అహ్మదాబాద్ నుంచి అండమాన్‌కు

అహ్మదాబాద్ నుంచి అండమాన్‌కు - Sakshi


మోదీ భార్య వార్త ప్రసారం చేసినందుకు దూరదర్శన్ అధికారిపై వేటు!

 

 

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ భార్య జశోదాబెన్‌కు సంబంధించిన వార్తను ప్రసారం చేసిన అహ్మదాబాద్‌లోని దూరదర్శన్ గుజరాత్ చానల్ అధికారిపై బదిలీ వేటు పడింది. ఏడాదిలో రిటైర్ కాబోతున్న ఆయనను ఏకంగా అండమాన్‌కు బదిలీ చేశారు. ప్రధాని భార్యగా తనకు అందిస్తున్న సదుపాయాలు ఏమిటో తెలపాలని జశోద దాఖలు చేసిన సమాచారహక్కు దరఖాస్తుపై  రెండు నిమిషాల్లోపు వార్త గత నెల 1న ‘డీడీ గిర్నార్’లో ప్రసారమైంది. ఆ రోజు చానల్ కోసం గుజరాత్ వార్తలు సేకరించిన అసిస్టెంట్ డెరైక్టర్ వీఎం వనోల్(58)ను జనవరి రెండో వారంలో అండమాన్‌లోని పోర్ట్ బ్లెయిట్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దీన్ని వనోల్ ధ్రువీకరించారు. అయితే బదిలీకి దారితీసిన వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు.

 

 మందలింపు..!

 

 ఈ వార్త ప్రసారమైన మరుసటి రోజు ఢిల్లీలోని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు డీడీ గిర్నార్ అధికారులతో మాట్లాడి వివరణ ఇవ్వాలన్నారు. జనవరి 1 నాటి వార్తలు సమకూర్చిన వనోల్‌తోపాటు జాయింట్ డెరైక్టర్, మరో ఇద్దరు అసిస్టెంట్ డెరైక్టర్లను మందలించినట్లు సమాచారం. అయితే ఢిల్లీ అధికారులు సాధారణ సమీక్షలో భాగంగానే గిర్నార్ అధికారులతో మాట్లాడారని, ఏదో ప్రత్యేక అంశంపై కాదని సమాచార, ప్రసార శాఖ ఉన్నతాధికారులు అధికారులు చెబుతున్నారు. వనోల్ బదిలీ సంపాదక, పాలనాపరమైన నిర్ణయమని, దీనికి మరే ఉదంతంతోనూ సంబంధం లేదని చెప్పారు. దీనిపై డీడీ గిర్నార్ ఉద్యోగి ఒకరు మాట్లాడుతూ.. ‘ఆ రోజు(జనవరి 1) గుజరాత్ వార్తల సేకరణ బాధ్యత వనోల్ చేపట్టారు. జశోదాబెన్ వార్తను అన్ని ప్రైవేట్ టీవీ చానళ్లు ప్రధానంగా ప్రసారం చేయడంతో దానిపై ఆయన చిన్నవార్త ఇవ్వాలని నిర్ణయించారు’ అని తెలిపారు. కాగా, జశోద ఆర్టీఐ దరఖాస్తు వార్తను డీడీ గిర్నార్ గత డిసెంబర్‌లోనూ ప్రసారం చేసినా ఎవరూ దాన్ని పెద్దగా పట్టించుకోలేదని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top