మేక్ ఇన్ ఇండియా వీక్‌లో భారీ అగ్నిప్రమాదం

మేక్ ఇన్ ఇండియా వీక్‌లో భారీ అగ్నిప్రమాదం - Sakshi


- సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండగా వేదికకు మంటలు

సురక్షితంగా బయటపడిన వీఐపీలు, సినీతారలు, ప్రజలు

షార్ట్‌సర్క్యూటే ప్రమాదానికి కారణమని ప్రాథమిక  నిర్ధారణ


 

ముంబై: ముంబైలో నిర్వహిస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’ సాంస్కృతిక కార్యక్రమంలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. గిర్గాం చౌపాటి బీచ్‌లో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రదర్శన పూర్తయిన కొద్దిసేపటికి మహారాష్ట్ర లావణీ జానపద నృత్యం జరుగుతుండగా వేదిక కింద మంటలు రేగాయి. రాత్రి 8.15 గంటల ప్రాంతంలో వేదిక అంటుకోగా... గాలి తీవ్రత వల్ల అవి వేగంగా వ్యాపించడంతో పూర్తిగా ఆహుతైంది.

 

 సంఘటన స్థలానికి  అగ్నిమాపక శకటాలు చేరుకునేసరికి బుగ్గైంది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని బృహన్ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) విపత్తు నిరోధక అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, గవర్నర్ విద్యాసాగర్ రావు, శివసేన చీఫ్ ఉద్ధవ్‌ఠాక్రే, అమితాబ్ బచ్చన్, ఆమిర్‌ఖాన్, హేమమాలిని, కత్రినా కైఫ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. కార్యక్రమానికి హాజరైన దాదాపు 50 వేల మంది ప్రజలు క్షేమంగా బయటపడ్డారు. తప్పించుకునేందుకు సరైన మార్గాలు ఉండడంతో ఎలాంటి తొక్కిసలాట చోటుచేసుకోలేదు.

 

  ‘ మరో గంటలో నా ప్రదర్శన ఉంది. నేను మేకప్ వ్యాన్‌లో ఉండగా... నా సిబ్బంది అగ్నిప్రమాదం విషయాన్ని చెప్పారు. వెళ్లిచూడగా స్టేజంతా మంటల్లో చిక్కుకుంది’ అని ఆమిర్ ఖాన్ తన ప్రత్యక్ష అనుభవాన్ని వెల్లడించారు. ప్రమాద సమయంలో పెద్ద సంఖ్యలో వ్యాపార ప్రతినిధులు, పెట్టుబడిదారులు అక్కడే ఉన్నారు.  బాణ సంచా వల్ల ప్రమాదం జరిగిందని భావించినా, స్టేజ్ కింద షార్ట్ సర్క్యూట్ వల్లే సంభవించిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 16 అగ్నిమాపక శకటాలు, ఆరు వాటర్ ట్యాంకర్లు శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చాయి.

 

 ప్రమాదంపై మహారాష్ట్ర సీఎం విచారణకు ఆదేశించారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమని, దీనివల్ల మేక్ ఇన్ ఇండియా పోగ్రాంకు ఎలాంటి ఇబ్బంది కలగదని చెప్పారు. శనివారం ప్రధాని నరేంద్రమోదీ ‘మేక్ ఇన్ ఇండియా వీక్’ కార్యక్రమాన్ని ముంబైలో ప్రారంభించిన విషయం తెలిసిందే. వందల కోట్ల డాలర్ల పెట్టుబడులు ఆకర్షించే క్రమంలో ఈ కార్యక్రమం చేపట్టారు. దాదాపు 2,500 అంతర్జాతీయ, 8 వేల దేశీయ కంపెనీలు వారం పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొంటున్నాయి.







Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top