హిజ్రాలకు రిజర్వేషన్లు ఇవ్వండి

హిజ్రాలకు రిజర్వేషన్లు ఇవ్వండి - Sakshi


కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు

‘మూడో లింగం’గా గుర్తిస్తూ నిర్ణయం

వారిని వెనుకబడిన వర్గంగా పరిగణించండి

విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించండి

సాధారణ జన స్రవంతిలో కలిసేందుకు చర్యలు చేపట్టండి

వారికోసం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టండి


 

 న్యూఢిల్లీ: జన్యు సంబంధ, ఇతర కారణాల వల్ల ఇటు పురుషులు, అటు స్త్రీలుగా గుర్తింపు పొందలేక సమస్యలు ఎదుర్కొంటున్న హిజ్రాలకు ఉపశమనం కలిగించేలా సుప్రీంకోర్టు సంచలనాత్మక ఆదేశాలు ఇచ్చింది. స్త్రీలు, పురుషులుగా గుర్తించే లింగ భేదం తరహాలో.. వారికి మూడో లింగంగా సుప్రీంకోర్టు చట్టపరమైన గుర్తింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారిని సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వర్గంగా పరిగణించి... వారు సాధారణ జన స్రవంతిలో కలిసేందుకు తోడ్పడే చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. అంతేకాకుండా.. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని.. వారు సాధారణ జనం నుంచి ఎదుర్కొనే ఛీత్కారాలు, అవమానాలు, భయం తదితర సమస్యల నుంచి బయటపడేందుకు తోడ్పడే చర్యలు చేపట్టాలని సూచించింది. హిజ్రాలు శస్త్రచికిత్సలు చేయించుకుని స్త్రీలు లేదా పురుషులుగా మారినప్పుడు... వారికి స్త్రీలు లేదా పురుషులుగా గుర్తింపుపొందే హక్కును కూడా కల్పిస్తున్నట్లు

సుప్రీం పేర్కొంది.



జన్యులోపాలు, శరీరంలో హార్మోన్ల అస్తవ్యస్తత, పలు ఇతర కారణాల మూలంగా స్త్రీ,పురుష లక్షణాలు రెండూ ఉండడం.. లేక ఏ లక్షణాలూ లేకపోవడం వంటి వాటితో ఎంతో మంది వ్యక్తులు బాధపడుతున్న విషయం తెలిసిందే. వారిని హిజ్రాలు, కోతి, అరవాని, జోగప్ప, శివపార్వతులు... ఇలా దేశవ్యాప్తంగా పలు చోట్ల పలు పేర్లతో పిలుస్తుంటారు. అయితే వీరికి మాత్రం సాధారణ ప్రజల నుంచి చీత్కారాలు, అవమానాలు ఎదురవుతున్నాయి. ఈ అంశంలో జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ ఏకే సిక్రిలతో కూడిన ధర్మాసనం దీనిపై మంగళవారం విచారణ జరిపింది. హిజ్రాలు కూడా దేశ పౌరులేనని, వారి హక్కులను కూడా కాపాడాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. వారికి సంబంధించి ఎలాంటి చట్టాలూ లేకపోవడం వల్ల వివక్షకు గురవుతున్నారని వ్యాఖ్యానించింది.

     

వారికి చట్టపరంగా గుర్తింపు లేకపోవడం వల్ల వేధింపులకు, లైంగిక దాడులకు గురవుతున్నారని.. పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారని పేర్కొంది.అందువల్ల హిజ్రాల హక్కుల పరిరక్షణ కోసం వారికి ‘మూడో లింగం (స్త్రీ, పురుషులు కాకుండా మూడోది)’ గా గుర్తింపు ఇస్తున్నామని తెలిపింది.దేశంలోని హిజ్రాలు, ట్రాన్స్ జెండర్లలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్ సంక్రమణ శాతం అత్యంత ఎక్కువగా ఉందని.. అందువల్ల వారికోసం ప్రత్యేకంగా హెచ్‌ఐవీ నివారణ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించింది.వీరికి సరైన వైద్య సహాయం అందించేందుకు ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేయాలని.. పబ్లిక్ టాయిలెట్లు, ఇతర సౌకర్యాలను వారికి ప్రత్యేకంగా కల్పించాలని ఆదేశించింది.

     

హిజ్రాల పరిస్థితిని అర్థం చేసుకునేవారు చాలా అరుదని, ఈ విషయంగా సమాజం వైఖరి మారాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది.పాకిస్థాన్, నేపాల్ తదతర దేశాలుకూడా హిజ్రాల హక్కుల పరిరక్షణకు చర్యలు చేపట్టాయని తెలిపింది. సుప్రీం ఆదేశాలు చరిత్రాత్మకమని, విప్లవాత్మకమని పలువురు మానవ హక్కుల సంఘాల నేతలు పేర్కొన్నారు. హిజ్రాలపై వివక్ష, అన్యాయానికి దీనితో తెరపడుతుం దని, వారికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుందని కేరళకు చెం దిన సీపీఎం నేత సెబాస్టియన్ పాల్ వ్యాఖ్యానించారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top