రైతుకు శతాబ్ది రైలును ఇచ్చేసిన కోర్టు!

రైతుకు శతాబ్ది రైలును ఇచ్చేసిన కోర్టు!

రైతు భూమిని తీసుకుని అతనికి తగిన నష్టపరిహారం చెల్లించని ఉత్తరరైల్వేకు లుథియానాలోని జిల్లా అడిషనల్‌ కోర్టు షాక్‌ ఇచ్చింది. అమృతసర్‌-న్యూఢిల్లీల మధ్య నడిచే స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను రైతుకు ఇవ్వాలని సంచలన తీర్పు చెప్పింది. లూథియానా-చండీఘడ్‌ రైల్వే లైను ఏర్పాటు కోసం ఉత్తర రైల్వే 2007లో భూ సేకరణ చట్టం కింద లూథియానాకు చెందిన సంపూరణ్‌ సింగ్‌ అనే రైతుకు చెందిన భూమిని తీసుకుంది. ఇందుకు గాను రూ.కోటికిపైగా నష్ట పరిహారం చెల్లించాల్సివుంది.

 

కానీ, రూ.42 లక్షలు మాత్రమే సంపూరణ్‌కు చెల్లించింది ఉత్తర రైల్వే. దీంతో తనకు న్యాయం చేయాలంటూ 2012లో కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు సంపూరణ్‌. కేసును విచారించిన కోర్టు 2015 జనవరిలో పిటిషనర్‌కు రైల్వే ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇచ్చేయాలని తీర్పు చెప్పింది. అప్పటికీ రైల్వే శాఖ స్పందించకపోవడంతో మరో మారు కోర్టు మెట్లె క్కాడు సింగ్‌. కేసును విచారించిన లూథియానా జిల్లా కోర్టు జడ్జి జస్‌పాల్‌ వర్మ ట్రెయిన్‌ నెం-12030(స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌)ను రైతుకు ఇస్తున్నట్లు తీర్పు చెప్పారు.

 

దీంతో లూథియానా రైల్వే స్టేషన్‌కు కోర్టు ఆర్డర్‌తో చేరుకున్న సంపూరణ్‌ రైలును తనకు అప్పజెప్పాలని కోర్టు ఆర్డర్లను డ్రైవర్‌కు చూపించాడు. ఇంతలో అక్కడికి చేరుకున్ సెక్షన్‌ ఇంజినీర్‌ ప్రదీప్‌కుమార్‌ రైలును కోర్టుకు స్వాధీనం చేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణీకులు ఉండటంతో సమస్యగా మారుతుందని రైలును ఆపలేదని సంపూరణ్‌ తెలిపారు. 

 

ఇంటికి తీసుకెళ్తారా?

కోర్టు తీర్పుపై డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ అనుజ్‌ ప్రకాశ్‌ మాట్లాడారు. నష్టపోయిన వారికి పరిహారాలు చెల్లించడంలో కొన్ని సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ సమస్యను పరిష్కరించేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. కోర్టు ఆదేశాలను కేంద్ర న్యాయశాఖ చూసుకుంటుందని చెప్పారు. రైలును రైతుకు ఇస్తే అతనేం చేసుకుంటాడని ప్రశ్నించారు. కనీసం దాన్ని ఇంటికి తీసుకెళ్లగలరా? అని అన్నారు.
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top