రాజధానిలోనూ మగబిడ్డకే ప్రాధాన్యత..!

రాజధానిలోనూ మగబిడ్డకే ప్రాధాన్యత..!


న్యూఢిల్లీః భారత్ లో బాలికల సంఖ్య తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఓ పక్క ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతుంటే... తాజా సర్వేలు ఒణుకు పుట్టిస్తున్నాయి. సమాజంలో ఆడపిల్లల సంఖ్య తగ్గడంతో భవిష్యత్ లో ఎదురయ్యే పరిణామాలను ఊహించిన కేంద్ర ప్రభుత్వం... ఆ దిశగా దృష్టి సారిస్తూ ప్రత్యేక పథకాలతో కసరత్తు చేస్తుంటే... రాజధానిలో కొన్ని సంస్థలు  చేపట్టిన సర్వేలు ప్రభుత్వానికి దడ పుట్టించాయి.



దేశ రాజధాని నగరం ఢిల్లీలో నిర్వహించిన తాజా సర్వేలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. అక్కడి తల్లిదండ్రులు ఎక్కువశాతం మగబిడ్డకే ప్రాముఖ్యతను ఇస్తున్నట్లు తాజా  లెక్కలు చెప్తున్నాయి.  రెండు నెలలపాటు అధ్యయనాలు నిర్వహించిన ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ బుధవారం ఫలితాలను వెల్లడించింది. సంస్థ సంవత్సరంపాటు వింగ్స్ టు ఫ్లై పేరిట చేపట్టిన ప్రచార ఫలితాల ప్రారంభ కార్యక్రమంలో ఈ ఆశ్చర్యకర విషయాలను వెల్లడించింది. అయితే ప్రభుత్వ పథకాలపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నట్లు ఈ కొత్త స్టడీ తెలిపింది. అంతేకాక ప్రభుత్వం ఈ పరిస్థితిపై పూర్తిశాతం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని,  ముందుగా కుటుంబ సభ్యునుంచే ఈ అవగాహనా కార్యక్రమాన్ని ప్రారంభించాలని సంస్థ అభిప్రాయపడింది. తమ సంస్థ.. దేశంలోని 520 శాఖల ద్వారా ప్రతినెలా 24 వ తేదీ బాలికల ప్రాముఖ్యతపై  ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలను చేపడుతున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ వీణా కోహ్లీ తెలిపారు.   



ఢిల్లీలో ఆడపిల్లల నిష్పత్తి రేటును పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుండగా... అక్కడి తల్లిదండ్రులు మాత్రం మగబిడ్డలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తాజా లెక్కలను బట్టి స్సష్టంగా తెలుస్తోంది. ప్రభుత్వం బాలికలకు కల్పిస్తున్న ప్రత్యేక పథకాలపైనా,  పోలీసులు, లా, డాక్టర్లు, కౌన్సిలర్ల సహాయం తీసుకోవడంపైనా  తల్లిదండ్రులకు కొద్దిపాటి అవగాహన ఉన్నా... మగబిడ్డకే ప్రాధాన్యత ఇవ్వడం విస్మయం కలిగిస్తోంది. ఇదిలా ఉంటే.. వింగ్స్ టు ఫ్లై కార్యక్రమానికి హాజరైన మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకా గాంధీ.. మహిళలు, బాలికలకు మరిన్ని ప్రత్యేక పథకాలను ప్రకటించారు.  విద్యార్థినుల భద్రత కోసం అన్ లైన్ లోనే ఫిర్యాదులు పంపేందుకు వీలైన 'ఈ బాక్స్' సేవలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అలాగే పోలీస్ ఫోర్స్ లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. దీనికితోడు గ్రామాల్లో మహిళలకు సహాయపడే షెల్టర్ హోమ్ లు, వన్ స్టాప్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top