యాక్షన్ సినిమా లెవల్లో కాల్పులు

యాక్షన్ సినిమా లెవల్లో కాల్పులు - Sakshi


న్యూఢిల్లీ:  ఓ బాలుడిని కాపాడేందుకు పోలీసులకు, దుండగలకు మధ్య యాక్షన్ సినిమా లెవల్లో  పోరు నడిచింది.  యుద్ధ వాతావరణాన్ని తలపించేలా  స్కూలు ఆవరణ కాల్పులతో దద్దరిల్లిపోయింది.  హైడ్రామా  అనంతరం ఎట్టకేలకు  కిడ్నాపర్ల చెర నుండి  బాలుడిని కాపాడిన వైనం ఢిల్లీ శివారు ప్రాంతంలోని ఘజియాబాద్లోని ఓ  స్కూల్లో ఈ  పరిణామాలు చోటు చేసుకున్నాయి.   



వివరాల్లోకి వెళితే విలాసవంతమైన రాజ్ నగర్ ఏరియా నుంచి జై కరన్ అనే 13 ఏళ్ల బాలుడిని దుండగులు ఆదివారం కిడ్నాప్ చేశారు. ఒకరోజు తర్వాత...జై కరన్  తండ్రి, స్టాక్ ట్రేడర్  వివేక్ మహాజన్ కి బాలుని మొబైల్ నుంచే ఫోన్ చేశారు. అతడిని  విడిచిపెట్టాలంటే రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని  డిమాండ్ చేశారు.  అంతేకాకుండా పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించారు. అయినా బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  



ప్రాథమిక వివరాల సేకరణ అనంతరం  జై కరన్ మొబైల్ సిగ్నల్ ఆధారంగా  దుండగులు దాగి వున్న స్థలాన్ని గుర్తించిన పోలీసులు రంగంలోకి దిగారు. స్థానిక  రాయల్ కిడ్స్ ప్లే  స్కూల్లో పనిచేసే ఉద్యోగి ఇంట్లో పిల్లాడిని  దాచి పెట్టిన సంగతిని తెలుసుకుని ఇంటిపై దాడి చేశారు.  సుమారు 20 నిమిషాలపాటు పోలీసులు, దుండగుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పరస్పర భీకర కాల్పుల తరువాత చివరికి దుండగుల ఆట కట్టించారు. 10-12  రౌండ్ల కాల్పులు జరగగా, ఈ ఘటనలో  నిందితుడు దిలీప్ గాయపడ్డాడు. సందీప్ కుమార్, దీపక్ ,బిట్టు అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.



అనంతరం జై కరన్‌ కిడ్నాప్ ఉదంతాన్ని వివరిస్తూ.... 'నన్ను కారులో తీసుకెళ్లి,  ఒక ఇంట్లో దాచారు. తుపాకితో బెదిరించి, బాగా కొట్టారు. వాళ్ల అమ్మ నన్ను విడిచిపెట్టమని అంటే ఆమెను కూడా తిట్టారు. తుపాకి  గురిపెట్టి ఆమెను భయపెట్టారు. తరువాత ఏదో ఇంజక్షన్ ఇచ్చారని ఆ తరువాత  తనకేమీ తెలియదని' పోలీసులకు వివరించాడు.  తేలికగా డబ్బు సంపాదించడం కోసం నిందితులు ఈ చర్యకు పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. అటు ఈ వ్యవహారంలో స్కూలు యాజమాన్యాన్ని, ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు శని, ఆదివారాలు స్కూలుకు సెలవు కావడంతో బాలుడి కిడ్నాప్ విషయం తమ దృష్టికి రాలేదని స్కూలు యాజమాన్యం  చెబుతోంది. మరోవైపు తమ కుమారుడు క్షేమంగా తిరిగి రావటంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top