లేచి నిలబడితేనే గౌరవమా?

లేచి నిలబడితేనే గౌరవమా?


న్యూఢిల్లీ: భరత భూమిలో దేశభక్తి రసం ఉప్పొంగి పొరలుతోందనడానికి ముంబైలోని ఓ పీవీఆర్ మల్టీప్లెక్స్‌లో ‘తమాషా’ హిందీ చిత్రం ప్రదర్శన సందర్భంగా జరిగిన ఓ ఉదంతమే తార్కాణం. రవీంద్రనాథ్ టాగూర్ రాసిన జాతీయ గీతం ‘జన గణ మన అధినాయక జయహే’ అన్న పాట వస్తున్నప్పుడు అందరు లేచి నిలబడడం దేశ సంస్కృతి సంప్రదాయమే కాకుండా కొన్ని రాష్ట్రాల్లో చట్టబద్ధం కూడా. దీన్ని ఉల్లంఘించి సీట్లోనే కూర్చున్న ఓ ముస్లిం యువ దంపతులను థియేటర్ నుంచే తరిమేశారు. ఇప్పుడు ఈ వీడియో ఆన్‌లైన్ హల్‌చల్ చేస్తోంది. క్రికెట్ ద్వారా దేశభక్తిని పూసుకున్న సినీ నటి ప్రీతి జింటా కూడా 2014, అక్టోబర్ నెలలో ఓ సినిమా థియేటర్‌లో ఇలాగే హల్‌చల్ చేశారు.



జాతీయ గీతం ఆలాపన వస్తున్నప్పుడు లేచి నిలబడడం, నిలబడక పోవడం తన ఇష్టమని ఆ ముంబై థియేటర్‌లో ఓ ముస్లిం యువకుడు వ్యాఖ్యానించడం మరోసారి వ్యక్తిగత స్వేచ్ఛ అనే అంశాన్ని తెరపైకి తెచ్చింది. దశాబ్దాల క్రితమే ఓ ముస్లిం యువకుడు తమ మతాచారానికి విరుద్ధం లేచి నిలబడడం అంటూ హైకోర్టులో వాదించడాన్ని కోర్టు కొట్టివేసింది. మత విశ్వాసాలు వేరు, దేశభక్తి వేరంటూ తీర్పు చెప్పింది. ఈ తీర్పును సుప్రీం కోర్టు కొట్టి వేసింది. దేశభక్తి పేరిట వ్యక్తిగత విశ్వాసాలను దెబ్బతీయరాదని, ఈ విషయంలో సరైన చట్టాలు కూడా లేవని ఆ యువకుడి తరఫున తీర్పు వెలువరించింది. దేశభక్తి ఉందనడానికి నిలబడడం, నిలబడక పోవడం కొలమానం కాదని, దేశభక్తి లేనివాళ్లు కూడా నిలబడవచ్చని వ్యాఖ్యానించింది.



దాంతో కొన్ని రాష్ట్రాలు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ గీతాన్ని ఆలపించడం, నిలబడి జాతీయ జెండాకు వందన సమర్పణ చేయడం తప్పనిసరి చేశాయి. 2014, ఆగస్టులో తిరువనంతపురంలోని ఓ సినిమా థియేటర్‌లో జాతీయ గీతాలాపన సందర్భంగా సల్మాన్ అనే వ్యక్తి లేచి నిలబడనందుకు 124ఏ సెక్షన్ కింద దేశద్రోహం కేసు పెట్టింది. పాస్‌పోర్టును సీజ్ చేసింది. ప్రపంచంలోని పలు దేశాల్లో జాతీయ గీతాలాపన ఓ సంప్రదాయంగానే పాటిస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఈ సంప్రదాయానికి చట్టబద్ధత ఉన్నప్పటికే శిక్షలంటూ పెద్దగా లేవు. కొన్ని దేశాలు అతి స్వల్ప జరిమానాలతో సరిపుచ్చుతున్నాయి.



 అమెరికాలో.......

జాతీయ జెండాను చూపించినా, చూపించకపోయినా జాతీయ గీతాలాపన వస్తున్న వైపు మొఖం ఉండేలా నిలబడాలి. కుడిచేతిని గుండెపై పెట్టుకొని ఆలాపన ముగిసేవరకు నిలబడే ఉండాలి. అయితే ఎవరు నిలబడినా, నిలబడక పోయినా పట్టించుకోరు. శిక్షించేందుకు ఎలాంటి చట్టాలు లేవు.



 థాయ్‌లాండ్‌లో...

 ప్రతిరోజు ఉదయం 8 గంటలకు సాయంత్రం ఆరు గంటలకు విధిగా టెలివిజన్‌లో జాతీయ గీతాన్ని ప్రసారం చేస్తారు. విద్యా సంస్థల్లో ఉదయం 8 గంటలకు ప్రతిరోజు ప్రార్థనాగీతం సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో, సినిమా థియేటర్లలో జాతీయ గీతాన్ని తప్పకుండా వినిపిస్తారు. ఆ సందర్భంగా అందరూ నిలబడాల్సిందే. అయితే ఉల్లంఘించిన వారికి ఎలాంటి శిక్షలు లేవు.



 ఇటలీలో.....

దేశాధ్యక్షుడు హాజరయ్యే ప్రజా సమావేశాల్లో, క్రీడా పోటీల్లో తప్పా మరెక్కడా, పాఠశాలల్లో కూడా జాతీయ గీతాన్ని ఆలపించరు. గీతాలాపన సందర్భంగా ఇలా ప్రవర్తించాలనే ఎలాంటి నిబంధనలు లేవు. అయితే విదేశీ జాతీయ గీతాలాపన సంఘటనల్లో మాత్రం గౌరవ సూచకంగా ఇటాలియన్లు నిలబడడం వారి సంస్కృతి.



 మెక్సికోలో అన్ని విశ్వవిద్యాలయాల్లో, పాఠశాలల్లో  ప్రతి సోమవారం జాతీయ జెండా ముందు జాతీయ గీతాలాపన చేస్తారు. విద్యార్థులు తెల్ల దుస్తులు ధరిస్తారు. ధరించకోపోయినా ఎలాంటి శిక్షలు ఉండవు. జపాన్ విద్యా సంస్థల్లో జాతీయ గీతాలాపన సందర్భంగా తప్పనిసరి నిలబడాలి. నిరసనలో భాగంగా నిలబడకపోతే మాత్రం విద్యార్థులకు జరిమానాలు, టీచర్లకు జీతాల్లో కోతలుంటాయి. ముఖ్యంగా స్నాతకోత్సవాల్లో జాతీయ గీతాన్ని గౌరవించాలి.



పలుదేశాల్లో జాతీయ గీతాల పట్ల వివాదాలు ఉన్నట్లే మన జాతీయ గీతంపై కూడా వివాదం ఉన్న విషయం తెల్సిందే. ‘జన గణ మన అధినాయక జయహే, భారత భాగ్యవిదాత’ అని టాగూర్ రాసిందీ బ్రిటీష్ పాలకుడు నాలుగవ జార్జ్ కోల్‌కత రాక సందర్భంగా ఆయనను ఉద్దేశించి రాసిందన్నది వివాదం. ఏ వివాదాలు ఎలా ఉన్నా ‘దేశమును ప్రేమించుమన్నా మంచిఅన్నది పెంచుమన్నా.....దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్’ అన్న కవి సూక్తులు మరచిపోకుంటేచాలు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top