మాఫియా డాన్‌కు జైల్లో రాచమర్యాదలు

మాఫియా డాన్‌కు జైల్లో రాచమర్యాదలు


జైల్లో తనను చిత్రహింసలు పెడుతున్నారని, జీవితాన్ని దుర్భరంగా మార్చారని బయటకు చెబుతున్న అండర్ వరల్డ్ డాన్ అబూ సలేం.. నిజానికి జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నాడు. అక్కడ అతగాడికి సొంత పనిమనిషి ఉన్నాడు, తోటి ఖైదీలకు పార్టీలు ఇస్తుంటాడు. దాని కోసం ఒకోసారి ఇంటి నుంచి ఆహారం తెప్పిస్తే.. కొన్నిసార్లు కేఎఫ్‌సీ నుంచి చికెన్ కూడా స్మగుల్ చేయించుకుంటున్నాడు. ఈ విషయాలన్నింటినీ అబూసలేంను గతంలో చిత్రహింసలు పెట్టారన్న ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్న తలోజా జైలు సూపరింటెండెంట్ హరిలాల్ జాదవ్ వెల్లడించారు.



జాదవ్ తనను హింసించారంటూ టాడా కోర్టులో అబూసలేం 16 పేజీల అఫిడవిట్ దాఖలు చేశాడు. దాంతో జైళ్ల ఐజీ బిపిన్ కుమార్ సింగ్ ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు. అయితే, సలీం వ్యాఖ్యలను ఖండిస్తూ.. విచారణ కమిటీకి జాదవ్ 5 పేజీల సమాధానం ఇచ్చారు. అందులో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగుచూశాయి. హత్యానేరానికి జీవితఖైదు అనుభవిస్తున్న అబూసలేం సాగిస్తున్న అరాచకాల పుట్టను అందులో వివరించారు. రాజా ఉత్తలింగం నాడార్ అనే ఖైదీ ఇతడి కోసం దుస్తులు ఉతకడం, అన్నం వడ్డించడం, టీ చేయడం, అతడి సెల్ శుభ్రం చేయడం, గిన్నెలు కడగడం లాంటి పనులన్నీ చేస్తాడని జాదవ్ చెప్పారు. ఇవన్నీ కూడా నిజమేనని నాడార్ కూడా చెప్పాడు.



2010 జూలై వరకు ఆర్థర్ రోడ్డు జైల్లో ఉన్న అబూ సలేంపై.. అప్పట్లో దావూద్ ఇబ్రహీం అనుచరుడైన ముస్తఫా దోసా అనే ఖైదీ దాడి చేశాడు. దాంతో సలేంను తలోజా జైలుకు తరలించారు. అప్పటినుంచి సలేంకు 25 మంది పోలీసులతో భద్రత కల్పించాలని కోర్టు సూచించినా.. సిబ్బంది కొరత కారణంగా జైలు అధికారులు ఆ స్థాయి భద్రత కల్పించలేకపోయారు. దానికి బదులుగా అతడి సెల్‌లో సీసీటీవీ కెమెరా ఏర్పాటుచేసి, ఇద్దరు పోలీసులను కాపలా పెట్టారు. అయితే, ఇది తన భద్రత కోసం కాదని.. తన మీద నిఘా కోసమే పెట్టారంటూ అబూసలేం ఆరోపించాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top