ఓటుకు కోట్లు కేసులో వాదనలు ఇలా...

ఓటుకు కోట్లు కేసులో వాదనలు ఇలా... - Sakshi


ఓటుకు కోట్లు కేసులో తనపై విచారణను రద్దు చేయాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను నాలుగు వారాల్లో ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తొలుత వాడివేడి వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సిద్దార్థ లూథ్రా, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది శేఖర్ నాప్‌డే వాదనలు వినిపించారు. ప్రాథమిక వాదనలు ముగియగానే స్టే అండ్ నోటీసు ఉత్తర్వులను ధర్మాసనం ఇచ్చింది. కేసు దర్యాప్తు జరగకుండా హైకోర్టు ఇచ్చిన స్టేపై తొలుత సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అయితే సుప్రీం స్టే ఉత్తర్వులు ఇవ్వగానే బాబు లాయర్ మళ్లీ వాదనలు వినిపించారు. ఏపీ సీఎంపై రాజకీయ ఉద్దేశాలతోనే కేసు పెట్టారని లూథ్రా చెప్పారు. ఒక ఎఫ్ఐఆర్‌లో దర్యాప్తు సాగుతుండగా మరో ఎఫ్ఐఆర్ ఎలా వేస్తారన్నారు. ఏసీబీ కోర్టు సెక్షన్ 156, 210 కింద ఆదేశాలచ్చిందని, ఆ కోర్టు ఆదేశాలపై తాము హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నామని అన్నారు.



ఆ సమయంలో లూథ్రాను సుప్రీం జడ్జి పలు ప్రశ్నలు అడిగారు. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసులో స్టే ఎలా ఇస్తారన్నారు. వేటి ఆధారంగా ఈ కేసులో హైకోర్టు స్టే ఇచ్చిందని ప్రశ్నించారు. దాంతో దర్యాప్తుపై హైకోర్టు 8 వారాల స్టే ఇచ్చిందని న్యాయవాది తెలిపారు. ఇప్పటికే మూడువారాలు పూర్తయిందని కూడా చెప్పారు. అందువల్ల హైకోర్టులోనే కేసు కొనసాగించమని చెప్పాలని ఆయన కోరగా.. ఆయన వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. నాలుగువారాల్లోగా ఈ కేసును పరిష్కరించాల్సిందిగా హైకోర్టును ఆదేశిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఆ సమయంలో ఏసీబీ, ఏపీ సీఎం అంటూ చంద్రబాబు న్యాయవాది మరోసారి వాదనలు వినిపించేందుకు ప్రయత్నించారు.



అంతలో ఎమ్మెల్యే ఆర్కే తరఫున సీనియర్ న్యాయవాది శేఖర్ నాప్‌డే వాదన ప్రారంభించారు. ఒక కేసు దర్యాప్తును ఆపమని చెప్పడం ఎంతవరకు సబబని, అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో స్టే ఇవ్వడానికి వీల్లేదని ఆయన అన్నారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు పాత్రపై పూర్తి ఆధారాలు ఇచ్చామని, చార్జిషీటులో్ చంద్రబాబు పాత్ర లేనందువల్లే మళ్లీ దర్యాప్తు కోరామని తెలిపారు. బాబు పాత్రను పరోక్షంగానే ప్రస్తావించారని, బాబు విషయంలో దర్యాప్తుపై మెతకగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజాజీవితంలో నైతికత, నిబద్ధత అత్యంత ఆవశ్యకమని చెప్పారు. హైకోర్టులో వాదనలు వినిపించడానికి తమకు అభ్యంతరం ఏమీ లేదంటూ.. దర్యాప్తును స్టేలతో అడ్డుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని తెలిపారు. నాలుగు వారాల్లోగా కేసును హైకోర్టు పరిష్కరించకపోతే ఎలాగని ప్రశ్నించారు. దాంతో.. హైకోర్టు పరిష్కరించకపోతే మళ్లీ సుప్రీంకోర్టుకు న్యాయమూర్తి రావాలని తెలిపారు. కచ్చితంగా నాలుగు వారాల్లోనే కేసును పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top