తలాక్‌పై రాజకీయాలు చేయొద్దు

తలాక్‌పై రాజకీయాలు చేయొద్దు - Sakshi


ముస్లిం సమాజాన్ని జాగృతం చేయటం ద్వారానే మార్పు

► ఇస్లాంలోని మేధావులు ఈ దిశగా ప్రయత్నించాలి

► బసవ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ పిలుపు

► 700ఏళ్ల క్రితమే సామాజిక దురాచారాలపై బసవన్న పోరాడారని ప్రశంస




న్యూఢిల్లీ: ట్రిపుల్‌ తలాక్‌ అంశాన్ని రాజకీయ కోణంలో చూడటం మానేయాలని ముస్లింలను ప్రధాని నరేంద్రమోదీ కోరారు. ముస్లిం సమాజాన్ని జాగృతం చేయటం ద్వారానే ట్రిపుల్‌ తలాక్‌కు చరమగీతం పాడొచ్చని అభిప్రాయపడ్డారు. కన్నడ తత్వవేత్త బసవేశ్వర జయంతి సందర్భంగా శనివారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘బసవేశ్వరుడు 12వ శతాబ్దంలోనే సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడారు. ట్రిపుల్‌ తలాక్‌ కూడా అలాంటిదే.


ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని మిమ్మల్ని (ముస్లింలను) కోరుతున్నాను. దీనికో పరిష్కారం కోసం ఆలోచించండి. తరతరాలు మిమ్మల్ని గుర్తుంచుకునేలా ఈ పరిష్కారం చాలా గొప్పగా ఉండాలి’ అని కోరారు. సమాజంలో కాలదోషం పట్టిన విధానాలను నిర్మూలించి సరికొత్త నూతన వ్యవస్థను నెలకొల్పటం ద్వారానే ప్రభావవంతమైన వ్యక్తులు పుట్టుకొస్తారని ప్రధాని అన్నారు. భారతీయ ముస్లింలు కేవలం మన దేశానికే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఆధునిక మార్గాన్ని చూపించేందుకు ముందుండి నడవాలన్నారు. ‘ఈ దేశం మనకిచ్చే అద్భుతమైన శక్తి సామర్థ్యాలు అవే’ అని మోదీ అన్నారు.



ఆనాడే సమానత్వంపై..

బసవేశ్వరుడు మహిళా సాధికారత, సమానత్వం, సుపరిపాలన వంటి మహోన్నత ఆదర్శాలను పాటించారని ఈ సందర్భంగా మోదీ ప్రశంసించారు. ‘ముస్లిం సమాజం నుంచి కూడా మేధావులు, గొప్ప వ్యక్తులు బయటకొచ్చి ట్రిపుల్‌ తలాక్‌కు చరమగీతం పాడతారని నేను నమ్ముతున్నాను. ముస్లిం సోదరీమణులు, తల్లులకు ఈ కష్టం నుంచి విముక్తి కల్పిస్తారని భావిస్తున్నాను. మార్పు కోరుకునే ముస్లింలే ఈ బాధ్యతను తీసుకుంటారని ఆశిస్తున్నాను’ అని మోదీ తెలిపారు. బసవేశ్వరుడు చేసిన 2500 ధార్మిక ప్రవచనాలను ‘వచన్‌’ పేరుతో ముద్రించిన గ్రంథాన్ని ప్రధాని విడుదల చేశారు. ఈ వచన్‌ను 23 భాషల్లో తర్జుమా చేశారు.


2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బలమైన లింగాయత్‌ సామాజిక వర్గం ఐకాన్‌ అయిన బసవ జయంతి కార్యక్రమానికి మోదీ హాజరవటం ప్రాధాన్యత సంతరించుకుంది. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘సబ్‌ కా సాథ్, సబ్‌కా వికాస్‌’ నినాదం ద్వారా ఎవరిపైనా వివక్ష లేకుండా అందరినీ అభివృద్ధి చేస్తామని మోదీ పునరుద్ఘాటించారు.



చరిత్రను విస్మరిస్తున్న యువత: దాదాపు 40 నిమిషాలసేపు ప్రసంగించిన మోదీ.. నేటి యువత భక్తి ఉద్యమం నడిపిన గొప్ప వ్యక్తులను విస్మరిస్తోందన్నారు. ‘మన విద్యావ్యవస్థలోని లోపమో లేక మన వారసత్వాన్ని మరిచిపోయే స్వభావమో తెలియదు కానీ.. బసవన్న వంటి సంఘ సంస్కర్త 700 ఏళ్ల క్రితం చెప్పిన మహిళా సాధికారతకు మద్దతు పలికిన విషయాన్ని నేటి యువత తెలుసుకోలేకపోతోంది’ అని ప్రధాని తెలిపారు.


మన దేశం మహా పురుషులు, గొప్ప సంఘ సంస్కర్తలతోనే పరివర్తన చెందిందన్న విషయాన్ని మోదీ గుర్తుచేశారు. ‘మహామహులైన విదేశీయులను ఓడించిన దేశంగానే కాదని, సుపరిపాలన, అహింస, సత్యాగ్రహం వంటి గొప్ప సందేశాలను భారత్‌ ప్రపంచానికి ఇచ్చింది’ అని అన్నారు. 1964లో బసవ సమాజాన్ని స్థాపించిన మాజీ ఉపరాష్ట్రపతి బీడీ జట్టికి ఈ సందర్భంగా మోదీ నివాళులర్పించారు. హత్యకు గురైన  కన్నడ రచయిత, హేతువాది కల్బుర్గి కుటుంబ సభ్యులను కలిశారు.



మీరే రాజకీయం చేస్తున్నారు: విపక్షాలు

న్యూఢిల్లీ: ప్రధాని ట్రిపుల్‌ తలాక్‌పై చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. మోదీ, బీజేపీలే ఎన్నికల్లో లాభం కోసం ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ విమర్శించారు. ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై మోదీ మాట్లాడాలని ఎస్పీ నేత ఆజంఖాన్‌ అన్నారు. గోరక్ష దళాల దాడుల్లో భర్తలను కోల్పోతున్న ముస్లిం మహిళల ఆందోళనను పట్టించుకోవాలన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మాట్లాడకూడదని జేడీయూ నేత శరద్‌యాదవ్‌ అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top