విజృంభిస్తున్న డెంగీ


 పింప్రి, న్యూస్‌లైన్ : పుణే జంటనగరాల్లో డెంగీ విజృంభిస్తోంది. పింప్రి-చించ్‌వడ్ పట్టణాల్లో అత్యధికంగా డెంగీ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో దోమల బెడద తీవ్ర రూపం దాల్చడంతో ఈ దుస్థితి దాపురించింది. వ్యాధి నివారణలో కార్పొరేషన్, అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది.



 రెండోస్థానంలో పింప్రి, చించ్‌వడ్

 ముంబై నగరంలో 178 మంది డెంగీ రోగుల సంఖ్య నమోదు అయ్యాయి. పింప్రి, చించ్‌వడ్ నగరాలు రెండో స్థానాల్ని ఆక్రమించాయి. ఇక్కడ డెంగీ రోగుల సంఖ్య 58. ఠాణేలో 59 మంది డెంగీ రోగుల సంఖ్య నమోదైంది. డెంగీ రోగుల విషయంలో పుణే జిల్లా 6వ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో డెంగీ కారణంగా నలుగురు మరణించారు. ఇందులో పుణేకు చెందిన ఒక రోగి కూడా ఉన్నారు. 2012లో పుణే నగరంతోపాటు గ్రామీణ ప్రాంతాలతో కలిపితే డెంగీ రోగుల సంఖ్య  833 గా నమోదైంది. ఇందులో 8 మంది మరణించారు. 2013లో డెంగీ రోగుల సంఖ్య 833గా నమోదు కాగా, తొమ్మిది మంది మరణించారని రాష్ర్ట ఆరోగ్య సహాయక డెరైక్టర్ డాక్టర్ కాంచన్ జగతాప్ తెలిపారు.



 దోమల నివారణపై కార్పొరేషన్ ప్రత్యేక దృష్టి

 పుణే కార్పొరేషన్ నగరంలోని హౌసింగ్‌సొసైటీలు, జోపడ్‌పట్టీల పరిసరాల్లో, ఇళ్లలోని నీటి ట్యాంకులతోపాటు పరిసరాల్లో పడిన వృథా సామగ్రి కారణంగా దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. దోమల వ్యాప్తికి ఇదే ప్రముఖ కారణంగా వైద్యులు పేర్కొన్నారు. దోమల నివారణలో భాగంగా ముందుగా పరిసరాలు, ట్యాంకర్లను శుభ్రపరచుకోవాలని కొర్పొరేషన్ ఆరోగ్య విభాగం తెలిపింది. నగరంలోని సహకార నగర్, తిలక్ మార్గంలో దోమల వ్యాప్తి ఎక్కువగా జరుగుతోందని కార్పొరేషన్ కీటక నాశక విభాగం తెలిపింది.



 నగరంలో ఇప్పటి వరకు 73,893 దోమలు వ్యాప్తి చెందే ప్రాంతాలుగా గుర్తించారు. ఇందులో 40,135 ప్రాంతాలు శాశ్వతంగా దోమలకు నిలయాలుగా మారాయి.  33,758 ప్రాంతాలు దోమల వ్యాప్తికి, వర్షాకాలంలో నిలిచే నీటి వల్ల ఉత్పత్తి అయ్యేవిగా గుర్తించినట్లు ఈ విభాగం అధికారి డాక్టర్ వైశాలీ జాధవ్ తెలిపారు. నగరంలో 24,900 నీటి ట్యాంకులలో డాస్ ఉత్పత్తి జరుగుతున్నట్లు, 23,630 ప్రాంతాల్లో పనికిరాని వస్తువుల కారణంగా డాస్ ఉత్పత్తి జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.



 నగరంలో హడప్సర్‌లో 12,650 ప్రాంతాలు దోమలకు నిలయాలుగా మొదటి స్థానంలో ఉండగా, సహకార్ నగర్, తిలక్ మార్గం ద్వితీయ స్థానంలో నిలిచాయి. వీటితోపాటు డ్రైనేజీలు, సెప్టిక్ ట్యాంకులు, చెత్త కుండీలు, గుంతల్లో నీరు నిలిచిన ప్రాంతాలలో ఈ దోమల బెడద ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.



 మొదటగా విద్యార్థులకు అవగాహన

 డెంగీ రోగ కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మొదటి సారిగా ప్రభుత్వ ఆరోగ్య విభాగం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. డెంగీ రోగ నిరోధకంపై పాఠశాల విద్యార్థులలో అవగాహన కల్పించనున్నారు.



 మొదటగా జిల్లా పరిషత్ పాఠశాల్లోని విద్యార్థులకు ఈ విషయాల గురించి తెలియజేయనున్నట్లు డాక్టర్ జగతాప్ తెలిపారు. పుణే జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 600 పాఠశాలల్లో ఈ జాగృతి కార్యక్రమాన్ని నిర్వహించనన్నామన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top