తమిళ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. మంత్రి రాజీనామా?

తమిళ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. మంత్రి రాజీనామా?


అన్నాడీఎంకే రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఒకవైపు విలీనం గురించి రెండు వర్గాల మధ్య చర్చలు సోమవారం మొదలవుతుంటే.. మరోవైపు ఆర్థికమంత్రి డి.జయకుమార్ తాను రాజీనామా చేస్తానంటూ ముందుకొచ్చారు. అయితే, పన్నీర్ సెల్వం వర్గానికి మంత్రి పదవులు ఇవ్వాలంటే ఇప్పుడున్న మంత్రుల్లో కొంతమంది త్యాగాలు చేయక తప్పదని, ముందుగా తానే త్యాగం చేస్తానని ఆయన చెప్పడం గమనార్హం. పార్టీ సంక్షేమం కోసం తన పదవి పోయినా పర్వాలేదని ఆయన విలేకరులతో చెప్పారు. అయితే, అదే మంత్రివర్గంలోని మరో మంత్రి దిండిగల్ సి శ్రీనివాసన్ మాత్రం మరోరకంగా స్పందించారు. మెజారీటీ ఉన్న ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం పూర్తి కాలం పాటు కొనసాగుతుందని ఆయన అన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే పన్నీర్ సెల్వానికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అంత సులభం కాదని తెలుస్తోంది. పన్నీర్ వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ గురించి ఆర్థిక మంత్రి జయకుమార్‌ను ప్రశ్నించగా.. ఆయన నేరుగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. అయితే ఓపీఎస్ వర్గం డిమాండ్లు వినేందుకు సుముఖంగా ఉన్నామని మాత్రం చెప్పారు.



వాళ్ల డిమాండ్లు ఏంటో బయటపెట్టాలని, రెండు వైపుల నుంచి కూడా డిమాండ్లు ఉండటం సహజమేనని, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని జయకుమార్ అన్నారు. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, వాళ్లు పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి చర్చలు మొదలుపెడితే అప్పుడు అన్ని విషయాలూ అర్థం అవుతాయని చెప్పారు. పళనిసామి వర్గం ఓ రాజీ ఫార్ములాతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాని ప్రకారం ముఖ్యమంత్రి పదవితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కూడా పళనిసామి వర్గానికే ఇవ్వాలని, పన్నీర్ సెల్వానికి ఉపముఖ్యమంత్రి పదవి, పార్టీ కోశాధికారి పదవి ఇస్తామని వాళ్లు ఆఫర్ చేస్తున్నారని సమాచారం. వైద్యలింగాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేసి, పళనిసామిని ముఖ్యమంత్రిగా కొనసాగించాలని అన్నాడీఎంకే ఎంపీ ఒకరు అన్నారు. మరోవైపు.. పార్టీకి ఇద్దరు ప్రధాన కార్యదర్శులను నియమించాలని, వాటిలో రెండు వర్గాలు తలొకటి తీసుకోవచ్చని కూడా పళనిసామి వర్గం చెబుతోంది.  



ఏది ఏమైనా సాయంత్రానికి మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. దాదాపు రెండు నెలల తర్వాత పార్టీ కార్యాలయంలో చర్చలు మొదలవుతున్నాయి. రెండు వర్గాలు ఎవరికి వారే డిమాండ్లు తీసుకొచ్చారు. ఒకరికి ప్రభుత్వాన్ని, మరొకరికి పార్టీని అప్పగించాలని మధ్యేమార్గంగా సూచిస్తున్నారు. కొంతమంది మంత్రులపై వేటు వేయాలని కూడా అంటున్నారు. రెండు వర్గాల వెనక బీజేపీ ఉందని కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఎటు తిరుగుతాయో ప్రశ్నార్థకంగా ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top