''కుటుంబానికి ఒకే కారుండాలి''..!

''కుటుంబానికి ఒకే కారుండాలి''..!


ముంబైః వాణిజ్య రాజధాని నగరం ముంబైలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు హైకోర్టు.. నూతన విధానం అమలుపై చర్చించింది. ఇందులో భాగంగా కుటుంబానికి ఒకే కారు ఉండాలన్న కొత్త విధానాన్ని రాష్ట్రంలో అమలు పరచాలంటూ మహరాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.



ముంబై నగరంలో ట్రాఫిక్ రద్దీని అధిగమించేందుకు ఓ సమగ్ర విధానాన్ని అమలు చేయాలని బాంబే హైకోర్టు మహరాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఇందులో భాగంగా కుటుంబంలో కార్ల శాతాన్ని పరిమితం చేసి, ఇన్ ల్యాండ్ వాటర్ ట్రాన్స్ పోర్ట్ పై దృష్టి పెట్టాలని తెలిపింది. జస్టిస్ వి ఎం కనాడే నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ట్రాఫిక్ సమస్యలపై సంపూర్ణ విధానం పైకి తెచ్చేందుకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు ట్రాఫిక్ పోలీసులు కూర్చుని చర్చించి ట్రాఫిక్ సమస్యపై సరికొత్త విధానాన్ని సూచించాలని కోరింది. నగరంలో పార్కింగ్ స్థలాల కొరతపై కోర్టులో దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కోర్టు విచారణ జరిపింది. ఈ రోజుల్లో ప్రతి కుటుంబానికి రెండు కార్లు ఉండటం కనిపిస్తోందని,  కుటుంబానికి ఒకే కారు ఉండేట్లు పరిమితం చేస్తే ముంబైలో తీవ్రమైన సమస్యగా మారిన అనధికార పార్కింగ్,  ట్రాఫిక్ రద్దీ సమస్యలను అధిగమించొచ్చని కోర్టు అభిప్రాయ పడింది. ముంబైలోకి ఉదయం ప్రవేశించి, సాయంత్రం విడిచి వెళ్ళే కార్లకు పార్కింగ్ పెద్ద సమస్యగా మారిందని, ఇకపై ప్రభుత్వం పట్టించుకోకుండా కూర్చుంటే సరిపోదని కోర్టు సూచించింది.



ఓ పదేళ్ళ క్రితం ముంబైలో దాదర్ నుంచి దక్షిణ ముంబై ప్రయాణానికి కేవలం 20 నిమిషాల సమయం పట్టేదని, ఇప్పుడు ఆ పరిస్థితిలో అనూహ్య మార్పు వచ్చిందన్న కోర్టు... జుహు నుంచి ఎయిర్ పోర్టు చేరాలంటే మూడు గంటల సమయం పడుతున్నట్లు తెలిపింది. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు నగరంలో నీటి రవాణా వ్యవస్థపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంలో న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ వ్యవస్థవల్ల మొత్తం సమస్యను తీర్చే అవకాశం లేనప్పటికీ.. ప్రత్యామ్నాయంగా మాత్రం వాటర్ ట్రాన్స్ పోర్ట్ ఉపయోగపడే అవకాశం ఉన్నట్లు బెంచ్ అభిప్రాయపడింది. నాలుగువారాల తర్వాత జరిగే తదుపరి విచారణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తమ సాధ్యాసాధ్యాలను తెలపాలని ముబై హై కోర్టు కోరింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top