రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల


న్యూఢిల్లీ:  13వ ఆర్ధిక సంఘం సిఫార్సు మేరకు రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేసింది.   ఆంధ్రప్రదేశ్‌కు 385 కోట్ల రూపాయలు, తెలంగాణకు 150 కోట్ల రూపాయలు  విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి గణాంకాల వ్యవస్థ అమలుకు రెండు కోట్ల 60 లక్షల రూపాయలు,  పంచాయతీరాజ్ సంస్థలు/ అర్బన్ లోకల్‌బాడీ/ ప్రత్యేక ప్రాంతాలకు 298 కోట్ల 82 లక్షలు, ఎ.సి.ఎ (ఇతర ప్రాజెక్టులకు) 49 కోట్ల 99 లక్షలు, కొత్త రాష్ట్ర ప్రత్యేక పరిస్థితుల దష్ట్యా 33 కోట్ల 50 లక్షల రూపాయలు విడుదల చేసింది. 


తెలంగాణకు పంచాయతీరాజ్ సంస్థలు/అర్బన్ లోకల్‌బాడీ/ప్రత్యేక ప్రాంతాలకు 73కోట్ల పది లక్షల రూపాయలు, పీఆర్‌ఐ/యూఎల్‌బీ/ ప్రత్యేక ప్రాంతాలకు గ్రాంటు కింద 76కోట్ల 77 లక్షల రూపాయలు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ ఆదివారం వెల్లడించింది.


 రూ.1,410 కోట్లు రానట్లే



 సాక్షి, హైదరాబాద్: పదమూడో ఆర్థిక సంఘం గడువు మార్చి 31తో ముగియనుండటంతో రాష్ట్రానికి రావాల్సిన రూ. 1,410 కోట్ల నిధులకు గండి పడనుంది. ఏప్రిల్ 1 నుంచి 14వ ఆర్థిక సంఘం కేటాయింపులు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో రూ. 1,560 కోట్ల నిధులకు గాను రూ. 150 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 13వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన మిగతా బకాయిలపై ఆశలు ఆవిరయ్యాయి. తమకు రావాల్సిన నిధులు విడుదల చేయాలని గత నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం లేఖల ద్వారా విజప్తి చేసింది.


ఇప్పటి వరకు దాదాపు 40 లేఖలు రాసింది. ఎట్టకేలకు స్పందించిన కేంద్రం సగం బకాయిలు రూ.1,579 కోట్లకు మంజూరీ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31 లోగా మిగతా బకాయిలు తెచ్చుకోకపోతే వచ్చే అవకాశం లేకపోవటం... ఆర్థిక సంఘ కాల పరిమితి ముగియనుండటంతో ప్రభుత్వం పట్టు వీడకుండా మరో ప్రయత్నం చేసింది.మిగతా రూ.1,560 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని వారం రోజుల కిందట మరోమారు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తాజాగా రూ.150 కోట్లు విడుదల చేసి కేంద్రం చేతులు దులుపుకుందని, మిగతా నిధులు వచ్చే అవకాశం లేదని ఆర్థిక శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top