సీఎం పదవికి పోటాపోటీ!

సీఎం పదవికి పోటాపోటీ! - Sakshi


* హర్యానాలో నేడు బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నిక

* ఎమ్మెల్యేల భేటీకి పరిశీలకుడు వెంకయ్యనాయుడు

* రేపే కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం


 

 చండీగఢ్: హర్యానాలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మెజారిటీ సాధించిన నేపథ్యంలో.. ముఖ్యమంత్రి పదవికి తీవ్ర పోటీ నెలకొంది. ఈ పదవికోసం పలువురు నేతలు ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో తీవ్రస్థాయిలో లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం చండీగఢ్‌లో నిర్వహించనున్న సమావేశంలో బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. సీఎంగా ఎవరిని ఎన్నుకున్నా.. వారు బుధవారమే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హర్యానాలో తొలి బీజేపీ ప్రభుత్వ  సీఎంగా ఎంపిక చేస్తారనేదానిపై బీజేపీ అధిష్టానం ఇంకా ఎలాంటి సంకేతాలూ ఇవ్వలేదు. పార్టీ తరఫున ఎన్నికైన 47 మంది ఎమ్మెల్యేలతో బుధవారం సమావేశం జరుగనుంది. దీనికి సంబంధించిన వివరాలను హర్యానా బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అనిల్ విజ్ వెల్లడించారు.

 

 పార్టీ పార్లమెంటరీ బోర్డు పరిశీలకులుగా నియమించిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, పార్టీ ఉపాధ్యక్షుడు దినేశ్ శర్మల ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో.. సీఎం ఎంపికపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను స్వీకరిస్తారని చెప్పారు. అంతేకాదు సీఎం పదవి ఆశావహులు కూడా తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలకుల దృష్టికి తీసుకెళ్లవచ్చని తెలిపారు. దీనిపై పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఎవరిని ఎంపిక చేసినా.. బుధవారం రోజున సీఎంతో పాటు కొందరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని అనిల్ విజ్ చెప్పారు. కాగా.. హర్యానాలో బీజేపీని గెలిపించిన ప్రజలకు వెంకయ్యనాయుడు కృతజ్ఞతలు చెప్పారు. సీఎం ఎంపిక ప్రక్రియకు పరిశీలకుడిగా ఉన్న తాను.. మంగళవారం చండీగఢ్ వెళ్లనున్నట్లు సోమవారం ఢిల్లీలో వెల్లడించారు. శాసనసభాపక్ష నేతను ఎన్నుకున్న అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను కోరుతామని చెప్పారు.

 

 పోటీ ఎక్కువే: సీఎం పదవికోసం ఆశావహులు మాత్రం పెద్ద సంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం రేసులో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన మనోహర్‌లాల్ ఖట్టార్ ముందంజలో ఉన్నారు. ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంవిలాస్‌శర్మ, అధికార ప్రతినిధి కెప్టెన్ అభిమన్యు తదితరుల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి.అయితే బీజేపీ అధిష్టానం మదిలో కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, కృషన్‌పాల్ గుజ్జార్, రావుఇందర్‌జిత్ సింగ్‌ల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top