ఆ జంట ఎంతో ఆశగా ఇండియాకొస్తే..

ఆ జంట ఎంతో ఆశగా ఇండియాకొస్తే.. - Sakshi

న్యూఢిల్లీ: ఎన్నో ఆశలతో భారత్‌కు వచ్చిన ఓ విదేశీ జంటను కొందరు దారుణంగా దోచుకున్న ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఎర్రకోట, తాజ్మహల్ చూడాలని ఎన్నో అంచనాలతో ఇక్కడికి చేరుకున్న వారిని మొదట విమానాశ్రయంలో కలిసిన ఓ టాక్సీ డ్రైవర్ దారుణంగా మోసం చేశాడు. అనంతరం వారిని ఓ ట్రావెల్ ఏజెన్సీకి అప్పగించిన ఘటనను చూస్తే, ఇలా కూడా మోసం చేస్తారా! అని అనిపించకమానదు.

 

జర్మనీకి చెందిన నైనా ఫరినా, తన స్పానిష్ మిత్రుడు అలెక్స్తో కలిసి ఇటీవల భారత్ను సందర్శించడానికి వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే వారు ముందుగానే బుక్ చేసుకున్న హోటల్కు టాక్సీలో బయలుదేరారు. అయితే, టాక్సీ డ్రైవర్ ఢిల్లీలో ఇప్పుడు పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, నగరం మొత్తం కర్ఫ్యూ విధించారని వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. అలా వారిని నగరశివార్లలో తిప్పుతూ వారి దగ్గర వేల రూపాయలు గుంజాడు. అనంతరం ఇప్పుడు వారు సందర్శించడానికి ఢిల్లీ అనుకూలం కాదని.. జైపూర్, వారణాసి ప్రాంతాలకు వెళ్తే మంచిదని సలహా ఇస్తూ వారిని ఓ ట్రావెల్ ఏజెన్సీకి అప్పగించాడు. 

 

ట్రావెల్ ఏజెన్సీ వారు జైపూర్, వారణాసి ప్రాంతాలకు వెళ్లడానికి భారీ మొత్తం అవుతుందని, వారు చెల్లించే దానిలో సగానికి పైగా ప్రభుత్వానికే పన్నుగా వెళ్తుందని చెప్పుకొచ్చారు. దీంతో వారు భారీ మొత్తంలో డబ్బును ఆ ట్రావెల్ ఏజెన్సీకి చెల్లించారు. అనంతరం వారు బుక్ చేసిన హోటల్ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి.. ఢిల్లీలో అసలు కర్ఫ్యూనే లేదనే విషయాన్ని చెప్పడంతో వారికి దారుణంగా మోసపోయామనే విషయం తెలిసింది. దీంతో ఆ జంట ఢిల్లీ పోలీసులను ఆశ్రయించగా వారు తమ స్టేషన్ పరిధిలోకి రాదంటూ.. ఆ జంటను పలు పోలీస్ష్టేషన్‌ల చుట్టు తిరిగేలా చేశారు.

 

తనకు ఎదురైన అనుభవాలను నైనా ఫరినా మీడియాతో వెల్లడించింది. ఢిల్లీలో ఈ తరహా మోసాలు ఇదే తొలిసారి కాదని తెలుస్తోంది. కొత్తగా ఇక్కడికి వచ్చే విదేశీయులను టార్గెట్ చేసి దోచుకునే ముఠాలు అక్కడ చాలానే ఉన్నాయని సమాచారం. వీరి దెబ్బకు భారత్ను సందర్శించాలని ఎన్నో ఆశలతో ఇక్కడికి వస్తున్న యాత్రికులు 'అమ్మో ఇండియానా' అనే పరిస్థితి ఏర్పడుతోంది.

 
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top