కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు సగం!

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు సగం!


* వాటాపై 14వ ఆర్థిక సంఘం సిఫారసు?

* రాష్ట్రాలకు కేంద్ర నిధుల వాటా 42 శాతం పెంచాలన్న ఆర్థిక సంఘం!

* గ్రాంట్లు, ప్రణాళికా మద్దతు కూడా కలిపితే 50% దాటనున్న నిధులు

* కేంద్ర పన్నుల్లో వాటా నిధుల వినియోగంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ కూడా

* వచ్చే కేంద్ర బడ్జెట్‌లో కనిపించనున్న మోదీ మార్కు సమాఖ్య స్ఫూర్తి


 

 సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం దేశాభివృద్ధిలో భాగంగా రాష్ట్రాలకు పెద్ద పీట వేయనుందా? రాష్ట్రాలకు కేటాయించే నిధుల వినియోగంలో వాటికి పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వనుందా? సమాఖ్య స్ఫూర్తిని నింపుతూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనుందా? ఈ ప్రశ్నలన్నింటికీ రానున్న బడ్జెట్ సమాధానం చెప్పనుంది. 14వ ఆర్థిక సంఘం సిఫారసులు కూడా ఈ దిశగానే ఉన్నట్టు కేంద్ర ఆర్థికశాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర పన్ను రాబడిలో రాష్ట్రాలకు 32 శాతం వాటా ఉండగా.. దానికి కేంద్ర గ్రాంట్లు, ప్రణాళికా మద్దతు కేటాయింపులు కలిపి 42 శాతం వరకూ రాష్ట్రాలకు అందుతున్నాయి.

 

 అయితే.. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 14వ ఆర్థిక సంఘం ఏకంగా 42 శాతానికి పెంచుతూ సిఫారసు చేసినట్టు సంబంధిత వర్గాల సమాచారం. ఈ సిఫారసు అమలులోకి వచ్చి.. దీనికి కేంద్రగ్రాంట్లు, ప్రణాళికా మద్దతు కేటాయింపు లు కూడా కలిపితే రాష్ట్రాలకు అందే నిధులు 50 శాతం.. అంటే సగానికి పైగా దాటిపోతాయని చెప్తున్నారు. ఈ ఆర్థిక సంఘం సిఫారసులు ఇంకా వెలుగుచూడనప్పటికీ.. ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఈ పెంపును సిఫారసు చేసినట్టు సమాచారం. డాక్టర్ వై.వి.రెడ్డి నేతృత్వంలోని ఈ ఆర్థిక సంఘం అన్ని రాష్ట్రాలు తిరిగి తన నివేదికను తయారుచేసి గత నెలలో రాష్ట్రపతికి సమర్పించింది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటుముందుకు తీసుకురానుంది. 14వ ఆర్థిక సంఘం సిఫారసులు వచ్చే ఏప్రిల్ నెల నుంచి ఐదేళ్ల పాటు అమలులో ఉంటా యి. ఆర్థిక సంఘం సిఫారసులు అమలైతే కేంద్ర పన్నుల్లో 50 శాతం పైగా నిధులు రాష్ట్రాలకు లభించనున్నాయి.

 

 ఈ పరిస్థితుల్లో కేంద్రం అమలుచేసే పథకాలకు నిధుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. 11వ ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 29.5 శాతానికి పెంచాలని సిఫారసు చేయగా.. 12వ ఆర్థిక సంఘం 30.5 శాతానికి సిఫారసు చేసింది. 13వ ఆర్థిక సంఘం 32 శాతానికి పెంచాలని సిఫారసు చేసింది. ఇప్పుడు 14వ ఆర్థిక సంఘం దీన్ని ఒకేసారి 42 శాతానికి పెంచాలని సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. అలాగే రాష్ట్రాలకు ఇచ్చే నిధులను ఆయా రాష్ట్రాల ప్రాధామ్యాలను బట్టి ఖర్చు చేసుకునే స్వేచ్ఛ ఇవ్వనున్నట్టు సమాచారం.

