మీది ‘బెహన్ జీ సంపత్తి పార్టీ’

మీది ‘బెహన్ జీ సంపత్తి పార్టీ’ - Sakshi


బీఎస్పీపై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు

జలౌన్ : యూపీ ఎన్నికల ప్రచారంలో బీఎస్పీ, ఆ పార్టీ అధినేత్రి మాయావతిపై ప్రధాని మోదీ తీవ్రమైన విమర్శలు చేశారు.  జలౌన్ లో నిర్వహించిన సభలో మోదీ మాట్లాడుతూ.. ‘నోట్లరద్దును వ్యతిరేకించిన బీఎస్పీ ఇక బహుజన్ సమాజ్‌ పార్టీ కాదు. ‘బెహన్ జీ (మాయావతి) సంపత్తి పార్టీ’గా మారింది’ అని విమర్శించారు. ‘నోట్లరద్దు నిర్ణయాన్ని ప్రకటిస్తే.. బద్ధశత్రువులైన బీఎస్పీ, ఎస్పీలు నన్ను వ్యతిరేకించేందుకు ఒక్కటయ్యారు. నేను అవినీతి, నల్లధనంపై పోరాటం చేస్తే.. ఈ రెండు పార్టీలు ఇబ్బందులు పడటంతో ఆశ్చర్యపోయా’ అని అన్నారు.


నోట్లరద్దుపై ప్రభుత్వానికి సన్నద్ధత లేదని మాయావతి విమర్శిస్తున్నార్న మోదీ.. నిర్ణయం తర్వాత ఒక వారం సమయం ఇచ్చి ఉండాల్సిందని మాయావతి, ములాయం అడిగారన్నారు. మాయావతి సోదరుడి అకౌంట్లో రూ.100కోట్లు డిపాజిట్‌ చేసిన విషయాన్ని ప్రధాని గుర్తు చేస్తూ.. ‘బెహన్ జీ.. మీది ఇకపై బహుజన్  సమాజ్‌ పార్టీ కాదు. బహుజనులు ఎప్పుడో మీ తీరుతో దూరమవుతున్నారు. ’ అని మోదీ విమర్శించారు.



యూపీ నిధి బుందేల్‌ఖండ్‌!: తీవ్రమైన నీటికొరత, అరకొర సౌకర్యాలతో బుందేల్‌ఖండ్‌ ప్రాంతం తీవ్ర వెనుకబాటుకు గురవటానికి ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ పార్టీలే కారణమన్నారు. ‘ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఏళ్లకేళ్లుగా బుందేల్‌ఖండ్‌ను విస్మరిస్తున్నాయి. ఈ ఎన్నికలు ఈ ప్రాంతానికి చాలా కీలకం. మాకు అవకాశమివ్వండి. ఐదేళ్లలో బుందేల్‌ఖండ్‌ను కచ్‌ (గుజరాత్‌)లా మార్చేస్తాం. ఇక్కడి ఖనిజ సంపదతో రాష్ట్రపరిస్థితే మారిపోతుంది’ అని అన్నారు.


రాష్ట్రంలో పదేళ్లుగా శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందని.. అంగబలం ఉన్నోళ్లంతా పేదలు, అమాయకుల నుంచి భూములు లాక్కున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఆ భూమి తిరిగి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. తొలి మూడు దశల ఎన్నికల అంచనాల ప్రకారం బీజేపీ అధికారంలోకి వస్తుందని స్పష్టమైందని ప్రధాని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ–అప్నాదళ్‌ కూటమి అధికారంలోకి వస్తుందని మోదీ అహ్మదాబాద్‌ సమీపంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆశాభావం వ్యక్తం చేశారు. సర్దార్‌ పటేల్‌ ప్రథమ ప్రధాని అయ్యుంటే దేశం పరిస్థితి మరోలా ఉండేదన్నారు.



మార్చి 11 తర్వాత యూపీకి అచ్ఛేదిన్

కాగా, యూపీకి మార్చి 11 తర్వాత అచ్ఛేదిన్ వస్తాయని బస్తీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. అధికారంలోకి రాగానే అన్ని పశువధ శాలలు నిషేధిస్తామని, భూములు బలవంతంగా లాక్కుంటున్న వారి ఆట కట్టిస్తామని ఆయన తెలిపారు. ఎస్పీ ప్రభుత్వంలా తమకు పక్షపాతం ఉండదని.. అందరు విద్యార్థులకు కుల, మతాలకు అతీతంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తామన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top