ప్రచార సామగ్రికి డిమాండ్


సాక్షి, ముంబై: ఎన్నికల ప్రచార సామగ్రి విక్రయించే షాపులన్నీ కొనుగోలుదార్లతో కిటకిటలాడుతున్నాయి.  శివసేన-బీజేపీ నేతృత్వంలోని మహాకూటమి, కాంగ్రెస్-ఎన్సీపీ ప్రజాస్వామ్య కూటముల మధ్య పొత్తు ఉంటుందా..? ఊడుతుందా...? అనే దానిపై మొన్నటి వరకు ఇరు పార్టీల నాయకులు సందిగ్ధంలో పడిపోయారు. దీంతో ఎన్నికల సామగ్రి కొనుగోలు చేయలేకపోయారు. కాని ఇరు కూటముల మధ్య పొత్తు బెడిసి కొట్టడంతో రాష్ట్రంలోని మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాల్లోనూ అన్ని పార్టీల అభ్యర్థులు పోటీచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.



అందుకు అన్ని నియోజక వర్గాల్లోనూ ప్రచారం చేసేందుకు అవసరమైన ప్రచార సామగ్రి కూడా భారీ మొత్తంలో కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. షాపుల్లో ముఖ్యంగా పార్టీ గుర్తులతో ముద్రించిన క్యాపులు, బ్యాడ్జీలు, కండువాలు, మాస్క్‌లు, చిన్న, పెద్ద జెండాలు, చీరలు, టీ-షర్టులు, కుర్తాలు, తలకు చుట్టుకునే రిబ్బన్లు, బ్యానర్లు, ప్ల కార్డులు, కరపత్రాలు ఇలా మొత్తం 25 రకాలకు పైగా ప్రచార సామగ్రి విక్రయానికి ఉంచారు. నగరంలో లాల్‌బాగ్, దాదర్, క్రాఫర్డ్ మార్కెట్, నటరాజ్ మార్కెట్ తదితర ప్రాంతాలు ప్రచార సామగ్రి తయారీకి ప్రసిద్ధి చెందాయి. పొత్తు బెడిసికొట్టడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది. దీంతో మార్కెట్లో, షాపుల్లో సామగ్రి కొరత ఏర్పడింది. కొందరు నాయకులు అర్డర్లు ఇచ్చి మరీ తయారు చేయించుకుంటున్నారు.



 ఎన్నికల పుణ్యమాని అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తోంది. కరపత్రాలు, ఇతర ప్రచార సామగ్రి ముద్రించే ప్రింటింగ్ ప్రెస్‌లకు, ఆఫ్‌సెట్ ప్రింటింగ్ పనులకు పెద్ద ఎత్తున అర్డర్లు దొరికాయి. అందులో ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులకు తోడు అదనంగా కార్మికులను నియమించాల్సి వస్తోంది. అయినప్పటికీ సమయానికి సామగ్రి అందజేయలేకపోతున్నారు.



ఎన్నికలకు సమయం చాలా తక్కువ ఉండడంతో సాధ్యమైనంత త్వరగా ప్రచార సామగ్రి అందజేయాలని నాయకులు వారిపై ఒత్తిడి తెస్తున్నారు. అందుకు వారు అడిగినంత చెల్లించేందుకు సైతం సిద్ధపడుతున్నారు. ఒక్కసారిగా పెరిగిన డిమాండ్‌తో వ్యాపారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రింటింగ్ ప్రెస్ రంగంలో రూ.70-80 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు జరుగుతాయని ఓ వ్యాపారి తెలిపాడు. ఏదేమైనా ఈ ఎన్నికలు నిరుద్యోగులకు ఒక వరంగా పరిణమించాయని చెప్పవచ్చు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top