'ఫ్లెక్సీ'తో పెళ్లాగిపోయింది!

'ఫ్లెక్సీ'తో పెళ్లాగిపోయింది!


తిరువణ్ణామలై: పెళ్లి కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఓ యువతి జీవితాన్ని కాపాడింది. తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి ఎయిడ్స్ ఉందని 'ఫ్లెక్సీ' ద్వారా యువతికి తెలియడంతో ఆమె ప్రమాదం నుంచి బయపడింది. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా చెంగం పట్టణంలో సోమవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పెళ్లి కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలోని వరుడి ఫొటో చూసిన ఓ వ్యక్తి ఆదివారం రాత్రి జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారి ఎస్ పళనికి ఫోన్ చేశాడు. పెళ్లికొడుక్కి ఎయిడ్స్ ఉందని తెలిపాడు.



'ఆదివారం రాత్రి 9.30 గంటలకు నాకు ఫోన్ వచ్చింది. వరుడు హెచ్ ఐవీ చికిత్స తీసుకుంటున్నాడని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు. ఇది వాస్తవమో, కాదో కనుక్కోవాలని ఎస్పీ, మెడికల్ జాయింట్ డైరెక్టర్ కు వెంటనే సూచించాను. వధువు కుటుంబం చిరునామా కనుక్కోమని రెవెన్యూ అధికారులకు పురమాయించాన'ని కలెక్టర్ తెలిపారు.



'2014, జూలై 30 నుంచి ప్రభుత్వాసుపత్రిలో వరుడు ఎయిడ్స్ నివారణకు చికిత్స తీసుకుంటున్నట్టు నిర్ధారించుకుని అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో అతడికి ఫోన్ చేశాం. తానే స్వయంగా వచ్చి కలుస్తానని చెప్పాడు. కానీ అతడు రాలేదు. దీంతో వధువు కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాం. తన పెళ్లి చెడగొట్టేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని పెళ్లికొడుకు వాళ్లకు ముందే చెప్పడంతో మా మాటలు నమ్మలేదు. దీంతో మేము హుటాహుటిన వివాహ వేదిక వద్దకు చేరుకున్నామ'ని చెంగం తహశీల్దార్ ఎం. కామరాజ్ వెల్లడించారు.



వైద్యాధికారి సెంథిల్ కుమార్, చెంగం డీఎస్పీ, తహశీల్దార్.. వధువుకు, ఆమె కుటుంబ సభ్యులకు పెళ్లికొడుకు గురించి చెప్పారు. అతడిని పెళ్లి చేసుకోకూడదని పెళ్లికూతురు నిర్ణయం తీసుకుంది. సకాలంలో స్పందించి తమ కూతురి జీవితాన్ని కాపాడినందుకు అధికారులకు వధువు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. రాత్రి అని కూడా చూడకుండా ఏడు గంటల పాటు తాము కష్టపడినందుకు ఫలితం దక్కిందని కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసుల భద్రత మధ్య వధువు కుటుంబ సభ్యులను సొంత గ్రామానికి తిరిగివచ్చారు. అదేరోజు తమ గ్రామానికి చెందిన మరో యువకుడిని వధువు పెళ్లాడడంతో ఈ ఉదంతం సుఖాంతమైంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top