జోరుగా దీపావళి షాపింగ్

జోరుగా దీపావళి షాపింగ్


 సాక్షి, న్యూఢిల్లీ: ధన్‌తేరస్‌తో నగరంలో దీపావళి షాపింగ్ పరాకాష్టకు చేరుకుంది. ధన్‌తేరస్ నాడు బంగారం, వెండి లేదా స్టీలు వస్తువును కొనడం శుభప్రదమని ఉత్తరాదివాసుల నమ్మకం. ధనతేరస్ రోజున బంగారం, వెండి కొనే తాహతులేకపోతే కనీసం ఓ స్టీలు వస్తువు కొనుక్కోవాలని ఉత్తరాదివాసులనుకుంటారు. దాంతో మంగళవారం బంగారు, వెండి ఆభరణాల దుకాణాలతో పాటు స్టీలు సామగ్రి విక్రయించే దుకాణాలు కూడా కొత్తకొత్త స్కీములతో, ఆఫర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించాయి. గణేషుడు, లక్ష్మీప్రతిమలు, లక్ష్మీ వినాయక వెండినాణేలు, రూపాయినోట్ల నమూనాలు వెండి దుకాణాలలో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. బంగారం, వెండి ధరలు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తక్కువగా ఉండడంతో నగరవాసులు  ఉత్సాహంగా కొనుగోళ్లు జరుపుతారని దుకాణాదారులు ఆశించినప్పటికీ ఊహించినంత సందడి కనిపించలేదు.

 

 అయినప్పటికీ ధన్‌తేరస్ కొనుగోలుదారులతో పాటు దీపావళి షాపర్లతో నగర మార్కెట్లు కిటకిటలాడాయి. దీపావళి సమయంలో తమతో వ్యాపారలావాదేవీలు నిర్వహించేవారికి, బంధుమిత్రులకు  మిఠాయిలు, కానుకలు పంచడం ఉత్తరాదిలో మరోసాంప్రదాయం. దానితో మిఠాయిలు, కానుకలు కొనుగోలు చేసేవారితో రోడ్లపై గంటలతరబడి ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడతాయి. సాధారణంగా కానుకలు పంచే తతంగాన్ని చాలామంది వారం రోజుల ముందునుంచే ప్రారంభించినప్పటికీ దీపావళి  రోజులలో ఇది పతాకస్థాయికి చేరుతుంది. దీపావళికి ఇచ్చిపుచ్చుకునే కానుకలలో ప్రధానంగా చెప్పుకోవలసింది డ్రైఫ్రూట్స్.

 

 డ్రైప్రూట్స్ కొనుగోలుదారులతో ఆసియాలోనే మసాలాలకు అతిపెద్ద మార్కెట్‌గా పేరొందిన ఖరీబౌలీ మార్కెట్‌లో మంగళవారం కాలుపెట్టడానికి చోటులేకుండా పోయింది. కాలిఫోర్నియా, కాబూల్ బాదాం, రాజస్థాన్, చైనా కిస్మిస్, ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్న డీహ్రైడేటెడ్ పళ్లు...  డ్రైఫ్రూట్స్‌లో వెరయిటీకి అంతులేనట్లున్నాయి. అఫ్గానిస్తాన్ నుంచి వచ్చే ైడ్రె ఫ్రూట్స్ నాణ్యమైనవని దుకాణాదారులు చెప్పారు. చాలారకాల డ్రైఫ్రూట్స్‌ను ఎక్కువగా దిగమతి చేసుకుంటారు కనుక వాటి ధర పంటదిగుబడితో పాటు డాలర్ రేటుపై ఆధారపడి ఉంటుందని వారు చెప్పారు. ఈ సంవత్సరం డ్రైఫ్రూట్స్ ధరలు ఎక్కువగా ఉండడం వల్ల కొనుగోలుదారులు అనుకున్నదానికంటే తక్కువ స్థాయిలో కొనుగోళ్లు జరుపుతున్నారని వారు చెప్పారు.

 

 దీపావళి కొనుగోళ్లనగానే మొదట గుర్తుకొచ్చే బాణసంచా గురించి చివరగా చెప్పుకుంటే.... ఈ సంవత్సరం చైనా బాణసంచా పై నిషేధం అమల్లోకి తేవడంతో చాలాదుకాణాలు చైనా ఉత్పత్తులు తమ వద్దలేవనే బోర్డులు వేలాడదీశాయి. అయినప్పటికీ మార్కెట్లలోని చిన్నాచితకా దుకాణాలలో విక్రయించే చైనా బాణసంచా కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. ప్రమాదాలను, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వం చైనా టపాసుల విక్రయాన్ని నిషేధించినప్పటికీ వాటి ధర దేశీ బాణసంచా కంటే తక్కువగా ఉండడం కొనుగోలుదారులను ఆక ర్షిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ యేడాది టపాసుల ధరలు ఎక్కువగా ఉన్నాయని అంగీకరించిన పెద్ద దుకాణదారులు ధరల ప్రభావం తమ అమ్మకాలపై కనిసిస్తోందని చెప్పారు. పర్యావరణ సన్నిహితంగా దీపావళి జరుపుకునేవారి సంఖ్య పెరగడం కూడా బాణసంచా అమ్మకాలపై ప్రభావం చూపుతోందని వారు చెప్పారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top