 

 గత ఐదేళ్లలో ఉమ్మడి ఏపీకి 6.93% వాటా

 ఇక.. 2010 నుంచి ఇప్పటి వరకు 13వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన 32 శాతం వాటా నిధులను 27 రాష్ట్రాలకు (జమ్మూకశ్మీర్‌ను మినహాయించి) పంచగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆ మొత్తం నిధుల్లో 6.93 శాతం వాటా దక్కింది. రాష్ట్రాల వారీగా వాటాలను నాలుగు అంశాల ఆధారంగా నిర్ధారిస్తారు. జనాభాకు 25 శాతం వెయిటేజీ, విస్తీర్ణానికి 10 శాతం, ఫిస్కల్ కెపాసిటీ డిస్టెన్స్ (అంటే రాష్ట్రాల వారీగా తలసరి పన్ను ఆదాయం నిష్పత్తి మధ్య అంతరం)కు 47.5 శాతం, ద్రవ్య క్రమశిక్షణ (రాబడుల పెంపు పనితీరు)కు 17.5 శాతం వెయిటేజీ ఇచ్చి ఆయా రాష్ట్రాల వాటాను నిర్ధారిస్తారు. ఈ లెక్కనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 6.93 శాతం వాటా దక్కింది. ఉత్తరప్రదేశ్‌కు 19.67 శాతం వాటా దక్కింది. జనాభా, విస్తీర్ణం, ఇతరత్రా అంశాలు అందుకు తోడయ్యాయి. ఏపీ విడిపోయిన తరుణంలో ఇప్పుడు రెండు రాష్ట్రాలకు ఏ మేరకు వాటా వస్తుందో వేచిచూడాలి.

 

 2011 జనాభా ప్రాతిపదిక కావాలి:కేసీఆర్

 మొన్నటి సెప్టెంబర్ మాసంలో 14వ ఆర్థిక సంఘం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించింది. సెప్టెంబర్ 19న తెలంగాణలో పర్యటించింది. ఆ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం పలు అభ్యర్థనలను ఆర్థిక సంఘం ముందు పెట్టింది. కేంద్ర పన్నుల మొత్తం నుంచి 40 శాతం నిధులను రాష్ట్రాలకు కేటాయించాలని కోరింది. అలాగే రాష్ట్రాల వారీగా వాటా నిర్ధారించేటప్పుడు 1971 జనాభాను ఆధారంగా తీసుకోకుండా.. 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆర్థిక సంఘాన్ని కోరారు.

 

 విస్తీర్ణానికి వెయిటేజీ కూడా 10 శాతం కాకుండా 30 శాతం ఇవ్వాలని కోరారు. తెలంగాణలో 1971 తరువాత వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వలసలతో జనాభా గణనీయం గా పెరగడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ డిమాండ్ పెట్టింది. వాటర్ గ్రిడ్‌కు, తెలంగాణ హరిత హారానికి, చెరువుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. ఈ డిమాండ్లలో.. పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం సిఫారసు చేస్తున్నట్టు తెలుస్తోండ గా.. జనాభా ప్రాతిపదికను మాత్రం మార్చలేదని సమాచారం.

 

 50% వాటా కోరిన రాష్ట్రాల డిమాండ్ మేరకు..


 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా పలు రాష్ట్రాల డిమాండ్ మేరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని కోరారు. అలాగే రాజధాని నిర్మాణానికి, రెవెన్యూ లోటు భర్తీకి నిధులు కోరారు. అనేక రాష్ట్రాలు కూడా ఇదే రీతిలో పన్నుల్లో వాటాను 50 శాతం అడిగాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రాల ఇబ్బం దులు, ముఖ్యంగా అవి సొంతంగా తమ తమ అభివృద్ధి పథకాలను అమలుచేసుకోవడంలో ఉన్న ఇబ్బందులు తెలిసినందున రాష్ట్రాల డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తారని అన్ని రాష్ట్రాలు ఆశాభావంతో ఉన్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top