ఓ మై డాగ్

ఓ మై డాగ్ - Sakshi


న్యూఢిల్లీ: దేశంలో కోడి పందేలు, జల్లికట్టు పందేల గురించి మనకు తెలుసు. ‘డాగ్‌ఫైట్ ’ పందేల గురించి అంతగా తెలియదు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో గత మూడు, నాలుగేళ్లుగా గుట్టుగా కొనసాగుతున్న ఈ పందేలు ఇప్పుడు ఢిల్లీ నగరానికి కూడా చేరుకోవడం కలవరపెడుతున్న విషయం. ఈ పందేల పేరిట కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. మూగ జీవాలు మాత్రం కాళ్లు, చేతులేకాకుండా తలల పగులగొట్టుకొని రక్తం మోడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మృత్యువాత కూడా పడుతున్నాయి.



కుక్కల కొట్లాటకు కావాల్సిన కుక్కలను అంతర్జాతీయ ముఠాలు కూడా పుట్టుకొచ్చాయి. అఫ్ఘానిస్తాన్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ దేశాల నుంచి ఈ ముఠాలు డాగ్‌ఫైట్ కోసం బలమైన కుక్కలను సరఫరా చేస్తున్నాయి. పంజాబ్‌లోని గ్రామీణ ప్రాంతాలు, హర్యానాలోని పట్టణ ప్రాంతాలకు మాత్రమే ఇంతకాలం పరిమితమైన ఈ ఫైట్ ఢిల్లీ నగరానికి కూడా చేరడంతో ‘డాగ్ ఫైట్’ వీడీయో దృశ్యాలు ఇప్పుడు సామాజిక వెబ్‌సైట్లలో దర్శనమిస్తున్నాయి. ఈ ఫైట్ కోసమే వెలిసిన ‘డాగ్ క్లబ్’లు వీటిని పోస్ట్ చేస్తున్నాయి. గెలిచిన కుక్కలతో యజమానులు దిగిన ఫొటోలు కూడా రెండు రోజుల క్రితం వరకు ఫేస్‌బుక్‌లో హల్ చల్ చేశాయి. పోలీసు అధికారుల నుంచి హెచ్చరికలు రావడంతో ఇలాంటి ఫొటోలను ఇప్పుడు సైట్ల నుంచి తొలగించారు. అయితే డాగ్ ఫైట్‌కు సంబంధించిన వీడియో దృశ్యాలు మాత్రం నేటికి కనిపిస్తున్నాయి.





ఫైట్‌లో పాల్గొనే కుక్కలకు చెవులు, తోకలు పూర్తిగా కత్తిరిస్తున్నారు. ఫైట్‌కు కొన్ని రోజులకు ముందు నుంచి వాటికి ఎలాంటి ఆహారం లేకుండా మలమల మాడుస్తున్నారని హర్యానాకు చెందిన  జంతుకారుణ్య కార్యకర్త జూహి భట్టాచార్య తెలిపారు. ఫైట్ సందర్భంగా రెచ్చిపోవడం కోసమే ఇలా జంతువులను హింసిస్తారని, బోనులో బంధిస్తారని ఆయన వివరించారు. వీఐపీలు, పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయం ఉండడం వల్లనే డాగ్‌ఫైట్ నిర్వాహకులపై పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మీడియా ప్రతినిధులు  ఆ రాష్ట్రాలకు ఇటీవల వెళ్లి డాగ్‌ఫైట్‌ను ప్రత్యక్షంగా చూడడమే కాకుండా వీడియోలను తీసి పోలీసు ఉన్నతాధికారులకు అందజేశారు. వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇప్పుడు ఢిల్లీకి పాకిన ఈ పోటీలు నగర శివారులోని ఫామ్ హౌజుల్లో కొనసాగుతున్నాయి. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి మీడియా తీసుకెళ్లగా  నిర్వాహకులు తమదాకా రానీయకుంగా జాగ్రత్త పడతారని చెబుతున్నారు. పోలీసులకు ముందస్తు సమాచారమిచ్చే వీటిని నిర్వహిస్తున్నట్టు పోటీల్లో పాల్గొంటున్నవారే చెప్పడం గమనార్హం.



జీవకారుణ్య కార్యకర్తగా గుర్తింపు పొందిన ప్రస్తుత కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ దృష్టికి ఈ విషయాన్ని మీడియా తీసుకెళ్లగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఇలాంటి పోటీలు జరుగుతున్నాయనే విషయం తనకు గత మూడేళ్లుగా తెలుసునని చెప్పారు. వీటిపై చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ తాను స్వయంగా పంజాబ్ డిప్యూటీ ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు లేఖ రాశానని, ఆయన నుంచి ఇంతవరకు ఎలాంటి సమాధానం రాలేదని ఆమె చెప్పారు. వీఐపీలో ప్రమేయం ఉండడం వల్లనే చర్య తీసుకోలేదని తాను భావిస్తున్నట్టు చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top