సమర్థ పాలనతో తక్కువ భారం

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, సీజేఐ జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్, రచయిత, జస్టిస్‌ దల్వీర్‌ భండారీ - Sakshi


న్యాయవ్యవస్థపై ప్రధాని మోదీ



న్యూఢిల్లీ: సమర్థవంతమైన పరిపాలనతో న్యాయవ్యవస్థపై చాలా భారం తగ్గుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘మేం 1,200 చట్టాలను రద్దు చేశాం. న్యాయవ్యవస్థపై భారాన్ని తగ్గించేందుకు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. సమర్థ పాలన అంటే.. ముసాయిదా చట్టం తయా రీ నుంచి దాన్ని అమలు చేసే అధికారుల వరకు ఉన్న అనుసంధానమే’ అని వ్యాఖ్యానించారు. ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌లో పనిచేస్తున్న జస్టిస్‌ దల్వీర్‌ భండారీ రాసిన ‘జ్యడీషియల్‌ రిఫామ్స్‌– రీసెంట్‌ గ్లోబల్‌ ట్రెండ్స్‌’ పుస్తకాన్ని ప్రధాని బుధవారం రాష్ట్రపతి భవన్‌లో ఆవిష్కరించి ప్రసంగించారు.


ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పోటీ నేపథ్యంలో మార్పు దిశగా భారత్‌ వేగంగా పరుగులు పెట్టాలని, ప్రస్తుతం దేశంలో పలు రంగాల్లో చాలా సరళీకరణ ఉందని చెప్పారు. భారతీయులు చాలా సంప్రదాయవాదులని, అయితే మార్పులు వేగంగా వస్తాయని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ త్వరగా నిర్ణయాలు తీసుకోవడం తనకు నచ్చిందని అన్నారు. టెక్నాలజీతో వస్తున్న భారీ మార్పులను దృష్టిలో ఉంచుకుని, దేశం లోని న్యాయ విశ్వవిద్యాలయాలు అలాంటి ప్రతిభను అభివృద్ధి పరచడంపై దృష్టి పెట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, జస్టిస్‌ ఖేహర్, కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, రవిశంకర్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.



సంస్కరణలకు తరుణమిదే: రాష్ట్రపతి

కార్యక్రమంలో ప్రణబ్‌ మాట్లాడుతూ.. న్యాయ సంస్కరణలపై ప్రతి ఒక్కరూ ఆలోచించడానికే కాకుండా చర్యలు తీసుకోవడానికి కూడా ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. ఆరు దశాబ్దాల భారత న్యాయవ్యవస్థలో భారీ మార్పులు రావాలని, మార్పనేది నిరంతర ప్రక్రియ అని వ్యాఖ్యానించారు. తగినన్ని మౌలిక సదుపాయాలు లేకుండా సంస్కరణలను తీసుకురాలేమన్నారు. తన పదవీ కాలంలో దేశంలో అతిపెద్దదైన అలహాబాద్‌ హైకోర్టులో మొత్తం 180 జడ్జీల పోస్టులు ఉండగా అందులో సగం కంటే తక్కువ పోస్టులే భర్తీ అయ్యాయని అన్నారు.  



న్యాయవ్యవస్థను నిందించకూడదు: సీజేఐ

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ మాట్లాడుతూ.. చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నందుకు న్యాయవ్యవస్థను నిందించకూడదన్నారు. అందుకు బదులుగా ప్రభుత్వమే తాను వేసే వ్యాజ్యాలను తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు. ‘కొన్ని విషయాల్లో కేసు వేయాలా వద్దా అని తేల్చుకోవడం ప్రభుత్వ విభాగాలకు చాలా కష్టంగా ఉంటుంది. కానీ విషయాలు సంక్లిష్టమైనపుడు అధికారులెవరూ బాధ్యత తీసుకోడానికి ఇష్టపడక కోర్టులో కేసు వేస్తారు’అని అన్నారు. అయితే ఇక్కడ తాను ప్రభుత్వాన్ని నిందించడం లేదనీ, తన మాటలకు వక్రభాష్యం చెప్పవద్దని కోరారు. ప్రభుత్వ విభాగాలు వేసే కేసుల్లో 10% తగ్గినా, మిగతా కేసులను వేగంగా పరిష్కరించవచ్చన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top