‘పొగ’ చూరిన హస్తిన..!


సాక్షి, న్యూఢిల్లీ:దీపావళి మరుసటి రోజున నగరంలో కాలుష్యస్థాయి సాధారణం కంటే తొమ్మిది రెట్లు పెరిగింది. శ్వాసపై నేరుగా ప్రభావం చూపే రెస్పైరబుల్ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్ ( ఆర్‌ఎస్‌పీఎం) 531 ఎంజీగా నమోదైంది. ఇది సాధారణ స్థాయి కన్నా ఐదు రెట్లు ఎక్కువని సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ఆండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసర్చ్ (సఫర్) శాస్త్రవేత్తలు తెలిపారు. 24 గంటల సగటు ఘనపుమీటరుకు 427 మైక్రోగ్రాములుకాగా పీఎం 2.5  ఘనపుమీటరుకు 278 ఎంజీగా నమోదైంది. పీఎం 10   సిఫారసు చేసిన ప్రమాణ స్థాయి 100 ఎంజీపసీఎం కాగా, పీఎం 2.5కి 60 ఎం పీఎం10 కు 60 ఎంపీసీఎంగా ఉందని వారు తెలిపారు. అంటే సిఫార్స్ చేసిన ప్రమాణ స్థాయి కన్నా ఇవి ఐదు రెటు ఎక్కువగా ఉన్నాయని సఫర్ సీనియర్ సైంటిస్టు డా గుఫ్రాన్ బేగ్ చెప్పారు. నగరంతో వాయు కాలుష్య స్థాయి మరో రెండు రోజుల పాటు ఎక్కువగా ఉండొచ్చని, దాని వల్ల ఉష్ణోగ్రతలు తగ్గవచ్చని ఆయన తెలిపారు.

 

 కాలుష్యాలు గుండెతోపాటు మెదడుపై  దుష్ర్పభావం చూపవచ్చని ఆయన చెప్పారు. ఇప్పటికే ఆస్త్మా, ఇతర శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులతో బాధపడుతున్న వారు పెరిగిన కాలుష్య స్థాయి వల్ల ఆస్పత్రి పాలయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. దీపావళి మరుసటి రోజున మిగతా అన్ని నగరాల కన్నా ఢిల్లీలో  కాలుష్య స్థాయి ఎక్కువగా ఉంది. తర్వాత స్థానాలలో చెన్నై, బెంగళూరు ఉన్నాయి.

 

 ఢిల్లీ కాలుష్య నియంత్రణ  కమిటీ ఈ సంవత్సరం కూడా దీపావళి రోజున వాయు నాణ్యతపై రియల్ టైమ్ డేటా అందించింది. ఆనంద్‌విహార్, ఆర్‌కేపురం, పంజాబీబాగ్, సివిల్‌లైన్స్, ఐజీఐ ఎయిర్‌పోర్టు, మందిర్‌మార్గ్ మానిటరింగ్ సెంటర్ల నుంచి ఈ డేటా సేకరించారు. గురువారం సాయంత్రం 8 నుంచి 10 గంటల మధ్య పంజాబీ బాగ్, సివిల్ లైన్ , మందిర మార్గ్ పరిసర ప్రాంతాల్లో కాలుష్య స్థాయి పది రెట్లు ఎక్కువగా ఉండగా, ఆనంద్‌విహార్‌లో ఇది 13 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ ఆరు కేంద్రాల్లో రాత్రి పది గంటల తర్వాత కాలుష్య స్థాయి తీవ్రత పెరిగింది. ఆర్‌కేపురం మానిటరింగ్ కేంద్రంలో తెల్లవారుఝామున ఐదున్నరకు పీఎం 2.5 గరిష్ట స్థాయికి చేరింది.

 

 అప్పుడది ఘనపుమీటరుకు 724 మైక్రోగ్రాములుగా నమోదైంది.మందిర్‌మార్గ్ మానిటరింగ్ కేంద్రంలో తెల్లవారుఝామున రెండున్నరకు  పీఎం 2.5 గరిష్టస్థాయిలో అంటే  ఘనపుమీటరుకు 984 మైక్రోగ్రాములుగా నమోదైంది. రెండు గంటలకు గరిష్ట స్థాయికి (పీఎం10 ఘనపు మీటరుకు 1200 ఎంజీ) చేరింది. పంజాబీబాగ్ మానిటరింగ్ కేంద్రంలో పీఎం 2.5 అర్థరాత్రి ఒంటిగంటకు గరిష్టస్థాయికి చేరింది. అప్పుడది 755 ఎంపీసీఎంగా నమోదైంది. పీఎం 10 తెల్లవారు ఝామున మూడున్నరకు గరిష్టస్థాయిలో 1490 ఎంపీసీఎంగా నమోదైంది.

 ఆనంద్‌విహార్ మానిటరింగ్ కేంద్రంలో పీఎం2.5 రాత్రి ఒంటిగంటకు, పీఎం10 అర్థరాత్రి 12 గంటలకు గరిష్టస్థాయికి చేరాయి.

 

 అప్పుడు అక్కడ పీఎం 2.5 ఘనపుమీటరుకు 814 మైక్రోగాములు ఉండగా, పీఎం 10  ఘనపుమీటరుకు 1500 మైక్రోగ్రాములుగా ఉంది. ఐజీఐ విమానాశ్రయంలో రాత్రి 11.30 గంటలకు  కాలుష్యం గరిష్ట స్థాయికి చేరింది. అప్పుడుపీఎం 2.5  ఘనపుమీటరుకు 347.41  మైక్రోగ్రాములుగా ,పీఎం 10 ఘనపుమీటరుకు 404.98 ఎంజీగా నమోదైంది. సివిల్ లైన్స్‌లో పీఎం 2.5 రాత్రి 11 గంటల  నుంచి తెల్లవారుఝామున 2.30 గంటలకు గరిష్ట స్థాయిలో అంటే 999.85 ఎంపీసీఎంగా నమోదైంది, పీఎం 10 రాత్రి 9 గంటలనుంచి తెల్లవారుఝామున 3 గంటల మధ్య కాలంలో గరిస్టస్థాయికి చేరింది. అప్పుడది ఘనపుమీటరుకు  1000 మెక్రోగ్రాములుగా నమోదైంది. రాత్రి ఎనిమిది గంటల నుంచి నగరంలో వాయు కాలుష్యం పెరిగిందని, పొగను పారదోలడం కోసం బలమైన గాలులు కూడా వీయలేదని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్‌కు చెందిన అనురూపారాయ్ చౌదరి తెలిపారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top