నినాదాలు చేశారు. ప్రధాని హర్యానా, మహారాష్ట్ర పర్యటనల్లోనూ హూడా, చవాన్‌లకు ఇదే పరిస్థితి ఎదురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ప్రధాని సభకు చవాన్ గైర్హాజరయ్యారు.

 

ప్రజాస్వామ్యంపై అత్యాచారం: సోరెన్


రాంచీ సభలో మోడీ మద్దతుదారులు తన ప్రసంగానికి అడ్డుపడటంపై జార్ఖండ్ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేంఎంఎం) నేత హేమంత్ సోరెన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ చర్యను ప్రజాస్వామ్యంపై అత్యాచారంగా అభివర్ణించారు.  సీఎం హోదాలో ప్రసంగిస్తున్న తనను మోడీ మద్దతుదారులు గేలి చేస్తూ అవమానించడం ఎంతో బాధించిందన్నారు. కాగా, మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలని జేఎంఎం డిమాండ్ చేసింది.

 

సీఎంల గేలి వెనక కుట్ర: కాంగ్రెస్

ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులను మోడీ మద్దతుదారులు ఎగతాళి చేయడం వెనక మోడీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మద్దతుదారులను పురికొల్పడం ద్వారా సీఎంలను అవమానించే హక్కు ఎవరికీ లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అంబికా సోని పేర్కొన్నారు. మోడీ సభలకు 500 మంది కార్యకర్తలను పంపి ఎగతాళి చేయించడం తమకు పెద్ద కష్టమేమీ కాదని...కానీ ఆ చర్య ప్రధాని పదవికి ఉన్న గౌరవాన్ని దెబ్బతీస్తుందన్నారు.

 

రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం అగ్ర పథానికి

దేశాన్ని అభివృద్ధి బాటలో అగ్ర పథానికి తీసుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల సమతౌల్య అభివృద్ధి అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. అదే సమయంలో ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు సుస్థిర ప్రభుత్వాల ఏర్పాటు ఆవశ్యకత ఎంతో ఉందని తెలిపారు. గురువారం జార్ఖండ్‌లో పర్యటించిన మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.



రాంచీ-ధరమ్‌జేగఢ్-సిపాత్‌ల మధ్య రూ. 1,600 కోట్లతో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన 765 కేవీ అంతర్రాష్ట్ర విద్యుత్ ట్రాన్స్‌మిషన్ లైన్‌ను ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు. (తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య ఏర్పాటు చేసిన తొలి అంతర్రాష్ట్ర లింకు ఇదే. దీని ద్వారా తూర్పు ప్రాంతంలోని మిగులు విద్యుత్‌ను పశ్చిమ ప్రాంతం మీదుగా ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు బదిలీ చేసే వీలు కలుగుతుంది.) అలాగే దేవ్‌గఢ్ జిల్లాలోని జాసిదిహ్‌లో ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ. 109 కోట్లతో నిర్మించిన ఆయిల్ టర్మినల్‌ను ఆయన ప్రారంభించారు. ఉత్తర కరాన్‌పురాలోని ఛాత్రాలో ఎన్‌టీపీసీ థర్మల్ విద్యుత్ ప్లాంటు (ఒక్కోటీ 660 మెగావాట్ల సామర్థ్యంగల మూడు యూనిట్లు) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.



ఈ సందర్భంగా రాంచీలో ఏర్పాటు చేసిన సభలో మోడీ మాట్లాడుతూ అభివృద్ధిలో గుజరాత్‌ను ఎన్నో రెట్లు అధిగమించగల సామర్థ్యం జార్ఖండ్‌కు ఉన్నా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్ల వెనకబడిపోయిందని...ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి శంకుస్థాపన చేసిన ఉత్తర కరాన్‌పురా సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టును గత యూపీఏ ప్రభుత్వం పదేళ్లుగా పెండింగ్‌లో పెట్టి రాష్ర్ట ప్రజలకు అన్యాయం చేసిందని విమర్శించారు. తన ప్రభుత్వం ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్ ఢిల్లీకి రావాల్సిన అవసరం లేకుండానే జార్ఖండ్‌కు ఏటా రూ. 400 కోట్ల లబ్ధి చేకూర్చేలా ఖనిజ మైనింగ్‌పై రాయల్టీని పెంచిందన్నారు.

 

నిరంతర విద్యుత్‌కు ప్రాధాన్యం...

జార్ఖండ్ పర్యటన అనంతరం మహారాష్ట్రలో పర్యటించిన ప్రధాని మోడీ...నాగ్‌పూర్‌లోని మౌడాలో రూ. 5,459 కోట్ల వ్యయంతో నిర్మించిన వెయ్యి మెగావాట్ల ఎన్‌టీపీసీ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించారు. అలాగే నాగ్‌పూర్‌లో మెట్రో రైలు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ దేశంలోని అన్ని గ్రామాలకూ నిరంతర విద్యుత్‌ను అందించేందుకు తన ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అలాగే దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి మహమ్మారిని రూపుమాపుతానన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top