1000 కిలోలు అమ్మితే రూపాయి మిగిలింది!

1000 కిలోలు అమ్మితే రూపాయి మిగిలింది! - Sakshi


పుణే: పండిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకుంటన్న రైతుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ప్రస్తుతం దేశంలో ఉల్లి రైతుల పరిస్థితి అలాగే ఉంది. మహారాష్ట్ర రైతులకు ఉల్లి కన్నీరు పెట్టిస్తోంది. ఆరుగాలం కష్టించి, అమ్మకానికి తెచ్చేసరికి ధరాఘాతం ఆవహించడం రైతన్నను షాక్ కు గురిచేస్తోంది. టన్నులకొద్దీ ఉల్లిపాయలు అమ్మినా.. సాగు, ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు కూడా చేతికి రాకపోవడం వారిని తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే టన్ను(1000 కిలోలు) ఉల్లి అమ్మితే తనకు వచ్చిన ఆదాయం కేవలం ఒక్క రూపాయి అని రైతు చెబుతున్నాడు. రైతు దేవిదాస్ పర్భానే తనకున్న రెండెకరాలలో ఉల్లిని సాగుచేశాడు. నాసిక్ కు చెందిన కొందరు వర్తకులు, ఏపీఎంసీ సభ్యులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్ ను కలిసి గిట్టుబాటు ధర కల్పించి రైతులను, మార్కెట్లను ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు.



జిల్లా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కు తన పంటను తీసుకొచ్చాడు. 80 వేల రూపాయలు ఖర్చుపెట్టి రెండకరాల్లో చేసిన సాగును అమ్మకానికి పెట్టగా వచ్చిన ధరకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నాడు. టన్ను ఉల్లిపాయలు విక్రయించగా కేవలం 1523 రూపాయలే వచ్చాయని, ఇందులో లేబర్ చార్జీలు, ట్రక్ డ్రైవర్ కు రూ.1320, ఇతర ఖర్చులు అన్ని తీసివేయగా తనకు మిగిలింది కేవలం ఒక్క రూపాయి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.  అతిపెద్ద ఉల్లిపాయల హోల్ సేల్ మార్కెట్లలో ఒకటైన మారాఠ్వాడా లోని లాసూర్  మార్కెట్లో మంచి నాణ్యత కలిగిన ఉల్లిపాయలు తీవ్ర ధరాఘాతానికి గురై.. వేలంలో 100 కేజీలకు 500 నుంచి 600 రూపాయలు ధర రావడం, చివరగా కేజీకి 50 పైసలు మాత్రమే వచ్చిందని రైతులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top