బేరసారాల కోసం కొత్త ఆట

బేరసారాల కోసం కొత్త ఆట - Sakshi


ఓటమి తప్పదని ఎస్‌పీ, బీఎస్‌పీకి అర్థమైంది

►  అందుకే హంగ్‌ రావాలని కోరుకుంటున్నాయి

►  హంగ్‌ వస్తే అధికారం కోసం బేరసారాలు ఆడాలనేది వారి ఆలోచన

►  ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ




మావు(యూపీ): ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ముందుగానే ఊహించిన ఎస్‌పీ, బీఎస్‌పీ కొత్త ఆటకు తెర తీశాయని, యూపీలో హంగ్‌ రావాలని కోరుకుంటున్నాయని, తద్వారా అధికారంకోసం బేరసారాలు ఆడొచ్చనేది వారి ఆలోచన అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు. ‘‘యూపీలో మూడో దశ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాత ఎస్‌పీ, బీఎస్‌పీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశాలు లేవని అర్థమైపోయింది. దీంతో వారు కొత్త ఆట, సరికొత్త ఎత్తుగడను ప్రారంభించారు. ఒకవేళ తాము ఓడిపోయినా.. లేదా సీట్ల సంఖ్య తగ్గినా.. ఎవరికీ మెజారిటీ రాకూడదని కోరుకుంటున్నాయి’’ అని చెప్పారు.


సోమవారం యూపీలోని మావు పట్టణంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సదర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ఎస్‌పీ, బీఎస్‌పీ నాయకులకు నేను చెప్పేదొకటే. బీజేపీని ఓడించడానికి మీరు ఏమైనా చెయ్యండి. దానితో ఎటువంటి సమస్యా లేదు. కానీ యూపీ భవిష్యత్తుతో మాత్రం ఆటలాడొద్దు. యూపీ ఇప్పటికే చాలా కష్టాలను ఎదుర్కొంది. హంగ్‌ అసెంబ్లీ వస్తే బేరసారాలు ఆడేందుకు అవకాశం వస్తుందని మీరు ఆలోచిస్తున్నారేమో.. కానీ యూపీ ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ ఇచ్చిన విషయాన్ని మరిచిపోవద్దు. ఈ ఎన్నికల్లో కూడా యూపీ ప్రజలు బీజేపీకి ఘన విజయాన్ని కట్టబెడతారు’’ అని చెప్పారు.


ఎన్నికల ప్రకటన వెలువడగానే ఎస్‌పీ అధికారం పోతుందనే ఆందోళనతో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకుందని, అయితే కాంగ్రెస్‌ మునిగిపోయే పడవ అని, దానితో పాటు ఎస్‌పీ కూడా మునిగిపోతుం దని, కాంగ్రెస్, ఎస్‌పీ కలసి మీడియా కవరేజీతో ప్రజలను ఏమార్చాలనుకుంటే కుదరదని చెప్పారు. ప్రజలకు పాలను.. నీటినీ ఎలా వేరు చేయాలో తెలుసన్నారు. ఎన్నికలు ప్రారంభమైన తర్వాత తమకు మూడింట రెండొంతుల మెజారిటీ వస్తుందని కాంగ్రెస్‌–ఎస్‌పీ నేతలు చెప్పారని, కానీ మూడో దశ పూర్తయ్యేసరికి వారికి వాస్తవం అర్థమైందని, మెజారిటీ మాట పక్కన పెట్టి తమకు మరో అవకాశం ఇస్తే.. తప్పులను సరిచేసుకుంటామని చెపుతున్నారని ఎద్దేవా చేశారు.


ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమకు పూర్తి మెజారిటీ వచ్చినా సరే మిత్రపక్షాలను కలుపుకునే యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 30 ఏళ్ల తర్వాత పూర్తి మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం వల్లే ప్రపంచం మొత్తం భారతదేశాన్ని కీర్తిస్తోందని, ఇదే విధంగా యూపీలోనూ బీజేపీకి పూర్తి మెజారిటీ ఇస్తే దేశం మొత్తం యూపీని కీర్తించేలా చేస్తామని హామీ ఇచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top