'మేము చంపితే తప్పు.. వారు చంపితే తప్పుకాదా?'

'మేము చంపితే తప్పు.. వారు చంపితే తప్పుకాదా?' - Sakshi

'మావోయిస్టులను మేము చంపితే తప్పవుతుంది. మానవహక్కుల కార్యకర్తలు వెంటనే రంగంలోకి దిగి మాకు వ్యతిరేకంగా, వారికి అనుకూలంగా నినాదాలు ఇస్తారు. ఉద్యమాలు చేస్తారు. అదే మావోయిస్టులు మమ్మల్ని చంపితే తప్పుకాదు. ఒక్క మానవ హక్కుల కార్యకర్త మా పక్షాన మాట్లాడరు. మౌనం వహిస్తారు. మావోయిస్టులు లొంగిపోనందుకు వారిపై మేము నిజంగా కాల్పులు జరిపినా వెనకాముందు ఆలోచించకుండా, నిజానిజాలను బేరీజు వేయకుండానే టక్కున బూటకపు ఎన్‌కౌంటర్‌ అంటూ ఖండిస్తారు. అర్థరాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు మావోయిస్టులు మాపై దాడులు చేసి పోలీసులను హతమారిస్తే...అది మానవహక్కుల ఉల్లంఘన కాదా? ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మా పోలీసులు పౌరుల తరహాలో గడ్డి బొమ్మలతో వీధుల్లోకి వచ్చారు. వాటిని దగ్ధం చేశారు. మాకు మరో ప్రత్యామ్నాయం లేకనే అలా చేశాం' అని బస్తర్ ఐజీ శివరామ్‌ ప్రసాద్‌ కల్లూరి మీడియా ముందు వ్యాఖ్యానించారు. 

 

ఢిల్లీ యూనివర్సిటీ సోషియాలజీ ప్రొఫెసర్‌ నందిని సుందర్, ఆదివాసి కార్యకర్త, ఆమ్‌ ఆద్మీ పార్టీ సభ్యులు మనీష్‌ కుంజమ్, సీపీఎం ఎమ్మెల్యే హిమాంషు కుమార్, సామాజిక కార్యకర్త బేల బాటియా ఫొటోలను దిష్టిబొమ్మలకు తగిలించి ఛత్తీస్‌గఢ్‌లోని ఏడు జిల్లాలో పోలీసులు సోమవారం నాడు ఊరేగించారు. అనంతరం వాటిని దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఐదుగురిపైనా వారికి ఎందుకంత కోపం వచ్చిందంటే... సుక్మా ప్రాంతంలోని మూడు ఆదివాసీ గ్రామాల్లో దాదాపు 200 ఇళ్లను అన్యాయంగా తగులబెట్టారన్న కేసులో పోలీసులను విచారించి శిక్షించాలని అక్టోబర్‌ 17వ తేదీన సీబీఐ నిర్ణయించింది. 2011లో సుక్మా ప్రాంతంలోని మోర్‌పల్లి, టాడ్‌మెట్ల, టీమాపురం గ్రామాల్లో పోలీసులు బీభత్సం సృష్టించారంటూ ప్రొఫెసర్‌ నందని సుందర్‌ కోర్టుకు ఎక్కడం, పోలీసులకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను సమీకరించడంలో మిగతా సామాజిక కార్యకర్తలు కృషిచేయడంతో ఈ ఐదుగురిపైనా పోలీసులకు కోపం వచ్చింది. 

 

ఇలా పోలీసులు పౌరుల తరహాలో వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేయడం నేరం కాదా? అని ఐజీ శివరామ్‌ ప్రసాద్‌ను మీడియా ప్రశ్నించగా మరో ప్రత్యామ్నాయం లేకపోయిందంటూ సమర్థించుకున్నారు. ఆ రోజున తాను దంతేవాడ సీనియర్‌ ఎస్పీగా ఉన్నానని, తన ఆదేశం ప్రకారమే మూడు గ్రామాల్లోని మావోయిస్టులపై పోలీసులు దాడులు చేశారని, అది తప్పయితే తనపై కేసు నమోదుచేసి విచారించాలి గానీ చిన్నస్థాయి ఉద్యోగులను కేసుల పేరిట వేధించడం తగదని ఆయన అన్నారు. నక్సలైట్లను పట్టుకునేందుకు వెళ్లినప్పుడు ఏమైనా జరుగుతోందని, పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇళ్లు తగులబడితే తగులబడి ఉండొచ్చని, నక్సలైట్లు కాల్పులు జరిపినా, బాంబులు పేల్చినా అదే పరిస్థితి తలెత్తుతుందని ఆయన అన్నారు. ఏదేమైనా పోలీసులు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు జరపడం ఇండియన్‌ పోలీస్‌ యాక్ట్‌ కింద నేరం అవుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు.
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top