నేరచరితులను డిబార్ చేయండి


కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన ఈసీ

న్యూఢిల్లీ: ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా తీవ్రమైన నేరాలు చేసిన అభ్యర్థుల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ప్రతిపాదనలు సిద్ధంచేసింది. తీవ్రమైన నేరాల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని ఎన్నికల్లో పోటీ నుంచి నిషేధించే విధంగా రూపొందించిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అలాగే తప్పుడు అఫిడవిట్లు ఇచ్చిన వారిపై కూడా అనర్హత వేటు వేయడానికి నిబంధనలు సిద్ధం చేసింది. తీవ్రమైన నేరాల్లో దోషులుగా తేలిన వారిని తక్షణం అనర్హులను చేయాలనే సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈసీ ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

 

 నేరాభియోగాలు ఎదుర్కొంటూ కనీసం ఐదేళ్లు జైలు శిక్ష పడే కేసుల్లోని వ్యక్తులపై అనర్హత వేటు వేసే దిశగా చేసిన ప్రతిపాదనలను కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖకు పంపినట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీఎస్ సంపత్ పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. సదరు అభియోగాలను ఎన్నికల తేదీకి కనీసం ఆరు నెలల ముందు మెజిస్ట్రేట్ నమోదు చేసి ఉండాలనే నిబంధన కూడా జతచేశామన్నారు. దీని వల్ల రాజకీయ దురుద్దేశంతో ఈ నిబంధనలను దుర్వినియోగం చేసేవారికి అడ్డుకట్ట వేయవచ్చన్నారు. తమ ప్రతిపాదనలను న్యాయమంత్రిత్వ శాఖ.. ఎన్నికల సంస్కరణలకు సిఫార్సులు చేసే లా కమిషన్‌కు పంపుతుందని సంపత్ తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top