పోర్టులతో తెలంగాణను అనుసంధానించండి

ఢిల్లీలో గడ్కరీకి వినతి పత్రం అందజేస్తున్నదత్తాత్రేయ - Sakshi


ఈస్ట్-వెస్ట్ సీ పోర్టు కారిడార్ ఏర్పాటు చేయండి

దత్తాత్రేయ నేతృత్వంలో కేంద్రమంత్రి గడ్కరీని కోరిన బీజేపీ నేతలు




 సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణను నౌకాశ్రయాలతో అనుసంధానం చేసేందుకు ‘ఈస్ట్-వెస్ట్ సీ పోర్టు కారిడార్’ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ.. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. గురువారం దత్తాత్రేయ నేతృత్వంలో తెలంగాణ బీజేపీ నేతల బృందం గడ్కరీని కలిసింది. ఈ బృందంలో కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ సలహాదారు శ్రీరాం వెదిరె, రఘునందన్‌రావు తదితరులున్నారు. తెలంగాణలో మరిన్ని జాతీయ రహదారుల ఏర్పాటు ఆవశ్యకత గురించి వీరు గడ్కరీకి వివరించారు. ముంబై-గోపాల్‌పూర్ పోర్టు మధ్య ఎన్‌హెచ్-222, ఎన్‌హెచ్-16, ఎన్‌హెచ్-43, ఎన్‌హెచ్-326, ఎన్‌హెచ్-17 ఉన్నాయి. ఒడిశాలోని బరంపూర్ నుంచి దిగపహండి మధ్య, మరికొన్ని చోట్ల జాతీయ రహదారి లేదు.

 

  అందువల్ల ఈ మొత్తం కారిడార్‌ను ఈస్ట్-వెస్ట్ సీపోర్టు కారిడార్‌గా ప్రకటించి రహదారులను అభివృద్ధి పరచాలని బీజేపీ నేతల బృందం కోరింది. భేటీ అనంతరం దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడారు. ‘‘ముంబై నుంచి ఒడిశాలో ఉన్న గోపాల్‌పూర్ పోర్టుకు నాలుగు లేన్లు లేదా ఆరు లేన్ల రహదారిని ఏర్పాటు చేయాలని కోరాం. దీంతో తెలంగాణ నుంచి సీపోర్టుకు అనుసంధానం ఏర్పడే అవకాశం ఉంది. దీనిపై గడ్కరీ తన శాఖ అధికారులను పిలిచి రహదారి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు’’ అని వివరించారు. సంగారెడ్డి-మెదక్-ముంబై నేషనల్ హైవే, శ్రీశైలం హైవేను, సూర్యాపేట-సిద్దిపేట, హన్మకొండ-అశ్వారావుపేట రహదారులను 4 లేన్ల రహదారులుగా విస్తరించాలని కోరినట్లు వివరించారు.

 

 బీసీ డిమాండ్లను మోదీకి నివేదిస్తా: దత్తాత్రేయ

 బీసీ డిమాండ్లను ప్రధాని మోదీకి నివేదిస్తానని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. కేంద్ర కేబినెట్‌లోనూ ఈ డిమాండ్లను చర్చకు పెడతానని భరోసా ఇచ్చారు. బీసీల బిల్లును పార్లమెంటులో పెట్టాలని ప్రధాని మోదీని కలసి విన్నవిస్తానన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్విన్ రాజు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంఘాల నేతల ప్రతి నిధి బృందం ఢిల్లీలోని శ్రమశక్తిభవన్‌లో గురువారం మంత్రిని కలసి బీసీల 15 డిమాండ్లపై వినతి పత్రాన్ని అందజేసింది. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాల అనంతరం కేంద్ర సామాజిక, న్యాయ మంత్రిత్వశాఖ, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్, ఉన్నతస్థాయి అధికారులతో అధికారిక సమావేశాన్ని ఏర్పాటు చేసి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కాగా తమ డిమాండ్లపై ప్రధానిని శుక్రవారం కలవనున్నట్టు ఆర్.కృష్ణయ్య చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top