కాంగ్రెస్ కంచుకోట బద్దలైంది

కాంగ్రెస్ కంచుకోట బద్దలైంది - Sakshi


మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన ప్రచారం లాతూరులో పనిచేసింది. 1993 సంవత్సరంలో పెను భూకంపంతో చిగురుటాకులా వణికిన ఈ ప్రాంతం.. ఆ తర్వాత గత ఐదేళ్లుగా కరువుతో అల్లాడుతోంది. ఇలాంటి ప్రాంత కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 70 మంది సభ్యులున్న ఈ కార్పొరేషన్ ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. ఇప్పుడది బీజేపీ వశమైంది. 2012లో జరిగిన ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయిన బీజేపీ.. ఇప్పుడు ఏకంగా 41స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. గతంలో 49 స్థానాలున్న కాంగ్రెస్.. ఇప్పుడు 28 స్థానాలకే పరిమితమైంది. ఎన్‌సీపీకి గతంలో 13 స్థానాలుండగా ఇప్పుడు ఒక్కచోట మాత్రమే గెలిచింది. అలాగే శివసేన ఇంతకుముందు ఆరు స్థానాల్లో గెలవగా ఇప్పుడు బోణీ కొట్టలేదు. బీజేపీ అధికారంలోకి వస్తే లాతూరును కరువు నుంచి బయట పడేస్తానని ఫడ్నవీస్ తన ప్రచారంలో తెలిపారు.



ఇంతకుముందు అమరావతి, పుణె లాంటి నగరాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీకి ఫడ్నవీస్ మంచి విజయాలు అందించారు. ముంబైలో శివసేన, బీజేపీ దాదాపు దగ్గర వరకు వచ్చాయి. విద్యుత్ కోతల కారణంగా విద్యుత్ మోటార్లు ఉపయోగించలేని రైతులు కరెంటు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని ఈ నెల ప్రారంభంలో లాతూరులో ప్రచారం చేసినప్పుడు సీఎం ఫడ్నవీస్ చెప్పారు. విద్యుత్ సదుపాయాన్ని మెరుగు పరిచేందుకు తాము మరాఠ్వాడా ప్రాంతానికి రూ. 561 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. గత సంవత్సరం రైళ్లలో నీళ్లను పంపి లాతూరు ప్రాంతానికి అందించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top