ధనుష్ ఇంటి నుంచి పారిపోయాడు!

ధనుష్ ఇంటి నుంచి పారిపోయాడు! - Sakshi


చెన్నై: నటుడు ధనుష్‌ తమ కుమారుడేనని, స్కూలు చదువు మధ్యలోనే ఇంటి నుంచి పారిపోయాడని హీరో తండ్రిగా చెప్పుకుంటున్న కదిరేశన్(65) అంటున్నారు. నేటి ఉదయం హీరో ధనుష్ పుట్టుమచ్చల వెరిఫికోషన్ కోసం మధురై కోర్టుకు హాజరయ్యాడు. రిజిస్ట్రార్ చాంబర్‌లో ధనుష్ నుంచి బర్త్ మార్క్స్ (పుట్టుమచ్చలు) సేకరించిన తర్వాత కేసును మార్చి 2వ తేదీకి వేశారని కదిరేశన్ చెప్పారు. విచారణ వాయిదా వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ధనుష్ తమకు మూడో సంతానమని ఆయన తండ్రిగా పిటిషన్ వేసిన మదురై జిల్లా మేలూర్‌ గ్రామానికి చెందిన కదిరేశన్ చెప్పారు.



ఎనిమిదో తరగతి వరకు ధనుష్ తమ వద్దే ఉన్నాడని, ఆ తర్వాత ధనుష్‌ను స్కూలు మార్పించడంతో పాటు హాస్టల్లో వేశామన్నారు. ఆ సమయంలోనే ధనుష్ చెన్నైకి పారిపోయాడని, సినిమాల్లో చూసి తమ కుమారుడని గుర్తించినట్లు పేర్కొన్నారు. ధనుష్‌ను కలిసేందుకు చాలాసార్లు ప్రయత్నించామని, అందుకు తమకు అవకాశం దక్కలేదని.. దీంతో తాము కోర్టును ఆశ్రయించినట్లు వివరించారు. ఖర్చుల నిమిత్తం, తమ అవసరాలకు నెలకు రూ.65 వేలు చెల్లించాలని కదిరేశన్, మీనాక్షి దంపతులు పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు ధనుష్ తరఫు లాయర్ మాత్రం కదిరేశన్ దంపతుల ఆరోపణల్లో వాస్తవం లేదని మొదటినుంచీ చెబుతూనే ఉన్నారు.



ధనుష్ సమర్పించిన బర్త్‌డే సర్టిఫికెట్లో పుట్టిన తేదీ 1983, జూలై28 అని ఉందని జస్టిస్ జి.చోక్కాలింగం గుర్తించారు. ఈ సర్టిఫికెట్లో ధనుష్ పేరు తప్పుగా ఉందని, ఆ సర్టిఫికెట్ 1993 జూన్ 21న ఇష్యూ చేసినట్లుగా ఉందని కదిరేశన్ అంటున్నారు.  తమ అబ్బాయి పేరు లేకుండా బర్త్ సర్టిఫికేట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. గతవారం ధనుష్ టెన్త్ క్లాస్ టీసీని ఇరు వర్గీయులు కోర్టులో ప్రవేశపెట్టగా, ధనుష్‌ లాయర్ సమర్పించిన దాంట్లో బర్త్ మార్క్స్ లేవు. కదిరేశన్ దంపతులు కోర్టుకు ఇచ్చిన టీసీలో బర్త్ మార్క్స్ ఉన్నాయని, దీంతో ఫిబ్రవరి 28లోగా కోర్టుకు హాజరు కావాలని హీరోని మధురై కోర్టు ఆదేశించింది. నేడు జస్టిస్ చోక్కాలింగం, మద్రాస్ హైకోర్టుకు సంబంధించిన రిజిస్టార్ తన చాంబర్లో ధనుష్ బర్త్ మార్క్స్ వివరాలు సేకరించిన అనంతరం విచారణను మార్చి 2కు వాయిదా వేశారు.


ధనుష్ ఈ కేసుకు సంబంధించిన కథనాలు


 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top